తాడేపల్లి: దేశంలో అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుల్లో ఒకరైన మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు పోలీస్ భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ ఏర్పాటైన తరువాత నుంచి జెడ్‌ప్లస్ కేటగిరి ఉన్న వైయస్ జగన్ భద్రత పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆయన ఎక్కడ పర్యటించినా వేల సంఖ్యలో అభిమానులు వస్తుంటారని, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కనీస పోలీస్ బందోబస్త్ కూడా ఏర్పాటు చేయలేదని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే.. రామగిరి మండలంలో వైయస్ఆర్‌సీపీ నాయకుడు లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో పాపిరెడ్డిపల్లెకు వెళ్లిన వైయస్ జగన్‌కి భద్రత కల్పించడంలో ఈ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించింది. ప్రతిపక్ష నాయకుడికి భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించింది. అంతే కాకుండా జగన్ పర్యటనపై హోంమంత్రి అనిత అహంకారపూరితంగా చేసిన వ్యాఖ్యలను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి. లోపాలను సరిద్దిద్దుకుంటామని కానీ, నిర్లక్ష్యానికి కారణమైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కానీ హోంమంత్రి చెప్పకపోవడం చూస్తుంటే జగన్ భద్రత విషయంలో ప్రభుత్వ వ్యవహారశైలిపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. జగన్‌ను పులివెందుల ఎమ్మెల్యే అని మాట్లాడినంత మాత్రాన ఆయనకున్న ప్రజాదరణను ఏమాత్రం తగ్గించలేరని గుర్తించుకోవాలి. రోజూ ఏదొక మూలన రాష్ట్రంలో మహిళలపై దాడులు జరుగుతున్నా ఈ హోంమంత్రికి బాధితులను పరామర్శించే తీరిక ఉండదు. వైయస్ జగన్ ప్రజలకు అండగా నిలబడితే ఆయన్ను విమర్శించడానికి మాత్రం మీడియా ముందు వాలిపోతుంటారు. ఈ రాష్ట్రంలో నివాసమే ఉండని వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ కూడా వైయస్ జగన్ గురించి ఆరోపణలు చేయడం విడ్డూరం. పేరులో ఉన్న సత్యం ఆయన మాటల్లో ఏనాడూ కనపడదు. రాజకీయ భిక్ష పెట్టిన జగన్ ని ఉద్దేశించి మాట్లాడే స్థాయికి ఎంపీ కృష్ణదేవరాయలు తెగబడ్డాడు. కేంద్రానికి తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నాడు. టీడీపీకి తొత్తుల్లా వ్యవహరిస్తున్నారు రామగిరి ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ఎమ్మెల్యే పరిటాల సునీత అనైతికంగా వ్యవహరిస్తే, పరిటాల కుటుంబానికి ఎస్సై సుధాకర్ తొత్తులా వ్యవహరించి వైయస్సార్సీపీ ఎంపీటీసీలపై బెదిరింపులకు దిగాడు. పాపిరెడ్డిపల్లెలో వైయస్సార్సీపీ కార్యకర్తల ఇళ్లపై టీడీపీ కార్యకర్తలు దాడులు చేస్తుంటే వారిపై కేసులు నమోదు చేయకుండా బాధిత కుటుంబాలపైనే కేసులు నమోదు చేసిన నీచంగా వ్యవహరించాడు. రాష్ట్రవ్యాప్తంగా కొంతమంది ఎస్సై సుధాకర్ లాంటి పోలీసులు చట్టాలను ఉల్లంఘించి టీడీపీ నాయకులకు వత్తాసు పలుకుతున్నారు. కూటమి ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను సొంత ప్రైవేటు సైన్యంలా వాడుకుంటూ వైయస్సార్సీపీ నాయకులను వేధింపులకు గురిచేస్తున్నారు. ఎన్నికలు పూర్తయినప్పుడు భయంతో రాష్ట్రం విడిచి వెళ్లిన కుటుంబాలు 10 నెలల తర్వాత కూడా నేటికీ గ్రామాల్లో అడుగు పెట్టలేని భయానక వాతావరణం రాష్ట్రంలో కనిపిస్తోంది. రాష్ట్రంలో గాడితప్పిన శాంతిభద్రతలు రాష్ట్రంలో శాంతిభద్రతలు అనేవి ఉన్నాయా అనే అనుమానం కలుగుతోంది. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి ఉంటే రాష్ట్రంలో నడిరోడ్డు మీద హత్యలు, ఇళ్లపైన దాడులు, మహిళలపై అత్యాచారాలు, యాసిడ్ దాడులు, భూ కబ్జాలు జరిగేవా? వైయస్సార్సీపీ నాయకుల మీద పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేస్తుంటే ఇప్పటికే అనేకసార్లు పోలీసులకు కోర్టులు మొట్టికాయలు వేసిన దుస్థితి నెలకొంది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ మీద సీఎం చంద్రబాబు దృష్టిసారించాలి. రాప్తాడు లాంటి ఘటనలు రాష్ట్రంలో పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్ధానాలు ఇకనైనా నెరవేర్చకపోతే దారితప్పిన ఈ శాంతిభదత్రలు మీకే ప్రమాదంగా పరిణమించినా ఆశ్చర్యపోనవసరం లేదు.