నెల్లూరు: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి స్వయాన దళిత బంధువు, వారి క్షేమం కోరే వ్యక్తి అని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున పేర్కొన్నారు. గత రెండు రోజులుగా కొన్ని ప్రసార మాధ్యమాలలో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల మీద దాడులు పెరిగాయని, అమెరికన్ మానవ హక్కుల నివేదిక రిపోర్ట్ ఇచ్చిందని కొన్ని మీడియాలలో అదే పనిగా చూపిస్తున్నారని ఆయన ఖండించారు. నిజానికి గత 10 ఏళ్లలో చూసినా, అంతకు ముందు చూసినా కూడా రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే దళితులకు ఎంతో మేలు జరుగుతోందన్నారు. వారి కోసం అనేక సంక్షేమ పధకాలు అమలు జరుగుతున్నాయని చెప్పారు. సోమవారం నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేరుగ నాగార్జున మాట్లాడారు. – దళితులపై ఎక్కడైనా దాడి జరిగినా, అమానుషం జరిగినా చాలా ఆర్గనైజేషన్స్ ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటాయి. ఏషియన్ దళిత్ రైట్స్ ఫోరం, ఎన్‌సీడిహెచ్‌ఆర్, ఎన్‌సీఆర్‌బీ రిపోర్ట్ వాచ్ చేస్తుంటాయి. మానవ హక్కుల నివేదిక మూడు, నాలుగు ఘటనలు చెప్పి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో కూడా తెలియజేసింది. కానీ అది చెప్పకుండా చీరాల, రాజమండ్రి, కాశీబుగ్గ, నర్సీపట్నంలో జరిగిన ఘటనలను మాత్రమే ఆ మీడియాలో చూపుతున్నారు. – ఒక దళితుడిగా, ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌గా పని చేసిన వాడిగా నేను చెబుతున్నా.. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో దళితులపై దాడులు, అఘాయిత్యాలు, వెలివేతలు యథేచ్ఛగా జరిగాయి. బహిరంగంగా మంత్రులే దాడులు చేశారు. ఎన్సీఆర్‌బీ రిపోర్టు కూడా ఉంది. అవన్నీ మర్చిపోయి ఎక్కడో మూడు, నాలుగు చోట్ల జరిగితే వాటిపై నానా యాగీ చేస్తున్నారు. ప్రభుత్వ చర్యలు చెప్పకుండా మసి పూసి మారేడు కాయ చేయాలని చూస్తున్నారు. సీఎం స్వయాన దళిత బంధువు. దళిత సంక్షేమం కోరే వ్యక్తి కాబట్టి ఆయనకు వ్యతిరేకంగా ఆ మీడియా చూపుతోంది. – తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో మేం ప్రజలకు ఇది చేశాం కాబట్టి ఓట్లు అడగుతున్నాం. కానీ టీడీపీ, బీజేపీ అలా ఎందుకు చెప్పలేకపోతున్నాయి? మీరు నిజంగా సహాయం చేస్తే ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళి ఎందుకు చెప్పలేరు? చంద్రబాబు నీ సొంత జిల్లాలో టీడీపీ పూర్తిగా ఓడిపోయింది. మీ కుమారుడిని మంగళగిరిలో పోటీ చేయించినా ఓడిపోయాడు. ఇంకో నాయకుడు పవన్‌కళ్యాణ్ ఎప్పుడేం చేస్తున్నాడో అర్ధమవుతుంది. టీడీపీ నుంచి ప్యాకేజీ తీసుకున్న విషయం కూడా తెలుసుకున్నారు. బీజేపీ ఏ మొఖం పెట్టుకుని తిరుపతిలో ఓట్లు అడుగుతుంది? విభజన చట్టంలో హమీలు గాలికొదిలేసి, హోదా పక్కన బెట్టి ఏ విధంగా ఓట్లు అడుగుతారు? ఇది ప్రజలను మోసగించడం కాదా? – సునీల్ దేవధర్ ఏంటో ఆయన పార్టీ ఏంటో అర్ధం కావడం లేదు. ఆయన తిరుపతిలో మా