వైయస్ జగన్ భద్రతపై ప్రధాని, హోంమంత్రిని కలుస్తాం

కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా భద్రత ఇవ్వడం లేదు

జెడ్‌ప్లస్ కేటగిరి భద్రత ఉన్న మాజీ సీఎం పట్ల ఇలాగేనా వ్యవహరించేది?

శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం

రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన లేదు

పోలీసులను రాజకీయాల కోసం వాడుకుంటున్నారు

చట్టవిరుద్దంగా వ్యవహరించే పోలీసులపైనే మేం మాట్లాడాం

రాష్ట్రంలో తప్పుడు సంప్రదాయాలకు కూటమి సర్కార్ తెర తీసింది

శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ

విశాఖపట్నం క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ

విశాఖపట్నం: మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ భద్రతపై ప్రధాని, కేంద్ర హోంమంత్రులను కలుస్తామని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. విశాఖపట్నం క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి కుట్రపూరితంగా వైయస్ జగన్‌కు ఉన్న జెడ్‌ప్లస్ భద్రతను నీరుగారుస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యంకు కూటమి ప్రభుత్వం పూర్తిగా తూట్లు పొడుస్తోందని ధ్వజమెత్తారు. 

ఇంకా ఆయనేమన్నారంటే...

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో ప్రజాస్వామిక విలువలు మంటగలిసాయి. రాజ్యాంగస్పూర్తికి తిలోదకాలు ఇచ్చి, రెడ్‌బుక్ పాలనను సాగిస్తున్నారు. ఎన్నికల్లో గెలిచి, ప్రజలకు మంచి పాలన అందించాల్సిన ప్రభుత్వాలు దానికి భిన్నంగా ప్రతిపక్షంపై కక్షసాధింపులకు, పోలీసులను ప్రయోగించి అధికార దుర్వినియోగంతో తప్పుడు కేసులు బనాయించేందుకే మొత్తం సమయాన్ని వినియోగిస్తున్నారు. ప్రభుత్వ అండతో చట్టాలను చేతుల్లో తీసుకుంటున్నారు. దీనికి తార్కాణమే రామగిరిలో మాజీ సీఎం వైయస్ జగన్ గారికి ఎదురైన భద్రతా వైఫల్యం. 

మొదటి నుంచి భద్రతపై నిర్లక్ష్యం

వైయస్ జగన్ గారికి జెడ్‌ప్లస్ భద్రత ఉంది. కానీ కూటమి ప్రభుత్వం ఆయన ఎక్కడకు వెళ్ళినా కనీస పోలీస్ బందోబస్త్‌ను ఏర్పాటు చేయడం లేదు. రామగిరి మండలంలో అధికారబలంతో వైయస్ఆర్‌సీపీ బీసీ నేతను పొట్టనపెట్టుకున్నారు. ఆ కుటుంబాన్ని ఓదార్చడానికి వైయస్ జగన్ ఆ ప్రాంతానికి వెడితే కూటమి ప్రభుత్వం కనీస భద్రతను కూడా ఏర్పాటు చేయలేదు. ఒక మాజీ ముఖ్యమంత్రి, జెడ్‌ప్లస్ కేటగిరి భద్రత ఉన్న నాయకుడికి రాజకీయ దురుద్దేశంతో, ఒక కుతంత్రంతో ప్రభుత్వం భద్రత ఇవ్వడం లేదు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి సంప్రదాయం కాదు. వైయస్ జగన్ ఏ ప్రాంతానికి వెళ్ళినా వేలాది మంది అభిమానులు వస్తారని తెలుసు. అయినా కూడా నిర్లక్ష్యంగా, దురుద్దేశంతో భద్రతా వైఫల్యానికి ప్రభుత్వం ఒడిగట్టింది. రామగిరిలో 1100 మంది పోలీసులని హెలిప్యాడ్ వద్దే భద్రత కోసం నియమించామని ప్రభుత్వం చెబుతోంది. టీవీల్లో ఆ సంఘటన సమయంలో వచ్చినదృశ్యాలను ప్రజలు చూశారు. అక్కడ కనీసం పదిమంది పోలీసులు ఉన్నట్లు కూడా కనిపించడం లేదు. ప్రజాస్వామ్యంలో ఎన్నుకున్న ప్రభుత్వాలు చట్టబద్దంగా పనిచేయాలి. కానీ కూటమి ప్రభుత్వంలో అది మచ్చుకైనా కానరావడం లేదు. దీనిపై ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తున్నారు, తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. అనంతపురంలో వైయస్ఆర్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షురాలిపైనా, రాప్తాడ్ మాజీ ఎమ్మెల్యేపైన తప్పుడు కేసులు పెట్టారు. ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలపై స్థానికంగా ఉన్న ప్రజలు కడుపుమంటతో ఉన్నారు. దీనిని ప్రశ్నించేందుకు వచ్చిన వైయస్ జగన్ గారిపై అభిమానంతో అక్కడికి రావడంతో ప్రభుత్వం కళ్ళు కుట్టినట్లు వ్యవహరించింది. హెలిప్యాడ్ చుట్టూ సరైన విధంగా తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి బారికేట్స్ ఏర్పాటు చేయలేదని పోలీసులు తప్పించుకునేలా మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు దీనిపై ఆయనకు ముందుగానే ఎందుకు చెప్పలేదు? ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎందుకు చేయలేదు?

ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది

ప్రజాస్వామిక విధానాలకు దూరంగా పాలన చేస్తే పొరుగు దేశాల్లో ప్రజలు తిరుగుబాటు చేశారు. పటిష్టమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం ఉన్నాం. దానిని ఛిన్నాభిన్నం చేసేందుకు ప్రయత్నిస్తే ప్రజల నుంచి ఇలాంటి ప్రతిఘటనే ఎదురవుతుంది. రామగిరి మాత్రమే కాదు మహానంది, గుంటూరు మిర్చియార్డ్‌ ల్లోనూ ఇదే తరహాలో వైయస్ జగన్ భద్రతను గాలికి వదిలేశారు. పైగా విండ్‌షీల్డ్‌ దెబ్బతిన్న హెలికాఫ్టర్ ఎలా ఎగిరిందని ప్రశ్నిస్తున్నారు. ఒక వీఐపీని తీసుకువెళ్ళే సందర్భంలో పైలెట్లు ఎలాంటి ప్రొటోకాల్స్ పాటిస్తారో వారికి తెలియదా? ఆమాత్రం ఇంగితజ్ఞానం లేకుండా ఎలా మాట్లాడతారు? ప్రజాస్వామ్యంలో పాలకులు ఎలా పాలించాలో మ్యానువల్స్ ఉన్నాయి, రాజ్యాంగం, చట్ట ప్రకారం పనిచేయాలి. కూటమి ప్రభుత్వం మాత్రం దానిని పూర్తిగా విస్మరించింది.

విజ్ఞత మరిచిన టీడీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు 

 తెలుగుదేశం పార్లమెంటరీ నాయకుడు శ్రీకృష్ణదేవరాయులు ఒక మాజీ సీఎంను పట్టుకుని ప్రోఫెషనల్ కిల్లర్ అని మాట్లాడతారా? సరైన ఆలోచనలతోనే ఇలా మాట్లాడుతున్నారా? విద్యాసంస్థలను నడుపుతున్న ఆయన తండ్రిగారు ఇదేనా తన కుమారుడికి నేర్పిన విజ్ఞత. చంద్రబాబు మీద కేసులు లేవా? చంద్రబాబును కూడా ఇదే రకంగా శ్రీకృష్ణదేవరాయులు మాట్లాడతారా? నోటికీ అద్దూ అదుపు లేకుండా మాట్లాడుతున్నారు. 

రాష్ట్రంలో అన్ని వర్గాలు అసంతృప్తితో ఉన్నాయి

కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదు. ఉత్తరాంధ్రలోని చోడవరం షుగర్ ఫ్యాక్టరీ లక్ష టన్నులకు పైగా క్రషింగ్ నిలిపిచోతోంది. రైతులకు నేటికీ డబ్బు చెల్లించలేదు. కార్మికులు, ఉద్యోగులకు జీతాలు చెల్లించాలి. రైతులు ఎలా బతుకుతారు. కూలినాలీ చేసుకుని బతికే అనేక మంది పేదలు ఉన్నారు. వారి కోసం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకంకు 75 రోజులుగా కూలి డబ్బులు చెల్లించకుండా బకాయి పెట్టారు. ఈ పేదలు ఎలా బతకాలి? పేదలు ఆకలిచావులకు గురి కావాలని ఈ ప్రభుత్వం కోరుకుంటోందా? పబ్లిసిటీ మాత్రమే ఈ ప్రభుత్వానికి ప్రాధాన్యతగా ఉంది. మోసాలు చేయడం, అబద్దాలు చెప్పడం ద్వారా అధికారంలోకి వచ్చాం, వచ్చే అయిదేళ్ళ తరువాత కదా ప్రజల గురించి ఆలోచించాలని అనుకుంటున్నారు. 

పోలీసుల్లో పరివర్తన రావాలి
 
అత్తిలిలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఇంటి ముట్టూ తెలుగుదేశం గుండాలు చుట్టుముట్టి, భయబ్రాంతులకు గురి చేశారు. పోలీసులను రక్షణ కల్పించాలని ఎన్నిసార్లు కోరినా పట్టించుకోలేదు. కారుమూరి నాగేశ్వరరావు పార్టీ ఎంపీటీసీలతో కలిసి ఉప ఎన్నికకు హాజరుకాకుండా అడ్డుకున్నారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు. ఇదేనా కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజాస్వామ్యం? పోలీసుల్లో పరివర్తన రావాలి. చట్టల కోసం పనిచేయలే తప్ప, అధికారపార్టీకి చుట్టాలుగా పనిచేయకూడదు. అలాంటి వారు ఖాకీయూనిఫారం వేసుకోవడానికి అనర్హులు. వైయస్ జగన్ కూడా ఇదే మాట్లాడారు. సోషల్ మీడియాల అనుచిత వ్యాఖ్యలను మేం ఎప్పుడూ సమర్థించలేదు. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసే వారిని సంఘ బషిష్కరణ చేయాలి. ప్రభుత్వం కూడా సోషల్ మీడియాలో అనుచిత, అసభ్య ప్రచారంపై చిత్తశుద్దితో వ్యవహరిస్తేనే దీనిని నియంత్రించ గలుగుతుంది.

Back to Top