అమరావతి టెండర్లలో కూటమి సర్కార్ భారీ దోపిడీ

అభివృద్ధి మంత్ర ముసుగులో చంద్రబాబు అవినీతి తంత్రం

సెల్ఫ్ ఫైనాన్స్ అంటూనే రూ.52వేల కోట్ల అప్పులు

అధిక రేట్లకు అనుకూల సంస్థలకు పనులు

వారి నుంచి పెద్ద ఎత్తున కమీషన్ల వసూళ్ళు

మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు ధ్వజం

అప్పుల్లో రాష్ట్రం సరికొత్త రికార్డ్‌

సొమ్ము చంద్రబాబు జేబుల్లోకి... భారం ప్రజల నెత్తిపైకి

దుబారాతో ప్రజాధనం దుర్వినియోగం

మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు ఆగ్రహం

తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు

తాడేపల్లి: రాజధాని అమరావతి నిర్మాణం కోసం తాజాగా పిలిచిన టెండర్లలో భారీ దోపిడీకి కూటమి ప్రభుత్వం సిద్దమైందని వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పైకి రాజధాని అభివృద్ది మంత్రంను జపిస్తున్నా, దీని వెనుక పెద్ద ఎత్తున అవినీతి కుతంత్రం దాగి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చెబుతూనే వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి, దానిలోంచి కమీషన్ల రూపంలో జేబులు నింపుకునేందుకు చంద్రబాబు స్కెచ్ వేశారని ఆరోపించారు. సొమ్ము చంద్రబాబు జేబుల్లోకి, తెచ్చిన అప్పుల భారం ప్రజల నెత్తిన రుద్దే దుర్మార్గమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ధ్వజమెత్తారు.
 
ఇంకా ఆయనేమన్నారంటే...

అమరావతి నిర్మాణం కోసం కూటమి ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తోంది. పైగా ఈ అప్పులన్నీ కూడా ఎఫ్ఆర్బీఎం పరిధిలో లేనివి. అంటే ఎఫ్ఆర్బీఎం పరిధిలో చేస్తున్న అప్పులకు, ఇవి కలిపితే రాష్ట్రం రుణాంధ్రప్రదేశ్‌గా మారిపోతుంది. అంతిమంగా ప్రజల నెత్తిమీద అప్పులు, వారి చేతిలో చిప్పలు పెట్టే కార్యక్రమంను చంద్రబాబు విజయవంతంగా ప్రారంభించారు. రాష్ట్ర అప్పులు రికార్డులు బద్ధలు కొట్టాయి. గతంలో ఏ ప్రభుత్వం ఈ స్థాయిలో అప్పు చేయలేదు. ఈ 11 నెలల కాలంలోనే చేసిన అప్పులు అక్షరాల రూ.1,47,655 కోట్లు. ఇందులో ఇప్పటికే అమరావతి కోసం నిర్ధారించుకున్న అప్పులు రూ.26,000 కోట్లు. ఈ రూ.26వేల కోట్లు కలుపుకుని అమరావతికి తెచ్చిన, తేవబోతున్న అప్పులు రూ.52 వేల కోట్లు. ప్రపంచ బ్యాంక్‌ నుంచి రూ.15 వేల కోట్లు. జర్మనీ కెఎఫ్‌డబ్ల్యూ నుంచి రూ.5 వేల కోట్లు. హడ్కో నుంచి రూ.11 వేల కోట్లు. సీఆర్‌డీఏ కమిట్‌ అయిన అప్పులు మరో రూ.21 వేల కోట్లు. ఇలా రాజధాని పేరుతో చేసిన, చేస్తున్న అప్పులు రూ.52 వేల కోట్లు. ఇవన్నీ ప్రజలనెత్తిమీద వేస్తున్న భారం. మరి ఈ అప్పులతో ప్రజలకు అవసరమైన అంశాలకు కాకుండా, ఆర్భాటాలు పేరు చెప్పి, హంగులు పేరుచెప్పి, తమ పెద్దపెద్ద బొమ్మలు చూపించి భారీగా దుబారా చేయబోతున్నారు. ఈ దుబారాలో కొన్ని వేల కోట్ల రూపాయలు కమీషన్ల రూపంలో జేబుల్లో వేసుకుంటున్నారు.

