ఆరోగ్యశ్రీకి మంగళం. పేద రోగులకు శాపం

హైబ్రిడ్‌ మోడల్‌తో ప్రభుత్వ తీరు దారుణం

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ధ్వజం

10 నెలల్లోనే ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసిన కూటమి ప్రభుత్వం

3 నెలలుగా రాష్ట్రంలో నిలిచిపోయిన ఆరోగ్యసేవలు 

రూ.3500 కోట్ల పెండింగ్‌ బిల్లులు చెల్లించని ప్రభుత్వం

26 సార్లు లేఖలు రాసినా ఏ మాత్రం పట్టించుకోని ప్రభుత్వం

20 ఏళ్ల ఆరోగ్యశ్రీకి ఈ దుస్థితి కల్పించిన చంద్రబాబు 

కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు ఫైర్‌

నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం ప్రజల హక్కు  

దాన్ని చంద్రబాబు అడుక్కునే స్థితికి దిగజార్చారు

ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆక్షేపణ

శ్రీకాకుళం జిల్లా పలాసలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ డాక్టర్ల విభాగం రాష్ట్ర అ«ధ్యక్షుడు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు 

పలాస:రాష్ట్రంలో ఆరోగ్యశ్రీకి టీడీపీ కూటమి ప్రభుత్వం మంగళం పాడడంతో, అది పేద రోగులకు శాపంలా మారిందని, హూబ్రిడ్‌ మోడల్‌తో పథకాన్ని అమలు చేయాలన్న ప్రభుత్వ తీరు దారుణమని వైయ‌స్ఆర్‌సీపీ డాక్టర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ధ్వజమెత్తారు. కేవలం 10 నెలల్లోనే కూటమి ప్రభుత్వం ఒక గొప్ప పథకాన్ని నిర్వీర్యం చేసిందని పలాసలో మీడియాతో మాట్లాడిన ఆయన ఆక్షేపించారు.

సీదిరి అప్పలరాజు ఇంకా ఏం మాట్లాడారంటే..:

ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం:
    రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీని సీఎం చంద్రబాబు పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఆరోగ్యశ్రీని ట్రస్టు విధానంలో కాకుండా బీమా రూపంలో ప్రైవేట్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీల ద్వారా అమలు చేయాలని గతంలోనే సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవలను ఆపేసి ప్రజలకు ఒక గొప్ప కానుక ఇచ్చింది.
    దివంగత వైయస్సార్‌ 20 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం చంద్రబాబు కారణంగా ఆగిపోయింది. రూ.3500 కోట్ల పెండింగ్‌ బిల్లులు చెల్లించని కారణంగా వైద్యం చేసేందుకు నెట్‌వర్క్‌ ఆస్పత్రులు అంగీకరించడం లేదు. 

హెచ్చరించినా ప్రభుత్వం బేఖాతరు:
    ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ (ఆశా) నెల ముందే  నోటీస్‌ ఇచ్చినా, ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలతో చర్చలు జరపలేదు. నిజానికి బకాయిల కోసం ‘ఆశా’ ప్రతినిధులు ఈ ప్రభుత్వానికి ఏకంగా 26 సార్లు లేఖ రాశారంటే, ప్రభుత్వ తీరు ఎంత దారుణంగా ఉందో అర్ధమవుతోంది. వాస్తవానికి 3 నెలల నుంచే ఆరోగ్యశ్రీలో ఆస్పత్రులు చాలా వైద్య సేవలు నిలిపివేశాయి. ఈ ఏడాది జనవరి 6 నుంచి ఆరోగ్యశ్రీలో ఓపీ, ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్‌ (ఈహెచ్‌ఎస్‌)తో పాటు, అన్ని రకాల నగదు రహిత సేవలు నిలిపి వేశాయి. ఇప్పుడు మొత్తం వైద్యసేవలు ఆపేశాయి.
    వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నామంటూ ఈరోజు సుదీర్ఘంగా మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు, అదే వైద్య రంగంలో కీలకమైన ఆరోగ్యశ్రీ సేవలు నిల్చిపోవడంపై మాట్లాడకుండా, కేవలం ఆ బిల్లుల ప్రస్తావన తెచ్చారు. అది కూడా ఆ బిల్లులు చెల్లించడానికి ఫైనాన్స్‌ సెక్రటరీ చేతులెత్తేశాడని నవ్వుతూ చెప్పాడం చూస్తే పథకం అమలుపై ఆయన చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు.  

