తాడేపల్లి: రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన(Red book Rule) కొనసాగుతోందని మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. న్యూటన్స్ లా ప్రకారం చర్యకు, ప్రతి చర్య ఉంటుంది. చంద్రబాబుగారు బంతిని ఎంత గట్టిగా కొడతాడో, అంతే వేగంతో అది పైకి లేచి చంద్రబాబుకు తగులుతుంది. ఇది వాస్తవం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా కొనసాగుతోంది. ప్రతి గ్రామంలోనూ మద్యం షాపులు, బెల్టుషాపులు యధేచ్చగా వెలిశాయి. పేకాట క్లబ్బలు, ఇసుక, మట్టి, మైనింగ్ మాఫియాలు నడుస్తున్నాయి. వ్యవస్థలన్నీ పూర్తిగా నాశనం అయిపోయాయి. చంద్రబాబు పాలనలో ఆరు నెలలు తిరక్కముందే ప్రజలకు తోడుగా మనం నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రజల తరఫున పోరుబాట పట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎప్పటికీ పార్టీ శ్రేణులు, నాయకులు కలిసికట్టుగా నిలవాలి. గ్రామస్థాయి నుంచి వ్యవస్థీకృతంగా పార్టీ ఉండాలి. ప్రతి సమస్యలోనూ ప్రజలకు తోడుగా నిలవాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు. కర్నూలు, నంద్యాల జిల్లాల వైయస్ఆర్‌సీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులతో మాజీ సీఎం, పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ ఏం మాట్లాడారంటే..: విలువలు. విశ్వసనీయత: ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి ఇవాళ ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారాలు. రాష్ట్రంలో ఇవాళ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తున్నాం. ఎలాంటి పరిస్ధితుల మధ్య మనం యుద్ధం చేస్తున్నామో చూస్తున్నాం. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీజం కర్నూలు జిల్లా నల్లకాలువలోనే పడింది. ఆరోజు కేవలం ఇచ్చిన మాట కోసం.. ఎందాకైనా వెళ్తాం అన్నాం. అలాంటి పరిస్థితుల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. ఇవాళ బలమైన పార్టీగా ఎదిగింది. ఆరోజు నుంచీ నాతోనే మీరంతా అడుగులు వేశారు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకూ ప్రతి అడుగులోనూ నాతోనే ఉన్నారు. మన పార్టీ సిద్ధాంతం ఏమిటని ఎవరైనా అడిగితే.. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతే మన పార్టీ సిద్ధాంతం అని ధైర్యంగా చెప్పొచ్చు. విలువలు, విశ్వసనీయతకు అర్థం చెప్పిన పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రెండు పదాలే పార్టీని నడిపించాయి. గట్టిగా ఈ సిద్ధాంతాన్ని నేను నమ్ముతాను. నాలో ఈ రెండింటిని చూసి మీరంతా నాతోపాటుగా అడుగులో అడుగు వేశారు. అదీ మన పార్టీ చరిత్ర: రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజం. ఇవాళ్టికి కూడా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏ నాయకుడైనా జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు గర్వంగా కాలర్ ఎగరవేసుకుని ప్రజల వద్దకు వెళ్లగలడు. ప్రతి కుటుంబాన్ని చిరునవ్వుతో పలకరించి ఆశీస్సులు తీసుకునే కెపాసిటీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రమే ఉందని గర్వంగా చెప్పగలం. మనం రాక ముందు రాజకీయాలు ఒకలా ఉండేవి. కానీ, మనం