రాష్ట్రంలో పారదర్శక విధానాలకు పాతర

కారుచౌకగా "లులూ"కు అత్యంత ఖరీదైన భూమి

రూ.2000 కోట్ల భూమిని 99 ఏళ్ళకు ఎలా లీజుకు ఇస్తారు?

ప్రశ్నించిన శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ

విశాఖపట్నం క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ

లులూకు ఇచ్చే భూమికి రూ.170 కోట్ల మేర రాయితీలు

ఈ సొమ్ముతో ప్రభుత్వమే నిర్మాణాలు చేపట్టవచ్చు

ప్రైవేటు సంస్థకు మేలు చేసేందుకు తెగబడిన కూటమి సర్కార్

బొత్స సత్యనారాయణ ఆగ్రహం

స్థానిక ఉప ఎన్నికల్లో కూటమి దౌర్జన్యాలు

అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేశారు

పోలీసులు ప్రేక్షకపాత్రకు పరిమితం

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా చేస్తున్నారు

బొత్స సత్యనారాయణ ధ్వజం

విశాఖపట్నం: విశాఖపట్నం బీచ్‌కు సమీపంలో దాదాపు రూ.2000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా లలూ మాల్‌కు దారాదత్తం చేసేందుకు ప్రయత్నిస్తోందని శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖపట్నం క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ భూములను ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇచ్చే సందర్భంలో పాటించాల్సిన నిబంధనలకు పాతర వేస్తూ, ఏకంగా 99 ఏళ్ళకు లీజుకు ఇచ్చేందుకు సిద్దపడటం వెనుక మతలబు ఏమిటని ప్రశ్నించారు. అంతేకాకుండా ఏకంగా రూ.170 కోట్ల విలువైన రాయితీలను కూడా సదరు సంస్థకు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం తెగబడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇంకా ఆయన ఏమన్నారంటే...

రాష్ట్రప్రభుత్వం విశాఖపట్నంలోని అత్యంత విలువైన సుమారు పదమూడు ఎకరాల భూమిని లులూ మాల్‌ కు ఇవ్వాలని నిర్ణయించింది. ఆ సంస్థకు ఏడాదికి ఎకరానికి రూ.50 లక్షలకు లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ భూమిలో లులూ సంస్థ సినిమా హాళ్లు, రెస్టారెంట్లు, కన్వెన్షన్ సెంటర్, ఇతర వాణిజ్య సముదాయాలను నిర్మిస్తుంది. వాణిజ్య సముదాయాల నిర్మాణాలకు బీచ్‌ పక్కన ఉన్న భూమి ఎకరా వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తిని ఒక ప్రైవేటు సంస్థకు ఎలా దారాదత్తం చేస్తారో చెప్పాలి. దీనివల్ల ప్రభుత్వానికి ఎంత వస్తుందీ అని చూస్తూ నామమాత్రంగానే ఆదాయం లభిస్తుంది. ఇదేనా చంద్రబాబు చెబుతున్న సంపదసృష్టి.

ప్రభుత్వ నిబంధనలు వర్తించవా? 

ప్రభుత్వం వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తిని దీర్ఘకాలానికి ఎటువంటి పాదర్శక విధానాలను అవలంభించకుండా కట్టబెట్టడం సమంజసమా? ప్రభుత్వానికి తన వద్ద ఉన్న భూమి నుంచి ఆదాయాన్ని పొందాలంటే, దానికి నిర్ధిష్టమైన విధానాన్ని అలంభించాలి. గతంలో తమకు లులూతో ఉన్న సంబంధాలతో నామమాత్రపు రేట్లకే లీజుకు ఇవ్వడం వెనుక మతలబు ఏమిటీ? సినిమాహాళ్ళు, రెస్టారెంట్లు కట్టాలి అనుకుంటే ఎక్కడైనా నిర్మించవచ్చు. అహ్లాదం, ఆనందం కోసం ప్రజలు కాస్త దూరమైనా వెడతారు. లేదా ఏదైనా ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకువస్తున్నారంటే దానిపైనా ఆలోచించవచ్చు. వాణిజ్య సముదాయాల కోసం వేల కోట్ల రూపాయల విలువైన భూములను ఎలా కేటాయిస్తారు? స్టాంప్ డ్యూటీ, మిగిలిన ఇతర పన్నులు దాదాపు రూ.170 కోట్ల వరకు మినహాయింపులు కల్పిస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో రాయితీలు ఇచ్చే బదులు ఆ సొమ్ముతో ప్రభుత్వమే వాణిజ్య సముదాయాలను నిర్మించుకోవచ్చు. ప్రభుత్వ నిర్ణయాన్ని వైయస్‌ఆర్‌సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ భూమి ద్వారా ఆదాయం పొందాలని భావిస్తే, పబ్లిక్ డొమైన్‌లో పెట్టి, వివిధ సంస్థలను ఆహ్వానించాలి. లేకపోతే దీనిలో లోపాయికారీ ఒప్పందాలు ఉన్నాయని అనుమానించాల్సి వస్తుంది. 

వ్యవస్థలను కుప్పకూలుస్తున్నారు

ఈరోజు రాష్ట్రంలో జరిగిన స్థానిక ఉప ఎన్నికల్లో మరోసారి కూటమి ప్రభుత్వం అరాచకానికి పాల్పడింది. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అప్రజాస్వామిక విధానాలకు పాల్పడాల్సిన అవసరం ఉందా? సాధారణంగా ప్రజాస్వామిక విధానాలకు అనుగుణంగా, చట్టప్రకారం ఎన్నికలు జరుగుతుంటాయి. ప్రజాతీర్పునకు అనుగుణంగా పదవులు దక్కుతుంటాయి. కానీ కూటమి ప్రభుత్వంలో దౌర్జన్యాలు, దుర్మార్గాలు, బెదిరింపులతో స్థానిక ఉప ఎన్నికల్లో పదవులను చేజిక్కించుకునేందుకు ప్రయత్నించడం దారుణం. రాష్ట్రంలో శాంతిభద్రతలను కూడా ఫణంగా పెట్టి, ఉప ఎన్నికల్లో పదవులను పొందేందుకు ప్రయత్నించడం హేయం. పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ఇటువంటి దౌర్జన్యాలకు ప్రభుత్వమే ప్రయత్నించడం ఎటువంటి సంకేతాలను ఇస్తున్నట్లు? వ్యవస్థలను కుప్పకూల్చి మరో బీహార్‌గా ఈ రాష్ట్రాన్ని మార్చేందుకు కుట్ర చేస్తున్నారు. దీనిని వైయస్‌ఆర్‌సీపీ పూర్తిగా ఖండిస్తోంది. ఎన్నికలకు వెడుతున్న వారిని అడ్డుకోవడం, వారిపై దౌర్జన్యం చేయడం, వాయిదాలు వేయడం, పోలీసులను ప్రేక్షకపాత్రకే పరిమితం చేయడం ఎటువంటి ప్రజాస్వామిక విధానం?  

మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ...

యాదవ సామాజికవర్గంకు చెందిన ఒక బీసీ మహిళకు వైయస్‌ఆర్‌సీపీ విశాఖ నగర మేయర్‌గా అవకాశం కల్పించింది. నాలుగేళ్ళ పాటు ఆమె మేయర్‌గా కొనసాగారు. ఈ చివరి ఏడాదిని కుట్రలు కుతంత్రాలతో  తెలుగుదేశం పార్టీ ఆమెను పదవి నుంచి దింపేందుకు ప్రయత్నించడం దారుణం. దీనిని బీసీ సామాజికవర్గాలు సహించవు.

Back to Top