ఎవర్నీ వదిలేది లేదు.. అన్ని గుర్తు పెట్టుకుంటాం

ఎంపీ అవినాష్‌ రెడ్డి వార్నింగ్ 

క‌డ‌ప‌లో మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాకు ప‌రామ‌ర్శ‌

వైయ‌స్ఆర్ జిల్లా : అక్రమ కేసులు పెట్టి వైయ‌స్ఆర్‌సీపీ నాయకులను అరెస్ట్‌ చేస్తున్నార‌ని, ఎవరినీ వదిలేది లేదు.. అన్ని గుర్తు పెట్టుకుంటామ‌ని ఎంపీ అవినాష్‌ రెడ్డి హెచ్చరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాక్షసానందం పొందుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో వైయ‌స్ఆర్‌సీపీ కేడర్‌ వినాశమే టార్గెట్‌గా అధికారులు పని చేస్తున్నారని ధ్వ‌జ‌మెత్తారు.  ఇటీవల మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ బాషా ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంజాద్ బాషాను అవినాష్‌రెడ్డి పరామర్శించి, ధైర్యంగా ఉండాలని, పార్టీ తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం అవినాష్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాక్షసానందం పొందుతోంది. అభివృద్ధిపై కాకుండా వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులే లక్ష్యంగా పెట్టుకున్నారు. మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాష సోదరుడు అహ్మద్ బాషాపై అక్రమ కేసు నమోదు చేశారు. తీవ్రవాది మాదిరి ముంబై వెళ్ళి అహ్మద్‌ను అక్రమ అరెస్టు చేసి అత్యుత్సాహంగా కడపకి తెచ్చారు. ఆయన అరెస్ట్ తర్వాత అంజాద్ బాషా ఇంటి సమీపంలో టీడీపీ నాయకులు సంబరాలు చేయడం దారుణం. కడపలో టీడీపీ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడటం దుర్మార్గం. ఎమ్మెల్యే మాధవి రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి దగ్గర మెప్పు పొందడానికి అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. అక్రమ కేసులు, వేధింపులకు గురిచేస్తున్న ఎవరినీ వదిలేది లేదు.. అన్ని గుర్తు పెట్టుకుంటాం’ అని అవినాష్‌రెడ్డి హెచ్చరించారు.

Back to Top