కూటమి నేతల చేతుల్లో ఆక్వారంగం

సిండికేట్ అయి రైతులను దోచుకుంటున్నారు

టారీఫ్‌ల సాకుతో ఆక్వారేట్లు తగ్గించేశారు

ఆక్వా రైతుల కన్నా... కూటమి నేతలకే సర్కార్ అండ

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్ర‌సాద‌రాజు ఆగ్రహం

భీమ‌వ‌రం: రాష్ట్రంలో కూటమి నేతల చేతుల్లో ఆక్వారంగం ఉండటంతో ఇష్టారాజ్యంగా వారు ఆక్వారైతులను దోచుకుంటున్నారని వైయ‌స్ఆర్‌సీపీ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు మండిపడ్డారు. భీమవరంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి నేతలు ఆక్వాసంస్థలను అడ్డం పెట్టుకుని సిండికేట్‌గా మారి రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టారీఫ్ ల సాకుతో ఆక్వా రేట్లను గణనీయంగా తగ్గించివేశారని ధ్వజమెత్తారు. ఆక్వా రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం కూటమి నేతలకే కొమ్ము కాస్తోందని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే...

- ఆక్వా ఉత్ప‌త్తిలో ఏపీ దేశంలోనే మొద‌టిస్థానంలో ఉంది. దేశంలో మ‌త్స్య ఉత్ప‌త్తి 1.84 లక్ష‌ల ట‌న్నులుంటే అందులో మెజారిటీ వాటా 51 ల‌క్ష‌ల ట‌న్నులు ఏపీ నుంచే ఉంటోంది. ఇందులో 76 శాతం రొయ్య‌లు, 24 శాతం చేప‌లు ఉత్ప‌త్తి ఉంది. 

- భార‌త‌దేశంలో వ్య‌వ‌సాయ అనుబంధ రంగాల‌న్నింటిలో వ‌చ్చే ఆదాయంలో 10 శాతం ఆక్వా ఉత్ప‌త్తుల ద్వారా ల‌భిస్తోంది. ఇలాంటి ఆక్వా రంగంలో రైతులు కుదేలైపోతుంటే కూట‌మి ప్ర‌భుత్వానికి చీమ‌కుట్టిన‌ట్ట‌యినా లేదు. ధ‌ర‌లు త‌గ్గిపోతుంటే క‌నీసం మాట‌సాయం చేయాల‌న్న ఆలోచ‌న కూడా చేయ‌డం లేదు. రాష్ట్రంలో దాదాపు ల‌క్ష‌న్న‌ర మంది రైతులు ఆక్వారంగం మీద ఆధార‌ప‌డి జీవిస్తున్నారు. వారి బాగోగుల‌ను కూట‌మి ప్ర‌భుత్వం గాలికొదిలేసింది. 

- ఫీడ్‌, సీడు, గిట్టుబాటు ధ‌ర విష‌యంలో రాష్ట్రంలో ఆక్వా రైతులు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. గ‌డిచిన ప‌ది రోజులుగా అమెరికాలో నెల‌కొన్న ప‌రిస్ధితులు నేపథ్యంలో పంట‌ను కొనేందుకు బ‌య్య‌ర్లు ముందుకు రావ‌డం లేదు. ఒకేసారి ధ‌ర రూ. 40 నుంచి 50 ల‌కు పడిపోవ‌డంతో ఆక్వా రైతుల ప‌రిస్ధితి దిక్కుతోచ‌ని విధంగా త‌యారైంది. ఫీడు, సీడు, ఉత్ప‌త్తి, స‌ర‌ఫ‌రా విష‌యంలో ఏ ఇబ్బంది వ‌చ్చినా, ధర‌లు పెరిగినా అంతిమంగా ఆ భారం పండించే రైతు మీద‌నే ప‌డుతోంది. దాన్ని నియంత్రించాల‌న్న క‌నీసం జ్ఞానం ప్ర‌భుత్వానికిల లేదు. 

ఆక్వా రైతుల‌కు అండ‌గా నిలిచిన వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వం

- గ‌త మా వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వ హయాంలోనూ ఇలాంటి ప‌రిస్థితులే ఎదురైన‌ప్పుడు ప్ర‌భుత్వ‌మే బాధ్య‌త తీసుకుని ఆక్వా రైతుల‌కు అండ‌గా నిల‌బ‌డింది. క‌రోనా స‌మ‌యంలో ఎగుమ‌తులు నిలిచిపోయిన‌ప్పుడు కూడా రైతుల‌కు అండ‌గా నిలిచాం.  

- నాటి ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ చైర్మ‌న్ గా ఒక సాధికార క‌మిటీని ఏర్పాటు చేసి ప్ర‌తి 15 రోజుల‌కోసారి అంత‌ర్జాతీయ స్థాయిలో ధ‌రల హెచ్చుత‌గ్గుల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ఉత్ప‌త్తిదారులు, రైతుల‌తో సమ‌న్వ‌యం చేసి ధ‌ర‌ల నియంత్ర‌ణ చేయ‌డం జరిగింది. 

- సాధికార క‌మిటీ మార్కెట్ ధ‌ర‌ల‌ను నియంత్రించ‌డంతోపాటు ముడి స‌రుకు ధ‌ర‌ల్లో హెచ్చుత‌గ్గులు వ‌చ్చిన‌ప్పుడు ఆ మేర‌కు ఫీడు ధ‌రల్లోనూ మార్పులు ఉండేలా సాధికార క‌మిటీ ప‌ర్య‌వేక్షించి రైతుల‌కు, స‌ర‌ఫ‌రా దారుల‌కు.. ఇద్ద‌రికీ న‌ష్టం రాకుండా చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రిగింది. ఎవ‌రైనా కొనుగోలు చేయ‌క‌పోయినా ఆ కంపెనీల‌పై చ‌ర్య‌లు తీసుకునేలా చ‌ట్టాలు తీసుకొచ్చాం. క‌రోనా స‌మ‌యంలో లారీలు వెళ్ల‌డానికి అనుమ‌తి లేకపోవ‌డంతో  ప‌శ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల‌తో మాట్లాడి అనుమ‌తులు తీసుకొచ్చాం.  

- రైతులపై క‌రెంట్ భారం ప‌డ‌కుండా యూనిట్ రూ. 1.50ల‌కే స‌బ్సిడీ ధ‌ర‌ల‌కు క‌రెంట్‌ను అందించ‌డం జ‌రిగింది. గడిచిన ఐదేళ్లలో వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలో క‌రెంట్ స‌బ్సిడీ రూపంలో రూ. 3500 కోట్ల మేర ఆక్వా రైతుల‌కు ల‌బ్ధి చేకూర్చ‌డం జ‌రిగింది. 

- గ్రామాల్లో రైతు భ‌రోసా కేంద్రాలు ఏర్పాటు చేసి అందులో ఫిష‌రీస్ అసిస్టెంట్‌ను నియ‌మించడంతోపాటు ఆర్బీకే సెంట‌ర్ల‌లోనే సీడు, ఫీడు, పురుగు మందులు అందించ‌డం జ‌రిగింది. భూసార ప‌రీక్ష‌లు నిర్వ‌హించాం.  

కూట‌మి పాల‌న‌లో ఆక్వా రైతుల‌కు క‌ష్టాలు

- క‌రోనా లాంటి స‌మ‌యంలో కూడా నాటి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆక్వా రైతుల‌కు అండ‌గా నిల‌బ‌డితే ఈరోజు ముడిస‌రుకు ధ‌ర‌లు త‌గ్గినా ఫీడు ధ‌ర‌లు నియంత్రించ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంది. 

- గ‌త మా ప్ర‌భుత్వ హయాంలో ముడి స‌రుకు ధ‌ర‌లు పెరిగిన‌ప్పుడు ఫీడు రేటు పెర‌గ‌కుండా నియంత్రించ‌డం జ‌రిగింది. గ‌తంలో సోయా ధ‌ర రూ. 83 లు ఉంటే ఈరోజు రూ. 23 మాత్ర‌మే ఉన్నా ఫీడు ధ‌రను మాత్రం త‌గ్గించ‌డం లేదు. ముడిస‌రుకు ధ‌ర పెరిగిన‌ప్పుడు మాత్రం ఫీడు ధ‌ర‌లు పెంచేస్తున్నా, కూట‌మి ప్ర‌భుత్వం నియంత్రించ‌డం లేదు. 

సిండికేట్ దే రాజ్యం

- వ్యాపారులంతా సిండికేట్‌గా మారి రైతుల పొట్ట‌కొడుతున్నా వారిని కూట‌మి ప్ర‌భుత్వం నియంత్రించ‌లేక‌పోతోంది. అమెరికాలో నెల‌కొన్న ప‌రిస్ధితుల‌ను సాకుగా చూపించి ధ‌ర‌లు త‌గ్గిస్తున్నా, సిండికేట్ మొత్తం కూట‌మి నాయ‌కులే కావ‌డంతో ప్రభుత్వం కూడా చూసీచూడ‌న‌ట్టు వ‌దిలేస్తోంది. 

- వ్యాపారుల సిండికేట్ కి లాభం చేకూర్చేలా ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తోంది. ఎగుమ‌తిదారులు, ఫీడు ఉత్ప‌త్తి, త‌యారీదారులు, యాజ‌మాన్యాలు ప్ర‌భుత్వ అండ‌దండ‌ల‌తో న‌డుస్తున్నార‌నే భావ‌న రైతుల్లో ఉంది. కాబ‌ట్టే ప్ర‌భుత్వం వారిని నియంత్రించ‌డం లేద‌ని రైతులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. 

- కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక‌ ఆక్వా జోన్‌, నాన్ ఆక్వా జోన్ పేరుతో క‌రెంట్ స‌బ్సిడీలను చాలా వ‌ర‌కు కుందించేసింది. కొత్తగా ట్రాన్స్‌ఫార్మ‌ర్లు వేసుకోవాల‌న్నా వివిధ ర‌కాల చార్జీల పేరుతో ప్ర‌భుత్వం వేధింపుల‌కు గురిచేస్తుంది. 

- మొత్తం ఆక్వా ఉత్ప‌త్తిలో అమెరికా వాటా 30 శాత‌మే అయినా ధ‌ర‌లు మాత్రం భారీగా త‌గ్గించ‌డంతో రైతుల్లో ఒక్క‌సారిగా దిక్కుతోచ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. 20 కౌంట్ నుంచి 50 కౌంట్ దాకనే అమెరికాక ఎగుమ‌తి చేస్తుంటే 70 నుంచి 100 కౌంట్ ధ‌ర‌లను కూడా త‌గ్గించ‌డం ఆక్వా రైతుల‌ను కుంగ‌దీసింది. 

- ఇప్ప‌టికైనా సీడు, ఫీడు ధ‌ర‌ల నియంత్ర‌ణ‌, ఎగుమ‌తుల‌పై దృష్టి సారించి ఆక్వా రైతులు న‌ష్టపోకుండా ప్ర‌భుత్వం భ‌రోసా క‌ల్పించాలి.

Back to Top