కర్నూలు: కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాష్ట్రంలో జర్నలిస్టులకు రక్షణ కరువైందని ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి. గోరంట్లప్ప, కెబి. శ్రీనివాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 27న కర్నూలు సాక్షి(Sakshi) యూనిట్ కార్యాలయంపై ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ(MLA Akhil Priya) చేసిన దాడిని నిరసిస్తూ శుక్రవారం నగరంలోని కలెక్టరేట్ ఎదుట ఉన్న గాంధీ విగ్రహం ఎదుట ఏపీడబ్ల్యూజేఎఫ్ నగర అధ్యక్షుడు శివ శంకర్ అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల రక్షణ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. దాడులకు దిగడం సమంజసం కాదు వాస్తవాలు రాసిన జర్నలిస్ట్ లపై, పత్రికా కార్యాలయాలపై దాడులకు పాల్పడటం, జర్నలిస్టులను భయాందోళనకు గురిచేయడం సరైంది కాదని ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు తప్పుపట్టారు. ప్రజాస్వామ్య పద్దతిలో పోరాటం చేయడం మానేసి అధికార పార్టీలో ఉండే ఎమ్మెల్యే అఖిల ప్రియ తమ అనుచరులతో సాక్షి కార్యాలయం పైకి దాడికి దిగి భయబ్రాంతులకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పాలకవర్గాలు జర్నలిస్ట్ లకు రక్షణ కల్పించడం మానేసి దాడులకు దిగడం సిగ్గుచేటన్నారు. కూటమి ప్రభుత్వం 9 నెలల పాలనలో రోజు రోజుకు జర్నలిస్ట్ పై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి జర్నలిస్ట్ లకు రక్షణ చట్టాన్ని అమలు చేయాలని, దాడికి పాల్పడిన ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం జర్నలిస్ట్ లను రైలు పట్టాలపై పడుకోపెడతానాని బెదిరించారని వారు గుర్తు చేశారు. నేడు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ ఇలా అధికార పార్టీ వారు బరితెగించడం రాష్ట్ర ప్రభుత్వానికి కలంకకంగా మారడం దుర్మార్గమన్నారు. ఇప్పటికైనా జర్నలిస్ట్ లకు రక్షణ గా రాష్ట్ర ప్రభుత్వం ఉండాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కన్వీనర్ కె నాగేంద్ర, ఎలక్ట్రానిక్ మీడియా సీనియర్ జర్నలిస్ట్ లు ధరణి కిషోర్, హుస్సేన్, ఫొటో గ్రాఫర్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు డి.హుస్సేన్, సుబ్రహ్మణ్యం, సీనియర్ జర్నలిస్ట్ లు సత్యనారాయణ గుప్తా, రవి ప్రకాష్ ,సాక్షి బ్యూరో రవి వర్మ, కరస్పాండెంట్ లోకేష్ , ఏపీడబ్ల్యూజేఎఫ్ నగర ప్రధాన కార్యదర్శి ఎర్రమల, ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు నర్సిరెడ్డి, సుందర్ రాజు, మద్దిలేటి, ఫోటో గ్రాఫర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వడ్డే శ్రీనివాసులు,జర్నలిస్ట్ లు జమ్మన్న, శ్రీనివాసులు, ప్రతాప్, పరమేష్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు చంద్ర శేఖర్, శేఖర్, అనిల్, నగేష్, డెస్క్ జర్నలిస్ట్ లు పాల్గొన్నారు.