తాడేపల్లి: మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ రామగిరి పర్యటనలో పోలీసుల భద్రతా వైఫల్యం ప్రస్పుటమైందని ఎమ్మెల్సీ, వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయం ఇన్‌చార్జీ లేళ్ళ అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రామగిరిలో హెలికాఫ్టర్ విండ్‌షీల్ట్ ధ్వంసంపై పలు అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. ముందుస్తు సమాచారంతోనే వైయస్ జగన్ పర్యటించినా పోలీసులు కనీస బందోబస్త్ కూడా ఏర్పాటు చేయకపోవడం వెనుక కుట్ర ఉందా అనే సందేహం కలుగుతోందని అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ఇటీవల రామగిరి ఎంపీపీ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతలు చేసిన దౌర్జన్యాలు, అరాచకాల నేపథ్యంలో పాపిరెడ్డిపల్లిలో వైయస్ఆర్‌సీపీ నాయకుడు కురుబ లింగమయ్య దారుణ హత్యకు గురయ్యాడు. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ గారు పాపిరెడ్డిపల్లికి వెళ్ళారు. ఆయన పర్యటనలో రాష్ట్రప్రభుత్వ వైఖరీ, పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపించింది. హెలికాఫ్టర్‌లో జగన్ గారు ఆ ప్రాంతానికి వెడితే, హెలిప్యాడ్‌లో నిలిచిఉన్న హెలికాఫ్టర్ విండ్ షీల్డ్ పగిలిపోయిందంటే పోలీసులు ఏ మేరకు భద్రత కల్పించారో అర్థం చేసుకోవచ్చు. రెండు రోజుల ముందే ఈ పర్యటన ఉంటుందని అన్ని ప్రభుత్వ విభాగాలకు సమాచారం ఇచ్చి, అనుమతులు తీసుకున్న తరువాతే హెలికాఫ్టర్‌లో అక్కడికి వెళ్ళారు. హెలిప్యాడ్‌కు భద్రత కల్పించాల్సిన పోలీస్ అధికారులు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మాజీ సీఎం, దేశంలోనే అత్యంత ప్రజాధరణ కలిగిన నాయకుడుగా వైయస్ జగన్ పర్యటనకు వెడుతుంటే ఏ మేరకు భద్రత కల్పించాలనే అంచనా పోలీస్ యంత్రాంగానికి లేదా? కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలోని నాయకుడికి కల్పించే భద్రత ఇదేనా? ఒక మాజీ సీఎంకే రక్షణ కల్పించలేకపోతే రాష్ట్రంలో సామాన్యులకు ఏం రక్షణ కల్పించగలరు? వైయస్ జగన్‌కు భద్రతను తగ్గించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైయస్ జగన్ వ్యక్తిగత భద్రతను, నివాసం వద్ద భద్రతను తగ్గించారు. ఆయన పర్యటనల సందర్బంగా పోలీసులు ఎక్కడా భద్రతా చర్యలను చేపట్టడం లేదు. చట్టాలను అనుసరించి పనిచేయాల్సిన పోలీసులు ఈ రాష్ట్రంలో కూటమి నేతల ఆదేశాల మేరకే పనిచేస్తున్నారు. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతుంటాయి. వ్యవస్థలు మాత్రమే శాశ్వతంగా ఉంటాయి. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి లోబడి వ్యవస్థలు పనిచేయాలి. కానీ ఏపీలో రాజ్యాంగానికి తూట్లు పొడుతూ, రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రభుత్వం, అధికారులు పనిచేస్తున్నారు. ఈ రోజు కూటమి అధికారంలో ఉందని, చట్టాలకు విరుద్దంగా వారు చెప్పినట్లే పనిచేస్తే, రాబోయే రోజుల్లో వైయస్ఆర్‌సీపీ మళ్లీ అధికారంలోకి వస్తుంది. చట్ట విరుద్దంగా రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసిన అధికారులు ఆరోజు చట్టం ముందు దోషులుగా నిలబడే పరిస్తితి వస్తుంది. శ్రీశైలంలోని మహానంది ప్రాంతంలో పర్యటకు వెళ్ళినా, ఇటీవల గుంటూరు మిర్చియార్డ్‌కు వెళ్లిన సందర్భంలోనూ ఒక్క పోలీస్ అధికారి కూడా భద్రతా ఏర్పాట్లలో కనిపించలేదు. చివరికి వైయస్ఆర్‌సీపీ శ్రేణులే వైయస్ జగన్ గారికి భద్రత కల్పిస్తూ రోప్ పట్టుకుని ముందుకు నడిచాయి. వైయస్ జగన్ గారికి ప్రత్యేక భద్రత కల్పించాలని కేంద్ర మంత్రులను కలిసి గతంలో వినతిపత్రాలు సమర్పించాం. మరోసారి ఈ పరిస్థితులను కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకువెడతాం. ఈ రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన సాగుతోంది. వైయస్ఆర్‌సీపీ నాయకులపై దాడులు చేస్తున్నారు, వారిని హతమారుస్తున్నారు. ఆ బాధిత కుటుంబాలను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పేందుకు వైయస్ జగన్ పర్యటిస్తుంటే, ఆయనకు కనీస భద్రతను కూడా కల్పించడం లేదు. అభిమానుల ముసుగులో అసాంఘికశక్తులు విండ్‌షీల్డ్ డ్యామేజీ పైనా అనుమానాలు కలుగుతున్నాయి. కొందరు దుండగులు, అసాంఘికశక్తులు ఒక పథకం ప్రకారం వైయస్ జగన్ అభిమానుల ముసుగులో ఆయన పర్యటనలో పాల్గొని దాడులకు పాల్పడుతున్నారు. గతంలో కూడా ఇదే తరహాలో రెండు పర్యాయాలు వైయస్ జగన్ పై దాడి జరిగింది. వైయస్ జగన్ గారికి భద్రత కల్పించే విషయంలో రాష్ట్రప్రభుత్వం బాధ్యత వహించాలి. ఒక మాజీ సీఎం, ఒక పార్టీ అధ్యక్షుడికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? ఈ ప్రభుత్వం చేస్తున్న దుశ్చర్యలను ప్రజల్లోకి కూడా తీసుకుపోతున్నాం. అందరు అధికారులను మేం తప్పు పట్టడం లేదు. కేవలం పచ్చొక్కాలు వేసుకుని, చట్ట విరుద్దంగా వ్యవహరించే పోలీసులను మాత్రమే మేం ప్రశ్నిస్తున్నాం. వారి వ్యవహారశైలిని ఆక్షేపిస్తున్నాం.