రాష్ట్ర హోంమంత్రిగా అనిత విఫలం

రాష్ట్రంలో పూర్తిగా క్షీణించిన శాంతిభద్రతలు

రాజకీయ విమర్శలకే పరిమితమైన హోంమంత్రి

పోలీస్ వ్యవస్థను రాజకీయ సంస్థగా దిగజార్చారు

ఎమ్మెల్సీ, వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర మ‌హిళా అధ్య‌క్షురాలు వ‌రుదు క‌ళ్యాణి ఫైర్

కూటమి పాలనలో పోలీస్ వ్యవస్థ గాడి తప్పింది

పోలీస్ అధికారులపైనే కూటమి కక్షసాధింపులు

ప్రతిపక్షంపై వేధింపులకు పావుగా పనిచేస్తున్న కొందరు పోలీసులు

మొత్తం పోలీస్ వ్యవస్థనే నిర్వీర్యం చేస్తున్నారు

ఎమ్మెల్సీ, వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర మ‌హిళా అధ్య‌క్షురాలు వ‌రుదు క‌ళ్యాణి ఆగ్రహం

వైయ‌స్ఆర్‌సీపీ విశాఖ‌ప‌ట్నం సిటీ కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన వ‌రుదు క‌ళ్యాణి

విశాఖపట్నం: రాష్ట్ర హోంశాఖా మంత్రిగా అనిత విఫలమయ్యారని ఎమ్మెల్సీ, వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర మ‌హిళా అధ్య‌క్షురాలు వ‌రుదు క‌ళ్యాణి మండిపడ్డారు. విశాఖపట్నంలోని వైయస్ఆర్‌సీపీ నగర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, మహిళలపై అఘాయిత్యాలు, ప్రతీకార హత్యలు, దాడులతో అట్టుడుకుతుంటే హోంమంత్రి మాత్రం రాజకీయ విమర్శలతో కాలం గడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి, తెలుగుదేశం పార్టీ రాజకీయ సంస్థగా దిగజార్చారని ధ్వజమెత్తారు. ఇంకా ఆమె ఎమన్నారంటే...

రాష్ట్రంలో శాంతిభద్రతలను పర్యవేక్షించే శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న హోంమంత్రి అనిత త‌న బాధ్య‌త‌ల‌ను ప‌క్క‌నపెట్టి ఎంత‌సేప‌టికీ ప‌ద‌విని ఎంజాయ్ చేయ‌డానికి, మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ని విమర్శించడానికే ప‌రిమిత‌మ‌య్యారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక రోజుకి 72 మంది మ‌హిళ‌ల మీద అత్యాచారాలు, దాడులు జ‌రుగుతుంటే అరిక‌ట్ట‌లేక‌పోతున్నారు. మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ను విమ‌ర్శించ‌డానికి మాత్రం ఎప్పుడూ ముందుంటారు. వైయస్ జగన్ కేవలం పులివెందుల ఎమ్మెల్యే అంటూ కించపరిచేలా అనిత మాట్లాడుతున్నారని, ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రిగా, జనంలో అత్యంత ఆదరణ కలిగిన నాయకుడుగా కొనసాగుతున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఒక మండలస్థాయి సబ్‌ ఇన్స్‌పెక్టర్ మాజీ ముఖ్యమంత్రి గురించి అనుచితంగా మాట్లాడే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందంటే, ఏ రకంగా పోలీస్ వ్యవస్థను రాజకీయ ప్రయోజనాల కోసం సాధనంగా మార్చారో అర్థం చేసుకోవాలి. 

