తాడేపల్లి: డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ పర్యటన సందర్భంగా విశాఖలో జేఈఈ పరీక్ష మిస్ అయిన 23 మంది విద్యార్థుల బాధ్యత పవన్‌కళ్యాణ్‌దే అని వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర తేల్చి చెప్పారు. ఈ ఘటనపై విద్యా మంత్రి నారా లోకేష్ స్పందించాలని, పరీక్ష మిస్ అయిన విద్యార్థులకు కేంద్రంతో మాట్లాడి న్యాయం చేయాలని రవిచంద్ర డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర మీడియాతో మాట్లాడారు. ప్రెస్‌మీట్‌లో రవిచంద్ర ఇంకా ఏం మాట్లాడారంటే..: చేయని తప్పుకు విద్యార్థులు మూల్యం: అడవి తల్లి బాట కార్యక్రమం కోసం అరకు వెళ్లేందుకు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ విశాఖ వచ్చిన సందర్భంగా నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో నగరంలో తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడి జేఈఈ మెయిన్స్ పరీక్ష రాసేందుకు వెళ్లే 23 మంది విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా చేరుకున్నారు. దీంతో నిర్వాహకులు వారిని పరీక్షలకు అనుమతించలేదు. తాము చేయని తప్పుకు ఆ విద్యార్థుల జీవితం నాశనమైంది. ఏడాదిపాటు నిద్రాహారాలు మాని రాత్రింబవళ్లు కష్టపడి చదివినా ఫలితం లేకుండా పోయింది. భారీ కాన్వాయ్‌తో పవన్ పర్యటన: పవన్ కళ్యాణ్ అభిమానుల వాహనాలను సైతం భారీగా కాన్వాయ్‌లో చేర్చడంతోపాటు వాహనాలు ఎక్కడికక్కడ రోడ్డుపై నిలిపివేసి పూలదండలు వేసే కార్యక్రమాలతో అత్యుత్సాహం ప్రదర్శించడంతో ట్రాఫిక్‌కి అంతరాయం ఏర్పడింది. ఎన్‌ఏడీ నుంచి పెందుర్తి వరకు బీఆర్‌టీఎస్ రోడ్డు మధ్యలో పవన్ కళ్యాణ్ కాన్వాయ్ వెళ్లేలా పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ చేశారు. కానీ రోడ్డుకి ఇరువైపులా సర్వీసు రోడ్డులో కూడా వాహనాలను ఆపేయడంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. పది నిమిషాల్లో పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సిన విద్యార్థులు దాదాపు 50 నిమిషాల పాటు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. ముమ్మాటికీ పవన్‌కళ్యాణ్‌దే బాధ్యత: ఆ 23 మంది విద్యార్థులు భవిష్యత్తుకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధ్యత వహించాలి. విద్యార్థులకు పరీక్షలు జరిగే సమయంలో వీఐపీల పర్యటన ఉన్నప్పుడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా చూడటం అనేది పోలీసుల బాధ్యత. వాస్తవాలు ఇలా ఉంటే ఇదంతా అబద్ధమన్నట్టు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేలా విశాఖ సిటీ పోలీసులు ప్రకటన విడుదల చేయడం దారుణం. పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కారణంగానే తమ పిల్లలు పరీక్షలు రాయలేకపోయారని వారి తల్లిండ్రులు బోరున విలపిస్తున్నారు. దీనిపై స్పందించిన పవన్, నిజంగా తన వల్లే నష్టపోయారో లేదోనని పరీశీలించాల్సిందిగా పోలీసులను ఆదేశించారే కానీ, విద్యార్థులకు న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం లేదు. నడిరోడ్డుపై గజమాలలతో హల్చల్: ఉ.8.20కి ఎయిర్‌పోర్టుకి చేరుకున్న పవన్‌కళ్యాణ్, అక్కణ్నుంచి కాన్వాయ్‌తో చినముషిడివాడ చేరుకోవడానికి (వీవీఐపీ కాన్వాయ్ కావడంతో) 10 నిమిషాలు పడుతుంది. కానీ ఆయనకు 20 నిమిషాల సమయం పట్టింది. బీఆర్టీఎస్ రోడ్డులో జనసేన నాయకులు పూలమాలలతో సత్కారాల కార్యక్రమం ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్‌కి అంతరాయం ఏర్పడింది. దీంతో విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకోలేకపోయారు. పవన్ పర్యటనకు సంబంధించి పత్రికల్లో వచ్చిన ఫొటోలు చూస్తుంటే రోడ్లన్నీ ఆ పార్టీ కార్యకర్తలతో స్తంభించిపోవడం స్పష్టంగా కనిపిస్తుంది. జనసేన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు భారీగా వాహనాల్లో వచ్చి బీఆర్‌టీఎస్ రోడ్డు మీద ట్రాఫిక్‌ను స్తంభింపజేసి పవన్ కళ్యాణ్ ను గజమాలలతో సత్కరించే కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడి విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకోలేకపోయారు. స్పందించాలి. న్యాయం చేయాలి: ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. తక్షణమే ఆయన స్పందించి కేంద్రంతో మాట్లాడి నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలి. తూతూమంత్రం ప్రకటనలతో కాలయాపన చేయకుండా విద్యార్థుల జీవితాలు నష్టపోకుండా నిర్దిష్టమైన హామీ ఇచ్చి నెరవేర్చేలా చర్యలు చేపట్టాలని రవిచంద్ర డిమాండ్ చేశారు.