తాడేపల్లి: జెడ్‌ప్లస్ కేటగిరి ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు కూటమి ప్రభుత్వం భద్రతను తగ్గించడం వెనుక కుట్ర కోణం ఉందని మాజీ ఎంపీ, వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ అన్నారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ ఒక ప్రణాళిక ప్రకారం భద్రతను తొలగించడం ద్వారా వైయస్ జగన్‌కు హాని కలిగించే పరిస్థితిని సృష్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకు జెడ్‌ప్లస్ కేటగిరి భద్రత కల్పించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే.. దేశంలోనే అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుల్లో వైయస్ జగన్ ఒకరు. ఆయనకు రక్షణ కల్పించే అంశంలో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, ఇంటెలిజెన్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్ రివ్యూ మీటింగ్ నిర్వహించి అసాంఘిక శక్తుల నుంచి ఆయన ప్రాణాలకు ప్రమాదం ఉందని గుర్తించారు. జగన్ కు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాలని కౌంటర్ ఇంటెలిజెన్స్ నిర్ణయించింది. వైయస్ జగన్ రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా ఆయనకు మూడంచెల భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఆయన ఏ పర్యటన కోసం వెళ్లినా అభిమానులు వేలాదిగా తరలివస్తున్నారు. ఆ సమయంలో వారిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీసులకు ఉంటుంది. కానీ వైయస్ జగన్ రామగిరి మండలంలో కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లినప్పుడు వేలాదిగా కార్యకర్తలు తరలివస్తే వారిని ఆర్డర్‌లో పెట్టాల్సిన పోలీసులు ఘోరంగా విఫలమయ్యారు. వైయస్ జగన్ హెలిక్యాప్టర్ ల్యాండ్ కాగానే అభిమానులు ఆయన్ను చుట్టుముడితే కంట్రోల్ చేయడానికి అక్కడ పోలీసులే లేకుండా పోయారు. అయితే జగన్ భద్రత కోసం 1100 మంది పోలీసులను మోహరించామని హోంమంత్రి అనిత చెప్పడం విడ్డూరంగా ఉంది. హెలిప్యాడ్ వద్ద కనీసం గార్డులు కూడాలేరు. లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లినప్పుడు ఆయన ఇంటి వద్ద కనీసం మెటల్ డిటెక్టర్‌ను కూడా ఏర్పాటు చేయలేదు. అధికారపార్టీ సేవలోనే పోలీసులు ఎమ్మెల్యే పరిటాల సునీత ఇల్లు, పరిటాల రవి సమాధి, లింగమయ్య హత్య కేసులో నిందితుల ఇంటి వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులను నియమించారు. అలాగే వైయస్ జగన్ ను చూడటానికి వస్తున్న కార్యకర్తలను అడ్డుకోవడానికి ఏర్పాటు చేసిన బారికేడ్ల వద్ద పోలీసులను మోహరించారే కానీ, ఆయన భద్రత కోసం ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. జగన్ భద్రత విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు చూస్తుంటే హెలిక్యాప్టర్‌ను విధ్వంసం చేయిస్తే ఆయన రోడ్డు మార్గాన బెంగళూరు వెళ్తాడు కాబట్టి దారి మధ్యలో ఆయన కాన్వాయ్‌పై భౌతిక దాడులు చేసే కుట్ర చేసినట్టు అనుమానాలు కలుగుతున్నాయి. మంత్రి నారా లోకేష్‌కి జెడ్ కేటగిరి సెక్యూరిటీతోపాటు సీఆర్పీఎఫ్ బలగాలు ఇచ్చిన ప్రభుత్వం, అత్యంత ప్రజాదరణ ఉన్న వైయస్ జగన్ భద్రతను మాత్రం బలహీనం చేసింది. మాజీ సీఎం వైయస్ జగన్ భద్రత విషయంలో ప్రభుత్వ ఉదాసీనంగా వ్యవహరించడం తగదు. ఆయన ఎక్కడ పర్యటించినా ఆయనకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాలి. రామగిరి ఎస్సైని చూసి పోలీస్ యూనిఫాం సిగ్గుపడుతోంది రామగిరి ఎస్సై ఖాకీ చొక్కా తొడుక్కుని చట్టాన్ని పరిరక్షించాల్సిందిపోయి టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నాడు. ఆయన చేసిన పనులకు ఖాకీ చొక్కా, టోపీ కూడా సిగ్గుపడుతోంది. అలాంటి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను ఉద్దేశించి మాట్లాడటం హాస్యాస్పదం. రామగిరి మండలం నసన్నకోట అనే గ్రామంలో ముత్యాలు అనే వైయస్సార్సీపీ కార్యకర్త ఇంటిపై రాళ్ల దాడి జరుగుతుంటే రక్షణ కల్పించాలని నేను ఎస్సై, సీఐకి విజ్ఞప్తి చేస్తే ఎస్సై సంఘటన స్థలానికి చేరుకుని విధ్వంసకారులను తరిమేశాడు. అయితే నిందితులైన టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేయాల్సి వస్తుందన్న కారణంతో ఆ రాళ్లను ఎస్సై తన జీపులో తీసుకెళ్లిపోయాడు. రామగిరి ఎంపీపీ ఎన్నిక విషయంలోనూ రామగిరి ఎస్సై నిందితుల పక్షాన నిలబడి, బాధితుల కార్లలో కత్తులు, రాళ్లు వేయించి వారిపైనే కేసులు నమోదు చేసి వేధింపులకు పాల్పడుతున్నాడు. పాపిరెడ్డిపల్లె గ్రామంలో లింగమయ్య, జయచంద్రారెడ్డి ఇంటి మీద దాడులు జరిగినప్పుడు కూడా ఎస్సై ఉదాసీనంగా వ్యవహరించిన కారణంగానే నిండు ప్రాణం బలైపోయింది. వైయస్సార్సీపీ కార్యకర్తల మీద జరుగుతున్న దాడులను ప్రజాస్వామ్య వాదులంతా ఖండించాలి. పోలీసు చొక్కాలు తొడుక్కున్న టీడీపీ కార్యకర్తల వలే కొంతమంది పోలీసులు వ్యవహరిస్తున్నారు. టీడీపీ కక్షరాజకీయాలకు అండగా నిలబడుతున్న వారంతా రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకోకతప్పదు.