అనంతపురం : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమా అని వైయస్‌ఆర్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ప్రశ్నించారు. కూటమి అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతున్నా ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఆదివారం వైయస్ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 11 నెలలుగా మాటలకే పరిమితం అవుతున్నారని దుయ్యాబట్టారు. ఇంకా ఆయన ఏమన్నారంటే ‘‘రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు అవుతోంది. రాష్ట్రంలో పరిస్థితులు చూస్తే ఆందోళనకరంగా ఉన్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలతో పాటు అనేక వాగ్ధానాలను మేనిఫెస్టోలో పెట్టారు. కానీ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదు. కేవలం మాటలకే పరిమితం అవుతున్నారు. రాష్ట్రంలో సంక్షేమం అందించే విషయంలో, అభివృద్ధి విషయంలో ఒక ప్రణాళికతో ముందుకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. కూటమి ప్రభుత్వం పింఛన్లు ఇవ్వడం మినహా ఏ పథకాన్నీ అమలు చేయలేదు. పింఛన్లలోనూ 11 నెలల కాలంలో సుమారు 3 లక్షల మందికి పైగా కోత పెట్టారు. దివ్యాంగుల పింఛన్లకు సంబంధించి సవాలక్ష నిబంధనలు పెడుతున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే డీఎస్సీపై చంద్రబాబు తొలి సంతకం పెట్టారు. 16 వేల పోస్టులు భర్తీ చేస్తానని చెప్పి 11 నెలలకు నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చారు. వచ్చే అకడమిక్ ఇయర్ ప్రారంభం అయ్యేలోగా టీచర్ పోస్టులు భర్తీ చేసే పరిస్థితి కూడా కనిపించడం లేదు. సూపర్ సిక్స్ హామీలో భాగంగా తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి ఏటా రూ.15 వేలు ఇస్తానని ఇప్పటికే ఒక ఏడాది ఎగ్గొట్టారు. ఈ ఏడాది మేలో తల్లికి వందనం ఇస్తానని గతంలో చెప్పారు. తాజాగా తల్లికి వందనం ఒక విడతలో ఇవ్వాలో.. ఎలా ఇవ్వాలో ఆలోచిస్తున్నామని చంద్రబాబు చెప్పడం చూస్తే ఆయనది నోరా? తాటిమట్టా? అని భావించాల్సి వస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చాక రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. గతంలో వైయస్ఆర్‌సీపీ అధికారంలో ఉండగా రైతు భరోసా పథకం కింద ఏటా రూ.13,500 అందజేశాం. కూటమి ప్రభుత్వం ఏటా రూ.20 వేలు ఇస్తామని చెప్పినా ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు అందడం లేదు. ధాన్యం నుంచి ఉద్యానపంటల వరకు వేటికీ మద్దతు ధర లభించడం లేదు. 11 నెలల్లో వ్యవసాయశాఖ అనేది ఒకటుందా? అనే పరిస్థితికి వచ్చింది. రైతాంగాన్ని ఆదుకునే విషయంలో సమగ్రమైన సమీక్ష కూడా చేసిన దాఖలా లేదు. కేవలం రాజధాని పేరుతో కాలయాపన చేస్తున్నారు. 