వైయ‌స్ఆర్‌సీపీ హయాంలోనే ప్రైమరీ కేర్‌ బలోపేతం:
    వ్యాధులు నివారణే ధ్యేయంగా ప్రైమరీ కేర్‌ను బలోపేతం చేస్తూ, గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఒక విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ ఏర్పాటు చేసింది. ఆ క్లినిక్‌లో కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌తో పాటు, స్టాఫ్‌ నర్సును నియమించాం. ప్రతి మండలానికి రెండు పీహెచ్‌సీలు ఉండేలా, ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు మెడికల్‌ ఆఫీసర్లు ఉండేలా నిబంధనలు రూపొందించాం. ఆ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 88 పీహెచ్‌సీలను నిర్మించడం జరిగింది. 
    ఇంకా నాడు నేడు కింద పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలను నవీకరించాం. ప్రతి పౌరుడి హెల్త్‌ డేటా ఉండాలని ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ద్వారా ఇంటింటికీ వెళ్లి టెస్టులు నిర్వహించి డిజిటల్‌ హెల్త్‌ కార్డులో వారి హెల్త్‌ వివరాలను నమోదు చేశాం. 1.43 కోట్ల కుటుంబాలకు స్మార్ట్‌ హెల్త్‌ కార్డులు ఇచ్చిన ఘనత మా వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వానిదేనని గర్వంగా చెబుతున్నాం.వైయ‌స్ఆర్ ఆరోగ్య ఆసరా ద్వారా మరో రూ.1,465 కోట్లకు పైగా ఆర్థిక సాయం అందించి భరోసానిచ్చాం. 
    ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్టు ద్వారా ప్రతి రెండు వారాలకు డాక్టర్‌ గ్రామాన్ని సందర్శించి రోగులకు పరీక్షలు నిర్వహించి వారికి మందులిచ్చారు. జగన్‌గారు తీసుకొచ్చిన ఈ వినూత్న కార్యక్రమాలన్నీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కక్షపూరితంగా పూర్తిగా నిలిపివేశారు. 

పీహెచ్‌సీలను కూడా ప్రైవేటుపరం చేస్తారా?:
    ప్రతి నియోజకవర్గంలో పీపీపీ మోడ్‌లో 100 నుంచి 300 పడకల ఆస్పత్రి కడతామన్నారు సరే! ఇప్పుడున్న పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలను పెట్టి మెడికల్‌ కాలేజీలను ప్రైవేటుకు ఇచ్చేసినట్టే ఇచ్చేస్తారా? ఇంకెందుకు లేట్‌? టు లెట్‌ బోర్డులు పెట్టేయండి. 
    ఇకనైనా చంద్రబాబు ఆకాశం నుంచి నేలకు దిగి రావాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ముందులే అందుబాటులో లేని పరిస్థితులు ఉంటే అమరావతిలో గ్లోబల్‌ హెల్త్‌ సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పడం హాస్యాస్పదం. అమరావతిలో హెల్త్‌ సిటీ ఏర్పాటు చేస్తే ప్రజల అవసరాలన్నీ తీరిపోతాయా? మా హయాంలో ఆస్పత్రుల్లో మందులు లేని పరిస్థితులు ఏనాడూ లేవు. కానీ ఇప్పుడు టీబీ కంట్రోల్‌ ప్రోగ్రామ్‌లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు కూడా ఇవ్వలేని అసమర్థ స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. 
    విద్య, వైద్యం అనేది ప్రభుత్వాల బాధ్యత. అది ప్రజల హక్కు. చంద్రబాబు ఈ విషయం మర్చిపోయి ప్రతి దాన్నీ ప్రైవేటుపరం చేయడం ఏమిటి? ప్రభుత్వం ప్రజల కోసం పని చేస్తోందా? లేక ప్రైవేటు వ్యక్తుల కోసం పని చేస్తోందా?. 
    వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో విశాఖలో 400 ఎకరాల్లో దేశంలోనే పెద్ద పెద్ద ఆస్పత్రులతో మెగా హెల్త్‌ సిటీని ఏర్పాటు చేశారు. దీంతో పాటు విమ్స్‌ ప్రభుత్వ వైద్యశాలను నిర్మించి ఉచిత వైద్యం అందించాం. చంద్రబాబుకు చేతనైతే ఆ విధంగా ప్రజారోగ్యాన్ని బలోపేతం చేయాలి తప్ప, వైద్యాన్ని ప్రైవేటుపరం చేస్తామనడం సమంజసం కాదు.