పార్టీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి గురించి మాట్లాడుతున్నాడు. గురుమూర్తి కులం, మతం ఏమిటని ప్రశ్నిస్తున్నాడు. డాక్టర్ గురుమూర్తి దళితుడు. ఆయన మావాడు. దళితులుగా ఈ రాష్ట్రంలో ఉన్న మా మతం ఏంటో నువ్వు అడుగుతావా? ఆయన కులం, మతం అడిగే అర్హత నీకుందా? ఏ దేవున్ని అయినా పూజించే అర్హత మాకుంది. మేము గుడికి వెళ్తాం. మసీదు కెళ్తాం. చర్చికెళ్తాం. అది మా ఇష్టం. దేవుడి గుళ్ళు పగలగొట్టిస్తావు. రధాలు తగలబెట్టిస్తావు. నీలాంటి ధర్డ్ క్లాస్ లీడర్స్‌కి సమాధానం చెప్సాల్సిన అవసరం లేదు. మేఘాలయాలో నువ్వేం చేశావు. తిరుపతిలో పవన్‌కళ్యాణ్ సినిమా కోసం రోడ్లమీదకు వెళ్ళే నీకు మా దళితులను ప్రశ్నించే హక్కు లేదు. మాకు ఆత్మగౌరవం ఉంది, మాకు అంబేద్కర్ ఆలోచన ఉంది. మీ కుయుక్తులు ఆపండి. – ప్రత్యేక హోదా కోసం నిరంతరం పోరాడుతూనే ఉన్నాం. కానీ చంద్రబాబులా కప్పదాట్లు, ప్యాకేజీల కోసం కాదు. సింహం సింగిల్‌గా వస్తుంది కాబట్టే ఒంటరి పోరాటం చేసి గెలిచాం. అంతే కానీ మీ మాదిరిగా కాదు. – టీడీపీ వాళ్ళు దేవుడి విగ్రహాలు కూల్చి రోడ్ల మీద వేస్తే అచ్చన్నాయుడుని అరెస్ట్ చేయాలని బీజేపీ ఎందుకు ప్రశ్నించదు. మీరంతా ఒకటే. చంద్రబాబు, బీజేపీ, పవన్‌కళ్యాణ్ అంతా ఒకటే. మీరు ఎన్ని కుయుక్తులు పన్నినా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన డాక్టర్ గురుమూర్తికి సీఎం శ్రీ వైయస్ జగన్ టికెట్ ఇచ్చారు. కానీ బీజేపీ ఒక ఐఏఎస్‌కి, టీడీపీ ఒక మాజీ కేంద్రమంత్రిని గెలిపించమని కోరుతున్నారు. మీరు ఇలా చేస్తున్నారు కాబట్టే, ప్రజలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ వెంట నడుస్తున్నారు. – మా తప్పిదాలు ఉంటే ఈపాటికే బీజేపీ ఒకవైపు, చంద్రబాబు ఒక వైపు మా రెక్క పట్టుకుని మాట్లాడేవారు. కానీ ఏం లేక మాట్లాడలేక చేష్టలుడిగి చూస్తున్నారు. రైతు.భరోసా, చేయూత, 104, 108, ఆరోగ్యశ్రీ ఇలా ఏది చూసినా సంక్షేమమే. దేని గురించి తిరుపతిలో మాట్లాడతారు. ఇళ్ళ పట్టాలు అడ్డుకున్న మీరు తిరుపతిలో ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారు. పట్టణాలతో పాటు పల్లెల్లో అన్నీ ఇస్తుంటే మాట్లాడడానికి ఏం లేక పిచ్చిపిచ్చిగా వాగుతున్నారు. – చంద్రబాబు కొడుకు ధరల గురించి మాట్లాడుతున్నాడు. నీకు ధరలు ఎప్పుడు పెరుగుతాయో? ఎప్పుడు తగ్గుతాయో తెలుసా? నీ అజ్ఞానం అందరికీ తెలుసు. మా పెద్దిరెడ్డి గారు చెప్పినట్లు ఛాలెంజ్‌కి సిద్దమా అని అడుగుతున్నా. చంద్రబాబు నీ హత్యా రాజజకీయాల గురించి, నీలాంటి రక్త చరిత్ర, నీలాంటి నీచ సంస్కృతి రాజకీయాల్లో ఎవరికైనా ఉన్నాయా? వివేకానంద హత్య కేసులో సీబీఐ దర్యాప్తులో అన్నీ బయటికి వస్తాయి. – తిరుపతిలో ఇంకో మూడు రోజుల్లో ప్రచారం ముగుస్తుంది. సునీల్ దేవధర్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. తప్పక మా పార్టీ అభ్యర్ధి డాక్టర్ గురుమూర్తిని మంచి మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున పేర్కొన్నారు.