వైయ‌స్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌లో భ‌ద్ర‌త వైఫ‌ల్యం

వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి ఉన్న‌ప్పుడు ప్ర‌తిపక్ష పార్టీ నాయ‌కులు చంద్ర‌బాబు, లోకేష్‌, ప‌వ‌న్ కళ్యాణ్‌కి ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌త క‌ల్పించ‌డం జ‌రిగింది. కాబ‌ట్టే ఆనాడు వారి భ‌ద్ర‌త‌పై ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు. ఈరోజు కూట‌మి ప్ర‌భుత్వంలో వైయ‌స్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌ల్లో అడుగ‌డుగునా భద్రతా వైఫ‌ల్యం క‌నిపిస్తోంది. ప్ర‌భుత్వం త‌న వైఫ‌ల్యాన్ని క‌ప్పిపుచ్చుకునేందుకు ఎదురుదాడి చేస్తోంది. వైయస్ జ‌గ‌న్ పాపిరెడ్డిపల్లె ప‌ర్య‌ట‌న‌కు వెళితే 1100 మందితో పోలీస్ బందోబ‌స్త్ ఏర్పాటు చేశామ‌ని, 200 మందిని హెలిప్యాడ్ ద‌గ్గ‌ర మోహ‌రించామ‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. నిన్న‌టి ప‌ర్య‌ట‌న‌లో ఎక్క‌డా ఆయ‌న‌కు పోలీస్ ర‌క్ష‌ణ క‌నిపించ‌లేదు. జ‌గ‌న్ ని క‌ల‌వ‌డానికి వ‌చ్చే కార్య‌క‌ర్త‌ల‌ను, అభిమానుల‌ను ఆప‌డానికి పోలీసుల‌ను మోహ‌రించారే కానీ, ఆయ‌నకు ర‌క్ష‌ణ క‌ల్పించ‌డానికి మాత్రం పోలీసులను ఏర్పాటు చేయ‌లేదు. హెలికాఫ్టర్ విండ్ షీల్డ్ పాడైపోయిన విష‌యం తెలిసీ ఆ హెలిక్యాప్ట‌ర్‌లో వైయ‌స్ జ‌గ‌న్ వెళ్ల‌క‌పోవ‌డాన్ని హోంమంత్రి ప్ర‌శ్నించ‌డం చూస్తుంటే కనీస సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఏరకంగా ఉంటాయో కూడా తెలియదా అనే అనుమానం కలుగుతోంది.   

టీడీపీ తొత్తులుగా మారిన పోలీసుల‌కే హెచ్చ‌రిక‌

రాష్ట్రంలో చట్టానికి బదులుగా టీడీపీకి తొత్తులుగా మారి, చంద్ర‌బాబుకి వాచ్‌మెన్‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న పోలీసులను ఉద్దేశించి వైయస్ జగన్ హెచ్చరికగా మాట్లాడారు. వారిని న్యాయ‌స్థానాల ముందు దోషులుగా నిల‌బెట్టి వారు తొడుక్కున్న యూనిఫారంను తీయించేస్తామని చెబితే దానిని వక్రీకరిస్తున్నారు. పోలీస్ వ్యవస్థ గౌరవంను కాపాడేలా ఆనాడు సీఎంగా వైయస్ జగన్ పనిచేశారు. నేడు కూటమి ప్రభుత్వం మొత్తం పోలీస్ వ్యవస్థనే నీరుగార్చేలా చేస్తోంది. ఇటీవల కాలంలో స్థానిక సంస్థల ఉప ఎన్నికల సందర్భంగా పోలీసులు అధికార పార్టీ చేతుల్లో కీలుబొమ్మలుగా మారి, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరించారు. రామగిరిలో కూడా స్థానిక ఎస్ఐ కూడా ఇదే తరహాలో ప్రవర్తించారు. చివరికి వైయస్ఆర్‌సీపీ బీసీ నాయకుడు దారుణ హత్యకు గురవ్వడానికి పోలీసుల ఉదాసీనతే కారణం. ఇటువంటి వారు పోలీస్ యూనిఫారంకే కళంకం. వారు ఎప్పటికైనా చట్టం ముందు దోషులుగా నిలబడాల్సిందే. 