వచ్చిన తర్వాత రాజకీయాలకున్న అర్ధాన్ని మార్చి తిరగరాసిన చరిత్ర మన పార్టీది. ఇచ్చిన మాటకు ఎవరైనా కట్టుబడి ఉండాలని చెప్పాం. మనం రాక మునుపు మేనిఫెస్టో అనేది చెత్తబుట్టలో వేసే డాక్యుమెంటులా ఉండేది. రాజకీయ అవసరాల కోసం గతంలో ఇష్టం వచ్చినట్టు మేనిఫెస్టో ప్రకటించేవారు. ఎన్నికల అయిపోయి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని చెత్తబుట్టలో వేయడం అనేది పరంపరగా కొనసాగింది. ఎన్నికలప్పుడు ఏదైనా మాట ఇస్తూ, మేనిఫెస్టో ప్రకటిస్తే, దాన్ని ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించి, పక్కాగా అమలు చేసిన పార్టీ ఏదైనా ఉందంటే, అది వైయస్ఆర్‌సీపీ మాత్రమే. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్న మొట్టమొదటి పార్టీ మనది. మేనిఫెస్టోను మనం ఒక పవిత్ర గ్రంధం మాదిరిగా భావించాం. ప్రతి అంశాన్నీ నెరవేర్చాలని తపన పడ్డాం. ఆ తాపత్రయంతో పని చేశాం. కోవిడ్ ఉన్నా సరే అన్ని హామీలను నెరవేర్చాం. రాష్ట్రానికి ఆదాయాలు తగ్గినా, అనుకోని ఖర్చులు పెరిగినా, సంక్షోభం ఉన్నా, ఏరోజూ మీ జగన్, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాకులు వెతుక్కోలేదు. ఇచ్చిన మాటకు కట్టుబడి 99శాతం పైచిలుకు హామీలను నెరవేర్చాం. అలా నెరవేర్చిన తర్వాతే గడపగడపకూ ప్రతి ఇంటికీ వెళ్లాం. మాయ మాటలతో వారు మభ్యపెట్టారు: ఇన్ని చేసినా మనం ఓటమి చెందాం. కారణం కొద్దో గొప్పో చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మారు. జగన్ వస్తే ఎంతమంది పిల్లలున్నా రూ.15 వేలే వస్తాయి. కానీ చంద్రబాబు వస్తే ఇంట్లో ముగ్గురు పిల్లలుంటే రూ.45 వేలు వస్తాయని ఆశ పడ్డారు. 45 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు వైయస్ జగన్ రూ.18,750 ఇస్తున్నాడు. చంద్రబాబు వస్తే 50 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు రూ.48 వేలు ఇస్తానన్నాడు. ఈ రకంగా ప్రతి ఇంటికీ తన మనుషులను చంద్రబాబు పంపాడు. వాళ్ల ఎమ్మెల్యే అభ్యర్ధులు, కార్యకర్తలు వెళ్లి చంద్రబాబు బాండు పంపించాడు అని కరపత్రాలు, బాండ్లు చంద్రబాబు పేరిట పంచారు. అలా ప్రతి ఇంటినీ, ప్రతి వర్గాన్నీ దారుణంగా మోసం చేశారు. ఏ ఇంట్లో నుంచి పిల్లలు బయటకు వస్తే నీకు రూ.15 వేలు అని, వాళ్ల అమ్మ బయటకు వస్తే నీకు రూ.18 వేలు అని, ఆ పిల్లల అమ్మమ్మలు బయటకు వస్తే మీకు 50 ఏళ్లు కాబట్టి మీకు రూ.48 వేలు అని, ఆ ఇంట్లో నుంచి రైతు బయటకు వస్తే నీకు రూ.26 వేలు అని, చదువుకున్న పిల్లవాడు బయటకు వస్తే నీకు రూ.36 వేలు అంటూ ఇంట్లో ఎవరు కనపడినా ప్రతి వర్గాన్నీ మోసం చేశారు. దీని వల్ల పది శాతం ప్రజలు చంద్రబాబును నమ్మారు. జగన్ చేశాడు కాబట్టి, చంద్రబాబు కూడా చేస్తాడని నమ్మారు. వైయస్ జగన్ చేసినవన్నీ చేస్తానని చెప్పడంతో పాటు, అంతకన్నా ఎక్కువ చేస్తానని చంద్రబాబు అన్న మాటలను నమ్మారు. చంద్రబాబు మారాడేమోనని ప్రజలు నమ్మారు. అందుకే 50శాతం నుంచి 40శాతానికి ఓటు షేరు తగ్గింది. ఆ తర్వాత దారుణ మోసం: కానీ, ఇవాళ చంద్రబాబు వచ్చి 11 నెలలు అయిపోయింది. అధికారంలోకి వచ్చాక రెండు బడ్జెట్లు పెట్టాడు. ఈ 11 నెలల కాలంలో ప్రజలు చంద్రబాబునాయుడు హామీలు నెరవేరుస్తాడని ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రతి ఇంట్లో పిల్లలు నుంచి తల్లులు, రైతులు సహా ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. దాదాపు ఏడాది కావస్తోంది. కానీ, ఏదీ అమలు చేయడం లేదు. అప్పుడు మాట ఇచ్చాను కానీ, ఇప్పుడు భయం వేస్తుందని చంద్రబాబు అంటున్నాడు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఉండడం కోసం రాష్ట్రానికున్న అప్పులపై ఒకసారి రూ.12 లక్షల కోట్లు అని, ఒకసారి రూ.11 లక్షల కోట్లు అని, ఇంకోసారి రూ.10 లక్షలు కోట్లు అని అంటున్నారు. అలా ప్రతిరోజూ అబద్ధాలు చెబుతున్నారు. నాడు జగన్ పాలనలో నాలుగువేళ్లూ నోట్లోకి వెళ్లాయని ప్రజలు అనుకున్నారు. అదే ఇప్పుడు తింటున్న ప్లేటును చంద్రబాబు లాగేశాడని అంటున్నారు. ప్రతి హామీ ఒక మోసంగా మిగిలిపోయింది. అన్నింటా తిరోగమనం: మరోవైపు విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో పూర్తి తిరోగమనం కనిపిస్తోంది. స్కూళ్ల వ్యవస్థను నాశనం చేశాడు. ఇంగ్లిషు మీడియం గాలికెగిరిపోయింది. మూడో తరగతి నుంచి టోఫెల్ చదువు, 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇచ్చే పరిస్థితి కూడా గాలికెగిరిపోయింది. చివరకు డిగ్రీ, ఇంజనీరింగ్ పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా గాలికెగిరి పోయింది. వైద్య రంగం తీసుకుంటే ఆరోగ్యశ్రీలో నెట్‌వర్క్ ఆస్పత్రులకు నెలకు రూ.300 కోట్లు కట్టాలి. అవి కట్టకపోవడంతో 11 నెలలకు దాదాపు రూ.3500 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఆరోగ్య ఆసరా గాలికెగిరి పోయింది. బిల్లులు చెల్లించకపోవడంతో నెట్‌వర్క్ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ కింద వైద్యసేవలు అందించని పరిస్థితి నెలకొంది. వ్యవసాయ రంగంలో ఏ రైతుకూ గిట్టుబాటు ధర రావడం లేదు. రైతులకు పెట్టుబడి సహాయం కింద రైతుభరోసా అందడం లేదు. చంద్రబాబు ఇస్తానన్న రూ.26 వేలు గాలికెగిరి పోయాయి. ఉచిత పంటల బీమా తీసేశారు. ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు. పారదర్శకత పక్కకు పోయింది. అవినీతి విచ్చలవిడిగా జరుగుతోంది. రెడ్ బుక్ పాలన సాగుతోంది. ఏ గ్రామంలో, ఏ నియోజకవర్గంలో తీసుకున్నా ప్రతి గ్రామంలోనూ మద్యం షాపులు, బెల్టుషాపులు నడుస్తున్నాయి. పేకాట క్లబ్బలు, ఇసుక, మట్టి, మైనింగ్ మాఫియాలు నడుస్తున్నాయి. వ్యవస్థలన్నీ పూర్తిగా నాశనం అయిపోయాయి. ఆరు నెలల్లోనే ఆ పరిస్థితి వచ్చింది: ప్రజల తరఫున క్యాడర్ నిలవాలి. సాధారణంగా ప్రజల తరపున నిలబడాలని పిలుపునిచ్చే కార్యక్రమం రెండేళ్ల తర్వాత వస్తుంది. కానీ చంద్రబాబునాయుడుగారి పాలనలో ఆరు నెలలు తిరక్కముందే ప్రజలకు తోడుగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రజల తరఫున పోరుబాట పట్టాల్సిన పరిస్థితి ఆసన్నమయింది. ప్రజలకు తోడుగా నిలబడాల్సిన పరిస్థితి ఉత్పన్నమయింది. మూడేళ్లు ఇట్టే గడిచిపోతాయి. కానీ పార్టీ శ్రేణులు, నాయకులు కలిసికట్టుగా నిలవాలి. ప్రజలకు తోడుగా నిలవాల్సిన సమయం వచ్చింది. గ్రామస్థాయి నుంచి వ్యవస్థీకృతంగా పార్టీ ఉండాలి. జిల్లా, మండల స్ధాయిలోనూ క్యాడర్‌ను ఏకం చేయాలి. ప్రతి సమస్యలోనూ ప్రజలకు తోడుగా నిలవాలి. గట్టిగా నిలబడి