హిందూధర్మం పట్ల చంద్రబాబుకు గౌరవం లేదు

టీడీపీ హయాంలో పెద్ద ఎత్తున ఆలయాల ధ్వంసం

నేడు తిరుమల పవిత్రతను మంటగలుపుతున్నారు

మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు 

తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు

వైయస్ జగన్ హయాంలో పరిఢవిల్లిన హిందూ ధర్మం

హిందూ ధర్మపరిరక్షణకు చిత్తశుద్దితో కృషి చేశారు

చంద్రబాబు కూల్చిన ఆలయాలను వైయస్ జగన్ నిర్మించారు

నిత్యం జగన్‌పై మతం పేరుతో బుదరచల్లుతున్న కూటమి పార్టీలు

దానిలో భాగంగానే  హోంమంత్రి అనిత తప్పుడు ఆరోపణలు

మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం

తాడేపల్లి:  హిందూధర్మం పట్ల చంద్రబాబుకు ఏ మాత్రం గౌరవం లేదని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో హిందూ ఆలయాలను పెద్ద సంఖ్యలో కూల్చిన దుర్మార్గం చంద్రబాబుది అయితే, తాను అధికారంలోకి రాగానే వాటిని పునర్ నిర్మించిన ఘనత వైయస్ జగన్‌ది అని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా నిత్యం వైయస్ జగన్‌పై హిందూధర్మంకు వ్యతిరేకమంటూ విషప్రచారం చేయడమే కూటమి పార్టీలు పనిగా పెట్టుకున్నాయని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 
ఇంకా ఆయనేమన్నారంటే...

కూటమి పార్టీల పదినెలల పాలనలో అన్ని విధాలుగా రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించాయి. ప్రజలకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కాయి. ఇప్పటికే కూటమి సర్కార్‌పై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీని నుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకు ప్రతి సందర్భంలోనూ మత విద్వేషంను సృష్టించేలా ప్రభుత్వం మాట్లాడుతోంది. దీనిలో భాగంగానే తాజాగా కేబినెట్ మీటింగ్ తరువాత రాష్ట్ర హోంమంత్రి మాట్లాడిన మాటలు. శ్రీకాకుళం జిల్లాలో రెండు చర్చీల మధ్య వ్యవహారంలో పక్కనే ఉన్న ఆలయంపై జీసస్ వాఖ్యాలు రాయించిన ఉదంతంను హోమంత్రి అనిత ఎంత దారుణంగా వక్రీకరించి మాట్లాడారో, ఆ దృశ్యాలను ప్రజలు చూసేందుకు ఈ మీడియా సమావేశంలో ప్రదర్శిస్తున్నాం. వైయస్ జగన్‌కి ఎంత దారుణంగా ఈ వ్యవహారాన్ని అంటగడుతూ మత కలహాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని, రాజకీయాల్లో ఒక క్రిమినల్ ఉంటే ఇలాగే జరుగుతోందని ఆమె మాట్లాడారు. ఇదే అంశంలో వాస్తవాలను అదే జిల్లాకు చెందిన ఎస్పీ వెల్లడించిన దృశ్యాలను కూడా ఈ సందర్భంగా ప్రదర్శిస్తున్నాం. చాలా స్పష్టంగా ఇది రెండు  చర్చీల మధ్య వ్యవహారమే తప్ప, దీనిలో ఇతర మతాలకు సంబంధించిన కవ్వింపు చర్యలు లేవు అని వెల్లడించారు. అంటే హోమంత్రిగా ఉన్న అనిత ఈ అంశాన్ని ఎలా చిత్రీకరించారు, దీనిని మాజీ సీఎం వైయస్ జగన్‌కు ఎలా అంటగట్టారు, మత విద్వేషాలను రగిలించేలా చేస్తున్నారంటూ విషం చిమ్మేలా ఆరోపణలు చేశారు. ఎంత బాధ్యతారహితంగా మాట్లాడారో ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇదీ వీరి నిజస్వరూపం. నిజంగా హిందూధర్మం పట్ల వీరికి చిత్తశుద్ది ఉంటే ఇలాంటి బాధ్యత లేని వ్యాఖలు చేస్తారా? మత కలహాలను రెచ్చగొట్టే ఆలోచన ఎవరికి ఉందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. 

