కొడాలి నానికి హృద్రోగ స‌మ‌స్య‌లు ఉన్నాయి

గుడివాడ వైయ‌స్ఆర్‌సీపీ నాయకుడు దుక్కిపాటి శశిభూషణ్‌

కృష్ణా జిల్లా: మాజీ మంత్రి, గుడివాడ మాజీ శాసనసభ్యులు కొడాలి వెంకటేశ్వర‌రావు(నాని)కి హృద్రోగ సమస్యలున్నాయని వైద్యులు నిర్ధారించిన‌ట్లు గుడివాడ వైయ‌స్ఆర్‌సీపీ నాయకుడు దుక్కిపాటి శశిభూషణ్ పేర్కొన్నారు. ఈ విషయం తెలియక నిన్న మీడియా మిత్రులకు ప్రకటన విడుదల చేసిన‌ట్లు ఆయ‌న తెలిపారు. ఈ మేరకు గురువారం శ‌శిభూష‌ణ్ మ‌రో ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. 

శ‌శిభూష‌ణ్ ఏమ‌న్నారంటే..
కొడాలి నాని కొన్నిరోజులుగా వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు, ఆయనికి గుండె సంబంధిత సమస్యలున్నట్టు, మూడు వాల్వ్స్‌ బ్లాక్‌ అయినట్టు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన ఆపరేషన్ కూడా చేయాల్సి ఉంటుందని  వైద్యులు చెప్పారు. బంధువులు, సన్నిహితులు, గుడివాడలో పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు గురవుతారనే ఉద్దేశంతో కొడాలి నాని ఈ విషయాన్ని మాకు వెల్లడించలేదు. మాజీ సీఎం, వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి డాక్టర్లతో మాట్లాడి, నానికి ఉన్న అనారోగ్యంపై వాకబు చేయడం వల్ల, నానికి హృద్రోగ సమస్యలున్నట్టుగా మాకు తెలిసింది. ఈ విషయం తెలియక నిన్న మీడియా మిత్రులకు ప్రకటన విడుదల చేశాను. కొడాలి నానికి అందిస్తున్న చికిత్స విజయవంతం కావాలని, వెంటనే కోలుకోవాలని ఆయన సన్నిహితులు, గుడివాడ వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు కోరుకుంటున్నారు` అంటూ శ‌శిభూష‌ణ్ ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించారు.. 

 

Back to Top