పెట్టుబడి వ్యయాలకు మొండిచేయి

రాష్ట్రంలో మెడికల్‌  కాలేజీలు కట్టడానికి, పోర్టులు కట్టడానికి, ఫిషింగ్‌ హార్బర్లు కట్టడానికి వీళ్లకు డబ్బులు లేవంటారు. వాటిని  ప్రైవేటుకు తెగనమ్ముతున్నారు. కాని, అమరావతి కోసం మాత్రం అప్పు పరిమితి చట్టం దాటి మరీ అప్పులు చేసి ప్రజల చేతిలో చిప్ప పెట్టాలని చూస్తున్నారు. అంతేకాదు వీళ్లకు ఆరోగ్య శ్రీ నడపడానికి డబ్బుల్లేవంటారు, ఫీజు రియింబర్స్‌మెంట్‌ కోసం డబ్బుల్లేవంటారు, రైతుకు  పెట్టుబడి సాయం చేయడానికి డబ్బుల్లేవంటారు.. చివరకు వాళ్లిచ్చిన సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవన్‌ అమలు చేయడానికీ డబ్బుల్లేవని అబద్ధాలు చెప్తున్నారు. ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్‌లు నిర్వహించడానికి డబ్బుల్లేవంటారు. మరి ఈ అమరావతి కోసం అప్పులు ఎక్కడనుంచి వస్తున్నాయి? ఎలా వస్తున్నాయి? ఇప్పటికే అమరావతి పేరు చెప్పి తాత్కాలికం పేరుమీద చంద్రబాబు వందలకోట్లు తగలేశారు. వెలగపూడిలో తాత్కాలిక గవర్నమెంటు కాంప్లెక్స్‌లో కేవలం ఆరు బిల్డింగుల కోసం చదరపు అడుగుకు సుమారు రూ.11వేల రూపాయలకుపైనే తగలబెట్టాడు. దాదాపు 6 లక్షల చదరపు అడుగుల మేర నిర్మాణం చేసి ఇప్పుడు వాటి అసరం లేదు, మరొకటి కడతానని చెప్తున్నారు. ఈ ఆరు భవనాల నిర్మాణంలోనే అతిపెద్ద అవినీతి జరిగిందని, పెద్ద ఎత్తున కమీషన్లు వచ్చాయని, నిర్మాణాలు చేసిన కాంట్రాక్టు కంపెనీల నుంచి పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకున్నారని చంద్రబాబుకు ఎదుర్కొంటున్న ఐటీ కేసుల్లోనే బయటపడింది. 

తాత్కలిక భవనాలకూ భారీ ఖర్చు 

తాత్కాలిక భవన నిర్మాణంలో ప్రభుత్వం తన సొంత బడ్జెట్‌ నుంచి కేటాయించిన నిధులకు తోడు, అదనంగా రూ.353 కోట్లు అప్పు చేసి హైకోర్టు సహా తాత్కాలిక అసెంబ్లీ భవనానలు నిర్మించింది. ఇంత డబ్బు తాత్కాలిక భవనాలకోసం ఖర్చు చేయడం ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందా? ఈ భారం ఇప్పుడు ఎవరు మోస్తారు? ప్రజలు కాదా? ఇప్పుడు మళ్లీ శాశ్వత హైకోర్టు, అసెంబ్లీ నిర్మాణాల కోసం సుమారు రూ.1650 కోట్లు ఖర్చుచేస్తున్నారు. మరి ఇంత డబ్బు ఖర్చు చేయాలనుకున్నప్పుడు గతంలో ఎందుకు తాత్కాలిక భవనాల పేరిట అంత డబ్బు ఖర్చు చేశారు? ఆరోజు ఆ ఆలోచన చేసిందీ చంద్రబాబే… ఇవాళ మళ్లీ కొత్త భవనాల పేరిట ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నదీ చంద్రబాబే? ఏమిటీ అరాచకం, ఏమిటీ దుర్మార్గం అడివారు లేరనే టెంపరితనమా? లేక అహంకారమా? ప్రజల భవిష్యత్తును ఆర్థిక అంధకారంలో నింపే ఇలాంటి దుర్మార్గపు చర్యలను కచ్చితంగా ప్రజలు ప్రశ్నిస్తారు. 

పార్లమెంట్, సుప్రీంకోర్ట్ కంటే పెద్ద నిర్మాణాలా...?

