గుడివాడ: పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా చంద్రబాబు అడుగడుగునా అడ్డుపడుతున్నాడని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా కోర్టులకు వెళ్లి అడ్డుకున్న దుర్మార్గుడు చంద్రబాబు అని మండిపడ్డారు. గుడివాడలోని వ్యవసాయ మార్కెట్‌లో టిడ్కో గృహాల లబ్ధిదారుల సభలో మంత్రి కొడాలి నాని పాల్గొని మాట్లాడారు. బహిరంగ సభకు పెద్ద ఎత్తున టిడ్కో గృహాల లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ..30 లక్షల మంది పేద మహిళల పేరు మీద ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తామని సీఎం వైయస్ జగన్ సంకల్పించారన్నారు. దీన్ని జీర్ణించుకోలేక రూ.25 కోట్లు ఖర్చు చేసి హైకోర్టు, సుప్రీం కోర్టులకు వెళ్లి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకున్న దుర్మార్గుడు చంద్రబాబు అని మండిపడ్డారు. అర్హులందరికీ ఇళ్లు ఇస్తాం పేదలకు ఇళ్లు ఇచ్చే బాధ్యత వైయస్ జగన్ ప్రభుత్వనిదేనని, అర్హులందరికీ ఇళ్లు ఇస్తామన్నాని మంత్రి కొడాలి నాని అన్నారు. రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వొచ్చా.. లేక గతంలో మాదిరిగా పట్టాతో ఇవ్వాలనేది మార్చి నాటికి కోర్టులు నిర్ధారిస్తాయన్నారు. కోర్టులు రిజిస్ట్రేషన్‌కు అనుమతి ఇస్తే.. లబ్ధిదారులు ఒక్క రూపాయి కడితే చాలు పేద మహిళల పేరు మీద ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తామని, ఆ బాధ్యత సీఎం వైయస్ జగన్‌దన్నారు. వెన్నుపోటు సంస్కృతి బాబుకే సొంతం చంద్రబాబు హయాంలో పేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. డబ్బా ఛానళ్లలో పనికిమాలిన చర్యలు పెడుతున్నారని మండిపడ్డారు. వైయస్‌ఆర్ సీపీలో చీలిక అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబును భుజాన మోస్తూ.. ప్రభుత్వంపై పచ్చమీడియా పిచ్చి రాతలు రాయిస్తున్నాయని దుయ్యబట్టారు. టిడ్కో లబ్ధిదారుల దగ్గర డబ్బులు దండుకున్న చరిత్ర చంద్రబాబుదని ధ్వజమెత్తారు. వెన్నుపోటు సంస్కృతి చంద్రబాబుకే సొంతమన్నారు.