- తమ అసమర్థ పాలనను కప్పిపుచ్చుకునేందుకే

రాష్ట్రంలో హిందుత్వానికి మిత్రులు ఎవరు, శత్రువులు ఎవరు అని చూస్తే అసలు వాస్తవాలు తెలుస్తాయి. కూటమి ప్రభుత్వంలో భారీగా హిందూ ఆలయాల ధ్వంసం, ఆలయాలపై దాడులు జరిగాయి. తిరుమల పవిత్రత మంటగలిసేలా వ్యవహరించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2014-19 వరకు, అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వ పదినెలల పాలనలో చాలా స్పష్టంగా ఈ అరాచకం కనిపిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదు, దారుణంగా పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలు, పెరుగుతున్న అప్పులు, ప్రజల నడ్డి విరుస్తున్న విద్యుత్ చార్జీలు, రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు, రాష్ట్రంలో కొరవడిన శాంతిభద్రతల సమస్య, అన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్న దోపిడీ, కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న దారుణాల నుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకు ఏకైక ఎజెండాగా వైయస్ జగన్ గారిపై బుదరచల్లడం, డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడటం చేస్తున్నారు. కూటమిలోని మూడు పార్టీలకు ఇది ఒక అలవాటుగా మారింది. 

- వైయస్ జగన్‌కు హిందూధర్మం పట్ల అత్యంత భక్తిశ్రద్దలు

వైయస్ జగన్ గారిపై మత ముద్ర వేయడం, ఆయన తిరుమలకు వెళ్ళాలని ప్రయత్నించిన సందర్భాల్లో డిక్లరేషన్ ఇవ్వాలంటూ కూటమి పార్టీలు యాగీ చేస్తున్నాయి.  ఆయన ఈ రాష్ట్రంలో తన పాదయాత్ర ప్రారంభించే ముందు తిరుమలకు వెళ్ళి శ్రీవారిని దర్శించుకున్న తరువాత యాత్రను ప్రారంభించారు. అలాగే యాత్ర ముగిసిన తరువాత కూడా శ్రీవారిని దర్శించుకుని వచ్చారు. అటువంటి హిందూ మత సంప్రదాయాలను  భక్తితో ఆచరిస్తున్నారు. శ్రీవారి ఉత్సవాల్లోనూ భక్తితో పట్టువస్త్రాలను సమర్పిస్తూ వచ్చారు. అయినా కూడా కూటమి ప్రభుత్వం వైయస్ జగన్ పై దుష్ప్రచారం చేస్తోంది. కుట్ర, కుతంత్రాలతో వ్యవహరిస్తోంది. ఏనాడు వైయస్ జగన్ హిందూ మత విశ్వాసాలకు వ్యతిరేకంగా వ్యవహరించలేదు. నిలువెల్లా విషంతో కూటమి పెద్దలు వైయస్ జనగ్ పై దుష్ప్రచారం చేస్తున్నారు. సనాతన హిందుత్వవాదిని అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఇటీవల తిరుమలలో జరిగిన అనాచారాలపై ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేదు?