హైకోర్టు, అసెంబ్లీ భవనాల నిర్మాణ పనులకు వేర్వేరుగా పిలిచిన టెండర్లలో ఎల్‌ అండ్‌ టీ, ఎన్‌సీసీ సంస్థలు రెండే బిడ్లు దాఖలు చేయడం ఇందులో గమ్మత్తైన విషయం. అంతా సిండికేట్‌.  హైకోర్టు భవనానికి రూ.924.64 కోట్లు, అసెంబ్లీ భవన నిర్మాణ పనులను రూ.724.69 కోట్లు ఖర్చు చేస్తున్నారు. దేశంలో ఎక్కడైనా సరే.. రెండు బిల్డింగులు మీద ఇంత ఖర్చు పెట్టిన దాఖలాలు ఉన్నాయా? ప్రజల సొమ్మును ఇలా మీ కమీషన్లకోసం ధారపోస్తున్నారా? మీరు కట్టేవి సిమెంటు, ఇటుకలు కాకుండా బంగారపు ఇటుకలతో కడుతున్నారా? మన అవసరాలు ఏంటి? మీరు పెడుతున్న ఖర్చులు ఏంటి?     ఇప్పటికే తాత్కాలిక అసెంబ్లీ భవనాన్ని రూ.180 కోట్లతో, తాత్కాలిక హైకోర్టు భవనాన్ని రూ.173 కోట్లతో ప్రభుత్వం నిర్మించింది. ఇప్పుడు శాశ్వత భవనాల నిర్మాణం చేపట్టడంతో తాత్కాలిక భవనాలకు వెచ్చించిన రూ.353 కోట్లు వృథా అవుతాయి. అది కూడా అప్పు తెచ్చిందే కావడం గమనార్హం. ప్రస్తుతం శాశ్వత అసెంబ్లీ, హైకోర్టు భవనాలను నిర్మిస్తున్నది కూడా అప్పుగా తెచ్చిన నిధులతోనే. సుప్రీంకోర్టు కంటే పెద్దగా హైకోర్టు.. పార్లమెంటు కంటే పెద్దగా అసెంబ్లీ భవనాలను నిర్మిస్తుండటం వల్ల నిర్మాణ వ్యయం పెరుగుతుంది. ఇదంతా దుబారా వ్యయమేనని, అప్పుగా తెచ్చిన నిధులను వృథా చేయడమే. సుప్రీంకోర్టు కంటే పెద్దగా, పార్లమెంటు కంటే పెద్దగా కట్టాల్సిన అవసరం మనకు ఉందా? అనే ఇంగితం కూడా అవసరం లేదా? దేశరాజధాని ఢిల్లీల్లో అత్యున్నత శానస వ్యవస్థ ఉండే పార్లమెంటు కొత్త భవనానికి పెట్టింది రూ.970 కోట్లు. కాని 175 మంది సభ్యులున్న కొత్త అసెంబ్లీకోసం చంద్రబాబు పెడుతున్నది రూ.724 కోట్లు. ఇది దోపిడీ కాదా? హైదరాబాద్‌లో కేసీఆర్‌గారు అద్భుతంగా సెక్రటేరియట్‌ కట్టారు. దాదాపు 10.5 లక్షల చదరపు అడుగుల స్థలంలో కట్టారు. దీనికోసం పెట్టిన ఖర్చు సుమారుగా రూ.600 కోట్లు. ఇవన్నీ శాశ్వత నిర్మాణాలు. ఇప్పుడు సెక్రటేరియట్‌ కోసం చంద్రబాబు పెడుతున్న ఖర్చు రూ.724 కోట్లు. అంతకన్నా గొప్పగా ఏముంటుంది? బంగారం వేసి కడుతున్నాడా? ఇప్పటికే తాత్కాలిక హైకోర్టుకు రూ.173 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పుడు మళ్లీ పర్మినెంట్‌ హైకోర్టు పేరిట రూ.924.64 కోట్లు ఖర్చు చేస్తున్నారు. కోర్టు కడుతున్నారా? లేక మరేమైనా కడుతున్నారా? ఈ భారం అంతా ప్రజల మీద కదా? 