హైబ్రిడ్‌ మోడల్‌తో ప్రభుత్వంపై భారం. ప్రజలకు నష్టం:
    గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ కింద రూ.5 లక్షల ఆదాయ పరిమతితో 1.43 కోట్ల కుటుంబాలకు రూ.2,450 కోట్లతో వైద్యం అందిస్తే, చంద్రబాబు రూ.2.5 లక్షల కవరేజీ ఇచ్చే హైబ్రిడ్‌ మోడల్‌ను ప్రవేశపెడుతున్నారు. దీని కోసం ప్రతి కుటుంబానికి రూ.2500 చొప్పున ఇన్సూరెన్స్‌ కంపెనీలకు చెల్లించి అదనంగా మరో రూ.1,100 కోట్లు ఎందుకు ఖర్చు చేయనున్నాడు.  ఇది కాకుండా ఆరోగ్యశ్రీ చెల్లించబోయే బిల్లులు అదనం. ఇదంతా ప్రభుత్వంపై అదనపు భారం మోపడం కాదా? ఇదంతా ఇన్సూరెన్స్‌ కంపెనీలకు దోచి పెట్టడానికి కాదా?  దీనివల్ల ప్రజలకు కానీ, ప్రభుత్వానికి కానీ ఏదైనా లాభం ఉందేమో చెప్పాలి. 
    ప్రైవేటు కంపెనీలకు లక్షన్నర కుటుంబాలను ఎన్యుమరేట్‌ చేయడం ఎంత కష్టమో ప్రభుత్వానికి తెలియకపోవడం విడ్డూరంగా ఉంది. వారి వద్ద అంత పెద్ద యంత్రాంగం ఉంటుందా? ప్రైవేటు కంపెనీలకు దోచిపెట్టడానికి ప్రభుత్వం ఎంతకైనా తెగిస్తుందా?  

చంద్రన్న బీమాను ఎప్పుడు పునరుద్ధరిస్తారు?
    కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త ఆధ్వర్యంలో 2014లో అసంఘటిత రంగ కార్మికుల కోసం బీమా సౌకర్యాన్ని కల్పించారు. రాష్ట్రంలో చంద్రన్న బీమా పథకం అమలు చేశారు. 2019లో వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్రం ఈ పథకం నుంచి వైదొలిగితే కుటుంబ పెద్దను బీమాలో చేర్చి అమలు చేయడం జరిగింది. 
మొన్న ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రన్న బీమాను పునరుద్ధరిస్తామని చెప్పారు. కానీ ఏడాది గడిచినా ఇంతవరకు అమలు చేసిన పాపాన పోలేదు.

అక్రమంగా రూ.100 కోట్లు వసూలు:
    సభ్యత్వం ఉంటే పథకాలు ఇస్తామని నమ్మించి ఒక్కొక్కరి నుంచి రూ.100 వసూలు చేసి బలవంతంగా కోటి మందితో టీడీపీ సభ్యత్వాలు నమోదు చేయించి గొప్పగా ప్రచారం చేసుకున్నారు. ఆ విధంగా దాదాపు వంద కోట్లు వసూలు చేశారు కానీ, ఇప్పటివరకు ఆ పార్టీ కార్యకర్తలకు బీమా చెల్లించలేదు. ఈ డబ్బంతా ఏమైనట్లు?. కాబట్టి ఇది ఎంత పెద్ద నేరమో ప్రజలంతా ఆలోచించాలని సీదిరి అప్పలరాజు కోరారు.

Back to Top