విశాఖపట్నం: విశాఖపట్నం నగర మేయర్ పీఠంను అడ్డదోవలో దక్కించుకునేందుకు తెలుగుదేశం పార్టీ కుట్రలు చేస్తోందని వైయస్ఆర్‌సీపీ నేతలు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యే కరణం థర్మశ్రీ, మేయర్ గొలగాని హరివెంకట కుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ఆర్‌సీపీ విశాఖ నగర కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ బలం లేకపోయినప్పటికీ తెలుగుదేశం విశాఖ మేయర్ పదవిపై అవిశ్వాసం తీర్మానానికి నోటీస్ ఇవ్వడం వెనుక వారి కుతంత్రం దాగి ఉందని మండిపడ్డారు. విశాఖ మేయర్ పీఠంపై ఒక యాదవ సామాజికవర్గంకు చెందిన బీసీ మహిళ కూర్చోవడాన్ని తెలుగుదేశం జీర్ణించుకోలేక పోతోందని ధ్వజమెత్తారు. టీడీపీ కుట్రలను ఛేదిస్తామని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు వైయస్ఆర్‌సీపీ ధైర్యంగా పోరాడుతుందని స్పష్టం చేశారు. ఇంకా వారు ఏమన్నారంటే... కార్పొరేషన్‌లో బలం లేకపోయినా బరితెగిస్తున్నారు: మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖ కార్పొరేషన్‌లో కూటమి పార్టీలకు బలం లేకపోయినా నగర మేయర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టడానికి నెలరోజులుగా టీడీపీ, జనసేన నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. కేవలం మరో 11 నెలలు మాత్రమే ఉన్న పదవీ కాలాన్ని చేజిక్కించుకోవడానికి కుట్రలు చేస్తున్నారు. మా పార్టీ నుంచి ఫ్యాన్ గుర్తుపై గెలిచిన కార్పొరేటర్లను ప్రలోభపెట్టి, లొంగని వారిని బెదిరించి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేసి తమ పార్టీల్లో చేర్చుకుంటున్నారు. 1995 నాటి వైస్రాయ్ హోటల్ రాజకీయంను, చంద్రబాబు చేసిన చారిత్రాత్మక వెన్నుపోటు కుతంత్రాన్ని విశాఖలో మొదలుపెట్టారు. అవిశ్వాస తీర్మానం ఎట్టిపరిస్థితుల్లో జరగడానికి వీల్లేదని, మిగిలిన పదవీ కాలంలో కూడా మేయర్ గా హరివెంకట కుమారి కొనసాగాలని పార్టీ నాయకులంతా నిర్ణయించారు. వైయస్సార్సీపీ నుంచి ఫ్యాన్ గుర్తుపై గెలిచిన 58 మంది సభ్యులకు రేపు విప్ కూడా జారీ చేస్తున్నాం. ఈనెల 19న నిర్వహించనున్న అవిశ్వాస తీర్మాన కార్యక్రమానికి కూడా వెళ్లకూడదని పార్టీ నిర్ణయించింది. పార్టీ విప్ ధిక్కరించి హాజరైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. పార్టీ అధికారంలో ఉంది కదా అని అడ్డగోలుగా ప్రతిపక్ష పార్టీ మీద దాడులు చేసి బెదిరించి పదవులు చేజిక్కించుకోవాలని చూస్తున్న అధికార పార్టీ ఆగడాలను కూడా విశాఖ ప్రజలంతా గమనిస్తున్నారు. తమ అమూల్యమైన ఓటు ద్వారా ఐదేళ్లపాటు ప్రజలిచ్చిన అధికారాన్ని అడ్డదారిలో పొందాలని టీడీపీ అనుకోవడం చాలా తప్పు. ఇలాంటి చర్యలను వైయస్సార్సీపీ వ్యతిరేకిస్తుంది. యాదవ మహిళ మీద ఇన్ని కుట్రలా? : మేయర్ హరి వెంకట కుమారి చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా యాదవ కులానికి చెందిన బీసీ మహిళనైన నాకు ఆనాడు వైయస్ జగన్ గారు విశాఖ మేయర్‌గా అవకాశం కల్పించారు. జనరల్ స్థానం అయినప్పుటికీ బీసీ మహిళలను రాజకీయంగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వైయస్ జగన్ గారు ప్రాధాన్యత ఇచ్చారు. విశాఖ కార్పొరేషన్‌లో యాదవ సామాజికవర్గానికి చెందిన 22 మందికి వైయస్సార్సీపీ కార్పొరేటర్లుగా బీఫారం ఇస్తే 13 మంది విజయం సాధించారు. అదేవిధంగా 22 మంది కాపు సామాజిక వర్గానికి చెందిన వారు విజయం సాధించారు. బీసీలను రాజకీయంగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో యాదవ కులానికి చెందిన మహిళలైన నాకు మేయర్‌గా అవకాశం కల్పించి ప్రోత్సహించారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి మేయర్ పదవిని చేజిక్కించుకోవడంలో భాగంగా అడ్డదారులు తొక్కుతోంది. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు మా కార్పొరేటర్లను బెదిరించి కేవలం 11 నెలల కాలమే ఉన్న మేయర్ పీఠం కోసం అరాచకం సృష్టిస్తున్నారు. కొద్ది కాలం పదవి కోసం బీసీ మహిళకు అన్యాయం చేయడం న్యాయమేనా? నామీద అవిశ్వాస తీర్మానం పెట్టడం ఎంత వరకు సమంజసమో యాదవ సామాజకి వర్గానికి చెందిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మరోసారి పునరాలోచించాలి. నాడు వైయస్సార్సీపీలో ఉన్న వంశీకృష్ణ శ్రీనివాస్ మేయర్ పీఠం దక్కలేదనే కోపంతో జరగబోయేది చూస్తారు, అనుభవిస్తారు అని మాట్లాడారు. దీనికి సంబంధించిన ఆనాడు ఆయన మాట్లాడిన దృశ్యాలను కూడా ఈ మీడియా సమావేశం ద్వారా ప్రజలంతా చూసేందుకు ప్రదర్శిస్తున్నాను. ఇప్పుడు సొంత యాదవ కులానికి చెందిన మహిళ కంట్లో కన్నీరు చూడాలని మరో టీడీపీ ఎమ్మెల్యేతో కలిసి ఇన్నికుట్రలు చేస్తున్నారు. యాదవ సామాజిక వర్గంకు దక్కిన ఒక గౌరవాన్ని తమ చేతులతోనే చెరిపేయాలని వారు భావిస్తున్నారు. గడిచిన నాలుగేళ్లలో మేయర్‌గా కులాలు, మతాలకు అతీతంగా మా పార్టీ సిద్ధాంతం ప్రకారం నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. యాదవ కులానికి ఒక కమ్యూనిటీ భవనం కావాలని నాటి ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ని అడిగిన వెంటనే ఆయన అంగీకరించడం, ఎండాడ హైవే పక్కనే అర ఎకరం స్థలం కేటాయించడం, భవన నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. గోకుల్ పార్కును కూడా అభివృద్ధి చేయడం జరిగింది. విప్‌ను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలి: మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ గత కొన్ని రోజులుగా మేయర్ పదవి కోసం కూటమి ప్రభుత్వం కుట్ర రాజకీయాలు చేస్తోంది. బీసీలను, మహిళలను రాజకీయంగా ఉన్నత స్థానాలకు తీసుకురావడం కోసం యాదవ కులానికి చెందిన గొలగాని హరివెంకట కుమారిని ఆనాడు వైయస్ జగన్ మేయర్‌గా ఎంపిక చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఆమెను గద్దె దించడానికి అడ్డదారులు తొక్కుతోంది. కార్పొరేషన్ నిధులను తెలుగుతమ్ముళ్లకు దోచిపెట్టడానికి కుట్రలు చేస్తున్నారు. అధికార బలంతో ఎన్ని కుట్ర రాజకీయాలు చేసినా వైయస్ఆర్‌సీపీ సభ్యులు ధైర్యంగా ఎదుర్కొంటారు. హరి వెంకట కుమారి మిగిలిన 11 నెలల పదవీకాలాన్ని కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ధీమాగా చెబుతున్నాను. వైయస్ఆర్‌సీపీ సభ్యులు 58 మందికి విప్ జారీ చేస్తున్నాం. దాన్ని ఉల్లంఘించిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారికి విన్నవిస్తున్నాం. ఏ అధికారైనా అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తే వాళ్లందర్నీ న్యాయస్థానం ముందు నిలబెడతాం. అవిశ్వాస తీర్మాన కార్యక్రమాన్ని ప్రజాస్వామ్య బద్దంగా నిర్వహిచాలని డిమాండ్ చేస్తున్నాం.