రాజధాని నిర్మాణంలో అవినీతి పరుగులు

ఇప్పటికే అమరావతి నిర్మాణంలో చంద్రబాబు సర్కార్ అవినీతి కథలు రికార్డులమీద రికార్డులు సృష్టిస్తున్నాయి. అమరావతి హైవేల నిర్మాణంలో ఒక కిలోమీటర్‌ నిర్మాణానికి గరిష్టంగా రూ.53.88 కోట్లు చేస్తున్నారు. మీరేమైనా బంగారంతో రోడ్డు వేస్తున్నారా? చెప్పాలి. మంత్రులు, న్యాయమూర్తుల ఇళ్ల నిర్మాణాల్లో చదరపు అడుగుకు దాదాపు రూ.10వేలకు పైగా ఖర్చుచేస్తున్నారు. దేశంలో ఏ బంగ్లా అయినా సరే చదరపు అడుగుకు రూ.10 వేలు ఖర్చు చేశారా? హాపీ నెస్ట్‌ వెంచర్ కోసం ఇదివరకు చేసిన ఖర్చులకన్నా మరో రూ.818 ఖర్చు చేస్తున్నారు. చదరపు అడుగుకు అయ్యే ఖర్చు రూ.4500 నుంచి 3000 పెడితే ఫైవ్‌స్టార్‌ లగ్జరీ సదుపాయాలు వస్తాయి. ఇది దోపిడీ కాదా? ఫైవ్‌ స్టార్‌ కన్నా.. ఎక్కువ సదుపాయాలు హ్యాపీ నెస్ట్‌లో ఇస్తున్నారా? మరే కాంట్రాకర్టర్‌ రాకుండా బిడ్‌ వాల్యూను అకస్మాత్తుగా పెంచేసి కేవలం మీ సన్నిహితులకు మాత్రమే ఇచ్చుకున్నారు. రాజధానిలో ముంపు నివారణ, రహదారుల నిర్మాణం కోసం దాదాపు రూ.10,700 కోట్లకు పనులు పిలిస్తే అందులో చంద్రబాబు సన్నిహితుడైన బీఎస్సార్‌ ఇన్‌ఫ్రాకు, ఈనాడు ఎండీ కిరణ్‌కు బందువైన ఆర్వీఆర్‌ ప్రాజెక్ట్స్‌కు పనులు కట్టబెట్టారు. ఇది దోపిడీ కాదా? రాజధాని ప్రాంతంలో ముంపు లేదంటూనే ఐదు లిఫ్ట్‌లు పెడుతున్నారు.దీనికోసం పెడుతున్న ఖర్చు అక్షరాల రూ.1404 కోట్లు ఖర్చుచేస్తున్నారు. ముంపు లేకపోతే ఇంత ఎందుకు ఖర్చుచేస్తున్నారు? దీనికితోడు మరో ఆరు రిజర్వాయర్లుకూడా కడతానంటున్నారు. ఇంత డబ్బులు ఎవరికి ధారపోస్తున్నారు. 

11 నెలల్లో చంద్రబాబు సర్కార్‌ అప్పు రూ.1,47,655

కళ్లార్పకుండా ఒక క్షణంలో వేయి అబద్ధాలు చెప్పేలా పోటీ పెడితే అందులో ఎలాంటి పోటీ లేకుండా చంద్రబాబుగారు వరల్డ్‌ ఛాంపియన్‌ అవుతారు. అబద్ధాలు, మోసమే ఆయన రాజకీయాలకు ప్రధాన పెట్టుబడి. అప్పులపై కూడా చంద్రబాబు చెప్పిన అబద్ధాన్ని పదేపదే చెప్తూ, తానిచ్చిన సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ హామీలనుంచి తప్పించుకునే ప్రయత్నంచేస్తున్నారు. కాని ఏరోజూ వాటికి ఆధారాలు కూడా చూపడంలేదు. మరోవైపు తాను ఎన్నడూలేని రీతిలో అప్పులు చేస్తూ రికార్డులు బద్దలు కొడుతున్నాడు. వాస్తవంగా రాష్ట్రానికి ఉన్న అప్పులు ఎంతంటే.. రాష్ట్ర ప్రభుత్వం చేసిన, ప్రభుత్వ గ్యారంటీతో చేసిన, ప్రభుత్వ గ్యారంటీ లేకుండా ప్రభుత్వరంగ సంస్థలు చేసిన  అప్పులతో కలిపి  2019 మార్చి నెలాఖరు నాటికి మొత్తం రాష్ట్రానికి ఉన్న అప్పులు రూ.3,90,247 కోట్లు. 2014-19లో ఆ ఐదేళ్లలో అప్పుల్లో పెరుగుదల 22.63శాతం. 2024 మార్చి నెలాఖరు నాటికి అప్పులు రూ.7.21 లక్షల కోట్లు.  2019-24 మధ్య ఐదేళ్లలో అప్పుల్లో పెరుగుదల 13.57 శాతం మాత్రమే. కోవిడ్‌లాంటి సంక్షోభాల ఉన్నాకూడా అన్ని పథకాలను వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అమలు చేసింది. ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంది. 2.73లక్షల కోట్లను డీబీటీ ద్వారా ప్రజలకు అందించింది. కాని, చంద్రబాబుగారు తన మొదటి ఆర్థిక సంవత్సరంలో చేసిన  అప్పులు రూ.1,47,655 కోట్లు. ఒక్క పథకం కూడా అమలు చేయలేదు. వైయస్‌.జగన్‌గారి హయాం నాటి పథకాలను కూడా రద్దుచేశారు. మరి ఈ డబ్బంతా ఎక్కడకు వెళ్లినట్టు? ఎవరి జేబుల్లో పడినట్టు?

Back to Top