2014లో రాష్ట్రం విడిపోయాక చంద్రబాబు రాజధాని పేరుతో ఏ అభివృద్ధీ చేయలేదు. ఇప్పుడు రాజధానికి లక్ష కోట్ల పెట్టాలని అంటున్నారు. ఇప్పటికే అమరావతిలో 58 వేల ఎకరాలు అందుబాటులో ఉంది. మళ్లీ 44 వేల ఎకరాలు కావాలని అంటున్నారు. ఇప్పటికే సేకరించిన భూమిలో అభివృద్ధి చేయలేదు. రైతులకు ప్లాట్లు కేటాయించలేదు. మళ్లీ ఇప్పుడు ల్యాండ్ పూలింగ్, భూసేకరణ అంటున్నారు. ఇది ప్రభుత్వమా? రియల్ ఎస్టేట్ వ్యాపారమా? చంద్రబాబు ముఖ్యమంత్రా? లేక సీఎం సీట్లో కూర్చుని రియల్ ఎస్టేట్ చేయడానికి ఉన్నారా? కూటమి పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాలు అన్యాయానికి గురి అయ్యాయి. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అప్పులు చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఇప్పటికే 1.47 లక్షల కోట్లు అప్పు చేశారు. ఇదేనా సంపద సృష్టి అంటే? చివరకు దేశ చరిత్రలో ఎక్కడా, ఎన్నడూ లేని విధంగా గనులను కూడా అప్పుల కోసం తాకట్టు పెడుతున్న పరిస్థితి దాపురించింది. రాష్ట్ర అభివృద్ధి విషయంలోనూ ఒక ప్రణాళిక లేదు. గతంలో ఐదేళ్లు రాజధాని పేరుతో ఎలా గడిపారో మళ్లీ అదే బాటలో వెళ్తున్నారు. గతంలో మోదీ రాజధాని కోసం మట్టి, నీళ్లు తెచ్చారు. ఇప్పుడు రాజధాని పునఃనిర్మాణం అంటూ మరోసారి ప్రధానిని రప్పిస్తున్నారు. 2014లో ఇదే ప్రధాని మోదీతో రాజధాని నిర్మాణానికి ఫౌండేషన్ వేయించి చివరకు 2019 ఎన్నికలు వచ్చే సమయానికి మోదీ ఏమీ చేయలేదని పొత్తు కూడా వీడారు. ఆ తర్వాత పొత్తు పెట్టుకుని గెలిచి మళ్లీ ఇప్పుడు మోదీని రప్పిస్తున్నారు? ప్రజలకు ఏం సమాధానం చెబుతారు? రాయలసీమలో వెనుకబడిన జిల్లాలు ఉన్నాయి. వాటి అభివృద్ధి గురించి ఆలోచించరా? మోదీ రానున్న నేపథ్యంలో స్పష్టమైన ప్రకటన చేయించండి. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టును 45.75 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గిస్తుంటే ఏమీ మాట్లాడరా? కేంద్రం కుట్ర చేస్తే అందులో మీరు భాగస్వాములయ్యారు. ముంపు ప్రాంతాలకు పరిహారం ఇవ్వాలనో.. ఇతర కారణాలు చూపితే తలూపుతారా? పోలవరం ఎత్తును కుదిస్తున్నా మారుమాట్లాడకుండా పోలవరం–బనకచెర్ల అనుసంధానం పేరుతో మరోసారి మోసం చేస్తున్నారు. పోలవరం ఎత్తు తగ్గిస్తే నీరు ఎలా వస్తాయి? ఇదంతా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమే. చంద్రబాబు ఎన్నికలకు ముందు ఒక మాట.. ఎన్నికల తర్వాత మరోమాట మాట్లాడుతున్నారు. గడిచిన 11 నెలల్లో రాజకీయ ప్రయోజనాలు తప్పితే రాష్ట్ర ప్రయోజనాల గురించి చంద్రబాబు ఆలోచించలేదు. అన్ని వర్గాలను మోసం చేశారు. పరిశ్రమలు తెస్తామని చెప్పి ఊరూరా బెల్టుషాపులు తెచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 99 రూపాయలకు క్వార్టర్ బాటిల్.. 99 పైసలకు ఎకరా భూమిని తమకు కావాల్సిన వారికి ధారాదత్తం చేస్తున్నారు. కోట్లు విలువైన భూమిని 99 పైసలకు ఇవ్వచ్చని నిరూపించిన ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమే. ప్రధాని మోదీ రాక నేపథ్యంలో పక్కా ప్రణాళికతో రాష్ట్ర ప్రయోజనాల కోసం విన్నవించాలని కోరుతున్నాం’’ అని అనంత వెంకటరామిరెడ్డి సూచించారు.