సాధించాం: రెడ్‌బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలు మీకు తెలుసు. సాధారణంగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి హుందాతనం ఉంటుంది. కానీ చంద్రబాబుకు తనకు సంఖ్యాబలం లేకపోయినా అన్ని పదవులు తనకే కావాలని అధికార అహంకారం చూపుతున్నారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికలు మొన్ననే 57 చోట్ల జరిగాయి. చంద్రబాబుకు గెలిచే వాతావరణం లేక 7 చోట్ల ఎన్నికలు వాయిదా వేశారు. మరో 50 చోట్ల ఎన్నిక పెట్టని పరిస్ధితి. అలా 50 చోట్ల ఎన్నికలు జరిగితే 39 చోట్ల వైయస్ఆర్‌సీపీ గెలిచింది. పార్టీ శ్రేణులు, నాయకులు తెగింపుతో గట్టిగా నిలబడి విజయం సాధించారు. ఆ తెగింపు వైయస్ఆర్‌సీపీ కేడర్ చూపించింది కాబట్టే.. చంద్రబాబునాయుడు మన పార్టీ కేడర్‌ను ఏమీ చేయలేకపోయారు. కోవిడ్ తర్వాత జరిగిన అప్పటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ స్వీప్ చేసింది. ప్రస్తుతం ఎక్కడా బలం లేకపోయినా చంద్రబాబు అధికార అహంకారం చూపారు. పోలీసులను వాచ్‌మెన్ల కంటే ఘోరంగా వాడుకున్నారు. ప్రలోభాలు పెడుతూ, భయపెడుతూ ప్రతి పదవి తనకే కావాలని తపన పడుతూ ఎలా చేశారో మనకు తెలుసు. చంద్రబాబుకు భయం: అసలు చంద్రబాబు ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? ఇంత అప్రజాస్వామికంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? కారణం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటే చంద్రబాబుకు భయం. వైయస్ఆర్‌సీపీ కార్యకర్త అంటే చంద్రబాబుకు భయం. చంద్రబాబు సూపర్ సిక్స్, సూపర్ సెవన్ వంటి హామీల అమల్లో, పాలనలో ఘోరంగా విఫలమయ్యారు. చంద్రబాబు పాలనలో వ్యవస్ధలన్నీ పూర్తిగా నీరుగారిపోయాయి. టీడీపీకి చెందిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు సహా కేడర్, నాయకులు ప్రజల దగ్గరకు వెళ్లే పరిస్థితి లేదు. ప్రజలకు దగ్గరకు వెళ్తే కచ్చితంగా నిలదీస్తారు. ఇలా ప్రజలు ప్రశ్నిస్తారని చంద్రబాబుగారు, ఆయన పార్టీ పరిపాలన చేస్తూ ఇలాంటి దారుణాలకు దిగుతోంది. ఆయన్ను ప్రశ్నించే స్వరం ఉండకూడదని, రాష్ట్రవ్యాప్తంగా భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. చర్యకు ప్రతిచర్య తప్పదు: న్యూటన్స్ లా ప్రకారం చర్యకు, ప్రతి చర్య ఉంటుంది. చంద్రబాబుగారు బంతిని ఎంత గట్టిగా కొడతాడో, అంతే వేగంతో అది పైకి లేచి చంద్రబాబుకు తగులుతుంది. ఇది వాస్తవం. ప్రజలకు మంచి చేయడమే ప్రజాస్వామ్యం. కానీ అలా చేయకుండా అధికారం ఉందని దురహంకారంతో ఏ నాయకుడైనా ప్రవర్తిస్తే ప్రజలు, దేవుడు కచ్చితంగా తిప్పికొడతారు. వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిజిట్‌కూడా రాని పరిస్థితుల్లోకి వెళ్తారు. ఏపీ, తమిళనాడు ఎన్నికల్లో ప్రజలు వన్‌సైడ్‌గా ఇచ్చే తీర్పులు చూశాం. ఈ పక్కన ప్రజలు తంతే.. ఆ పక్కన పడతారు. అందుకే చంద్రబాబు భయపెట్టే ప్రయత్నాలు ఎక్కువ చేస్తాడు. కాబట్టి, మనం అప్రమత్తంగా, ఐక్యంగా ఉండాలి. రామగిరిలో ఏం జరిగింది?: అనంతపురం జిల్లా రామగిరి ఎంపీపీ ఉప ఎన్నికలో 10కి 9 చోట్ల మనం గెలిచాం. మరి అక్కడ గెలవాల్సింది వైయస్ఆర్‌సీపీ కదా? అక్కడ ఎన్నికను తారుమారు చేయడానికి ప్రయత్నించారు. కోర్టు