- పీఠాధిపతులను ఆదరించారు

వైయస్ఆర్‌సీపీ హయాంలో హిందూ ధర్మ పరిరక్షణ, ధర్మ ప్రచారం వర్థిల్లింది. ప్రకాశం బ్యారేజీకి పక్కన విజయకీలాద్రి కొండ మీద చిన్నజీయర్ స్వామి ఆలయ నిర్మాణం కోసం గత తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు కోరినా వారు నిరాకరించారు. వైయస్ జగన్ గారు అధికారంలోకి వచ్చిన వెంటనే జీయర్ స్వామి వారి కోరికను గౌరవించి అన్ని అనుమతులు ఇచ్చారు. అలాగే గణపతి సచ్చితానంద స్వామి ఆశ్రమానికి సంబంధించి అనంతపురంలో భూమికి సంబంధించి ప్రభుత్వంతో ఉన్న ఇబ్బందులపై సీఎం వైయస్ జగన్ దృష్టికి తీసుకురావడంతో ఆయన స్పందించి ఆ వివాదాలన్నింటినీ పరిష్కరించారు. ఆలాగే విశాఖలోని స్వరూపానంద స్వామి ఆశ్రమానికి మా హయాంలో భూమి కేటాయిస్తే, అందులో నిర్మించిన నిర్మాణాలను కూటమి ప్రభుత్వం కూల్చేందుకు ప్రయత్నించింది. గతంలో వైయస్ఆర్, ఇప్పుడు వైయస్ జగన్ హయాంలో హిందుత్వాన్ని గౌరవించడం, హిందూధర్మ పరిరక్షణకు చిత్తశుద్దితో చర్యలు తీసుకున్నాం. కూటమి హయాంలో ఈ రాష్ట్రలో జరుగుతున్న అఘాయిత్యాలు, దోపిడీని చూసి మేం నేర్చుకోవాలా? 

- టీడీపీ ప్రభుత్వంలో హిందూ ధర్మం ధ్వంసం

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కనకదుర్గమ్మగుడిలో అర్థరాత్రి సమయంలో తాంత్రిక పూజలు నిర్వహించారు. కృష్ణా పుష్కరాల సమయంలో విజయవాడలో దాదాపు నలబై ఆలయాలను ధ్వంసం చేసి, విగ్రహాలను చెత్త ట్రాక్టర్‌లలో తరలించారు. వైయస్ జగన్ ప్రభుత్వంలో ఆ ఆలయాలను పునర్ నిర్మించారు. కడప జిల్లాలో కాశీనాయన క్షేత్రం లోని అటవీభూములను డీ నోటిఫై  చేయాలని వైయస్ జగన్ కేంద్రానికి లేఖ రాశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఇదే క్షేత్రంలోని అన్నదాన సత్రాలను, ధార్మిక కార్యక్రమాల కట్టడాలను దారుణంగా ధ్వంసం చేశారు. అలాగే ఇటీవలే తిరుపతిలోని టీటీడీ గోశాలలో వందకు పైగా పశువులు నిర్లక్ష్యం కారణంగా మృత్యువాత పడ్డాయి. ఈ విషయాన్ని మాజీ టీటీడీ బోర్డ్ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి వెలుగులోకి తీసుకువచ్చారు. దానిపైన టీటీడీతో పాటు ఈ కూటమి ప్రభుత్వం ఎదురుదాడి చేసింది. తిరుమలలో ఎగ్ పలావ్‌ తీసుకువెళ్ళడం, అన్యమతస్తుడి హంగామా, మద్యం విక్రయిస్తున్న బెల్ట్ షాప్‌ను పోలీసులే పట్టుకోవడం చూస్తుంటే శ్రీవారి క్షేత్రం పవిత్రతను ఎంత దిగజారుస్తున్నారోననే ఆవేదన కలుగుతోంది. రామతీర్థంలో స్వామివారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తికి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రభుత్వం రూ.5 లక్షలు ఇచ్చారు. అలాగే మా హయాంలో అంతర్వేదిలో ప్రమాదవశాత్తు రథం దగ్ధమైతే, వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని స్వామివారికి కొత్త రథాన్ని సిద్దం చేసి అందించింది. ఆనాటి సీఎం వైయస్ జగన్ గారు సంప్రదాయబద్దంగా ఆలయానికి రథాన్ని అందించారు.

Back to Top