శాంతిభద్రతలను సమీక్షించే సమయం హోంమంత్రికి లేదు

విశాఖ‌లో ప్రేమోన్మాది దాడిలో తల్లీకూతుళ్లు తీవ్రంగా గాయ‌ప‌డిన ఘ‌ట‌న‌లో త‌ల్లి మ‌ర‌ణించింది. యువ‌తి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతుంటే ప‌రామ‌ర్శించే తీరిక హోంమంత్రికి లేక‌పోయింది. కంచ‌ర‌పాలెంలో మాన‌సిక విక‌లాంగురాలిపైనా అత్యాచారం జ‌రిగిన‌ప్పుడు కూడా హోంమంత్రి ప‌రామ‌ర్శించ‌లేదు. రాజ‌మండ్రిలో దీప‌క్ అనే టీడీపీ కార్య‌క‌ర్త వేధింపుల‌తో నాగ అంజ‌లి అనే ఫార్మాసిస్ట్ ఆత్మ‌హ‌త్య చేసుకుని చ‌నిపోయిన ఘ‌ట‌న రాష్ట్ర‌మంతా సంచ‌ల‌నం సృష్టించింది. 13 రోజులపాటు చావుబ‌తుకుల మ‌ధ్య అంజ‌లి పోరాడి చ‌నిపోయింది. ఆ 13 రోజుల్లో ఏనాడూ అక్క‌డికొచ్చి బాధిత కుటుంబానికి అండ‌గా నిల‌బ‌డి ధైర్యం చెప్పాల‌ని ఈ మ‌హిళా హోంమంత్రికి అనిపించ‌లేదు. రాష్ట్రంలో మద్యం ఏరులైపారుతోంది. హోంమంత్రి అనిత సొంత నియోజ‌క‌వ‌ర్గం పాయ‌క‌రావుపేట మీదుగానే విచ్చ‌ల‌విడిగా గంజాయి స‌ర‌ఫ‌రా జ‌రుగుతున్నా ఆమె ప‌ట్టించుకోదు. టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం వేధింపుల‌ను ఒక మహిళ సెల్ఫీ వీడియో ద్వారా ఏక‌రువు పెట్టింది. రాష్ట్రంలో త‌న‌కు న్యాయం జ‌ర‌గ‌ద‌ని భావించి క‌ర్నాట‌క‌లో ప్రెస్‌మీట్ పెట్టింది. కానీ ఆ ఎమ్మెల్యే మీద క‌నీసం కేసు కూడా పెట్ట‌లేదు. జ‌న‌సేన నేత కిర‌ణ్ రాయ‌ల్ వేధింపుల గురించి ల‌క్ష్మి అనే మ‌హిళ వ‌రుసగా ప్రెస్‌మీట్లు పెట్టి ఆడియో వీడియోల‌తో స‌హా ఆధారాలు చూపించినా చ‌ర్య‌లు తీసుకోలేదు. మా హ‌యాంలో జ‌గ‌న‌న్న ఇచ్చిన‌ ఇళ్ల పట్టా తీసుకున్న ఆనందాన్ని మీడియాతో పంచుకున్నందుకు ఒక మ‌హిళ‌ల‌ను దారుణంగా ట్రోల్ చేసి ఆత్మ‌హ‌త్య చేసుకునేలా టీడీపీ సోష‌ల్ మీడియా ప్రేరేపించింది. త‌న బిడ్డ‌ల‌ను త‌ల్లి లేని అనాథ‌ల‌ను చేసింది. గుంటూరు వెళ్లిన‌ప్పుడు మా నాయ‌కులు వైయ‌స్ జ‌గ‌న్‌ను చిన్న పాప క‌లిస్తే, ఆ వీడియోల‌ను కూడా టీడీపీ సోష‌ల్ మీడియా ట్రోల్ చేసింది. చిన్న పాప అని క‌నీసం విచ‌క్షణ పాటించ‌లేదు. 

టీడీపీదే క్రిమినల్ చరిత్ర 

కూట‌మి అధికారంలోకి వ‌చ్చింది మొద‌లు ఎక్క‌డా శాంతిభ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ జ‌ర‌గ‌డం లేదు. పోలీస్ వ్య‌వ‌స్థ‌ను క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌కు మాత్ర‌మే వాడుతున్నారు. వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణుల‌పై అక్ర‌మ కేసులు బ‌నాయించి వేధించడానికి పోలీస్ వ్య‌వ‌స్థ‌ను వాడుకుంటున్నారు. చంద్ర‌బాబుని ఉద్దేశించి దివంగ‌త ఎన్టీఆర్ క్రిమిన‌ల్ అన్నారు. వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్నాడ‌ని స్వ‌యంగా చెప్పారు. 85 శాతం మంది టీడీపీ ఎమ్మెల్యేల‌పై క్రిమిన‌ల్ కేసులున్నాయ‌ని ఏడీఆర్ స‌ర్వే చెప్పింది. 
అలాంటి పార్టీలో ఉండి వైయ‌స్ఆర్‌సీపీ క్రిమిన‌ల్ పార్టీ అని హోంమంత్రి చెప్ప‌డం విడ్డూరం. ఐపీఎస్ అధికారుల‌ను పేర్లు పెట్టి తిట్టిన చ‌రిత్ర టీడీపీ నాయ‌కుల‌ది. పోలీసుల‌కు వార్నింగ్ ఇచ్చారు. సంఘ విద్రోహ శక్తుల‌ని ప్ర‌చారం చేశారు. పోలీసుల మీద దాడులు చేసి వారికి చూపు కోల్పోయేలా చేశారు. వాటికి సంబంధించి చంద్రబాబు, లోకేష్‌ల తీరును చూపే వీడియోలను కూడా మీడియా సమావేశం ద్వారా ప్రజలకు చూపిస్తున్నాం. కులం పేరుతో, మ‌తం పేరుతో, పార్టీల ముద్ర వేసి ఐపీఎస్ అధికారుల నుంచి కిందిస్థాయి ఉద్యోగుల వ‌ర‌కు పోస్టింగులు ఇవ్వ‌కుండా ప‌ది నెల‌ల త‌ర్వాత కూడా ఇప్ప‌టికీ క‌క్ష‌సాధిస్తున్నారు.

Back to Top