ఆదేశాలతో ఎంపీటీసీలకు భద్రత ఇవ్వాల్సింది పోయి, పోలీసులే అన్యాయంగా ఎంపీటీసీలను బెదిరించే కార్యక్రమాలు చేశారు. రామగిరి ఎస్సై, ఎంపీటీసీల వాహనం ఎక్కాడు. వీడియో కాల్‌లో ఎమ్మెల్యేతోనూ, ఎమ్మెల్యే కుమారుడితోనూ మాట్లాడించారు. వారిని టీడీపీకి అనుకూలంగా ఓటేయమని బెదిరించారు. అయినా మన ఎంపీటీసీలు ఎక్కడా తలొగ్గలేదు. దీంతో మన పార్టీ ఎంపీటీసీలు ఎన్నిక సమయానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో కోరమ్ లేదని ఎన్నిక వాయిదా వేశారు. ఆ తర్వాత వేరే మండల కేంద్రానికి తీసుకెళ్లి బైండోవర్ చేసే కార్యక్రమం చేశారు. దీనికి వ్యతిరేకంగా ధర్నాచేస్తే మన పార్టీ జిల్లా అధ్యక్షురాలి మీద, ఇన్‌ఛార్జి మీద కేసులు పెట్టారు. ఆమె గట్టిగా స్టీల్ లేడీలా నిలబడి పోరాటం చేసింది. ఆమె ధర్నా చేస్తే.. దానిపై కూడా కేసులు పెట్టి అరాచకం సృష్టించే కార్యక్రమం చేశారు. అంతటితో ఆగకుండా మరలా రామగిరిలో ఎన్నిక జరపాల్సి వస్తుంది కాబట్టి భయానక వాతావరణం సృష్టించడానికి.. మన పార్టీ తరఫున యాక్టివ్‌గా ఉన్న లింగమయ్యను హత్య చేశారు. ఈ మాదిరిగా చేయాల్సిన అవసరం ఏముంది. పూర్వపు బీహార్‌లా..!: చంద్రబాబుగారు ప్రజలకు మంచి చేయొచ్చు కదా? ఇచ్చిన హామీలను నెరవేర్చొచ్చు కదా? కానీ, ఆ పని చేయరు. పైగా అన్నీ బకాయిలే. ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టారు. రైతులకు అన్యాయం చేస్తున్నారు. వాటన్నింటినీ సరిదిద్దుకోవాలి. ప్రజలకు మంచి చేసి వారి మనసుల్లో స్ధానం సంపాదించుకోవాలి. కానీ, అలా కాకుండా ఈ మాదిరిగా దిజగారిపోయి, మనుషులను చంపే స్ధాయిలో, ఇంతలా దిగజారిపోవాల్సిన అవసరం ఉందా? పూర్వపు బిహార్ రాష్ట్రంలా తయారయ్యింది మన రాష్ట్రం. ఇలాంటి పరిస్థితుల మధ్య మనం యుద్ధం చేస్తున్నాం. కచ్చితంగా తిరిగి అధికారంలోకి..: మీ అందరికి చెబుతున్నాను. కష్టాలు అనేవి శాశ్వతంగా ఉండవు. చీకటి వచ్చిన తర్వాత కచ్చితంగా వెలుతురు వస్తుంది. ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకుండి. ఈ మూడేళ్లు పార్టీ నాయకులు, కార్యకర్తలు గట్టిగా నిలబడాలి. ప్రజలకు తోడుగా ఉండండి. మన పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుంది. ఈసారి జగన్ 2.ఓ పాలన కచ్చితంగా మీరు చూస్తారు. ప్రతి కార్యకర్తకు జగన్ తోడుగా ఉంటాడని కచ్చితంగా చెబుతున్నాను. జగన్ 1.ఓ లో అనుకున్న మేరకు మీకు తోడుగా ఉండకపోవచ్చు. కోవిడ్ లాంటి విపత్తులతో పాటు ఆ తర్వాత కూడా ప్రజల ప్రతి అవసరంలో వారికి తోడుగా నిలబడాల్సి వచ్చింది. కానీ ఈసారి కార్యకర్తలకు జగన్ 2.ఓ లో జరిగే మేలు మరెవ్వరికీ జరగని విధంగా చేస్తాను. ప్రజల కోసం నిలబడదాం. ప్రజల కోసం పోరాడుదాం. విలువలు, విశ్వసనీయతకు దర్పణంలా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ నిలబడుతుందన్న సంకేతం ఇద్దామని వైయస్ జగన్ స్పష్టం చేశారు. కాగా, ఈ సమావేశానికి కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన జడ్పీటీసీలు, ఎంపీపీలు, మేయర్, కార్పొరేటర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లు, పార్టీ మండల అధ్యక్షులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో పాటు, పార్టీ ముఖ్య నాయకులు హాజరయ్యారు.