విజయవాడ: బలహీనవర్గాలు గర్వంగా తలెత్తుకునే జీవించే విధంగా వైయస్‌ఆర్ సీపీ ప్రభుత్వ పాలన సాగుతోందని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు సముచిత స్థానం కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్ అని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వైయస్ జగన్ ప్రభుత్వంలో వెనుకబడిన వర్గాలకు జరుగుతున్న మంచిని వివరించేందుకే సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర చేపడుతున్నామని చెప్పారు. విజయవాడలో సామాజిక న్యాయభేరి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, జోగి రమేష్, మేరుగ నాగార్జున, కారుమూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ ఏం మాట్లాడారంటే.. ‘‘గత ప్రభుత్వాలు బలహీనవర్గాలకు 20, 30 శాతం పదవులు ఇచ్చి గొప్పగా చెప్పుకునేవారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మంత్రి పదవుల్లో 77 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే కేటాయించారు. కేబినెట్‌లో 25 మంది సభ్యులు ఉంటే.. వారిలో 17 మంది మంత్రులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సామాజికవర్గాలకు చెందినవారే ఉన్నారు. ఎన్నికల ముందు చెప్పిన మాట ప్రకారం 50 శాతానికి మించి నామినేటెడ్ పదవుల్లో, పనుల్లో అవకాశం కల్పించారు. కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్లు, ఎండోమెంట్ ట్రస్టు బోర్డు అధ్యక్షులు, మెంబర్లు ఇలా.. ప్రతి విషయంలోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సముచిత స్థానం కల్పించారు. వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారం కావాలని ఎన్నో దశాబ్దాలుగా కోరుతున్నారు. సీఎం వైయస్ జగన్ తన మూడేళ్ల పాలనలోనే బడుగు, బలహీనవర్గాలకు రాజ్యాధికారం అందించారు. సీఎం వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయాలు గర్వంగా, బలహీనవర్గాలు తలెత్తుకునే విధంగా ఉన్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఏ విధంగా అభివృద్ధి జరిగిందో.. దాన్ని రాష్ట్ర ప్రజలకు చాటిచెప్పడమే శ్రీకాకుళం నుంచి మొదలవుతున్న సామాజిక న్యాయభేరి ఉద్దేశం. బస్సుయాత్ర 26న శ్రీకాకుళంలో ప్రారంభం అవుతుంది. అనంతపురంలో ఆఖరి సభతో ముగుస్తుంది. నాలుగు రోజులూ బహిరంగ సభలు నిర్వహిస్తాం. విజయనగరం, రాజమండ్రి, నరసరావుపేట, అనంతలో బహిరంగ సభ నిర్వహిస్తాం. సభల్లో 17 మంది మంత్రులతో పాటు కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వివిధ హోదాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ పాల్గొంటారు. ఈ రాష్ట్రంలో ఉన్న బలహీనవర్గాలంతా కలిసివచ్చి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమానికి తోడ్పాటును అందించాలి’’ అని మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు.