తాడేపల్లి: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిది రైతు ప్రభుత్వమని, నవరత్నాల్లో కూడా మొదటిగా రైతుల సంక్షేమానికే ప్రాధాన్యమిచ్చినట్లు వైయస్ఆర్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేపటిభారత్ బంద్‌కు వైయస్ఆర్‌సీపీ రైతు విభాగం మద్దతు ఇవ్వనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 9 గంటలు పగలు విద్యుత్ ఇస్తోందని, బీమా ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తోందన్నారు. ఏదైతే కేంద్రాన్ని ప్రస్తుతం రైతులు డిమాండ్ చేస్తున్నారో వాటిని మన రాష్ట్రంలో పరిష్కరించామని వెల్లడించారు. రేపటి బంద్ వల్ల రైతుకు న్యాయం జరగాలని కోరుతూ.. రైతులపై, రైతుల సంఘాలపై గౌరవంతో ఈ బంద్ కి సంఘీభావం తెలుపుతున్నామని ఆయన చెప్పారు. ఈరోజు ఏమైతే కేంద్ర ప్రభుత్వం దగ్గర రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయో అవన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతోంది. అలాగే వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర ఉండాలి, ఆ ప్రకటించిన మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఇది రైతుల ప్రధానమైన డిమాండ్స్‌లో ఒకటి. - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా.. కేవలం రెండు ఏళ్ల కాలంలో రూ. 35వేల కోట్ల వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయడం జరిగింది. పంట సీజన్ కు ముందే మద్దతు ధరలను ప్రకటించి... వాటికి అనుగుణంగానే కొనుగోలు చేస్తున్నాం. ఏ డిమాండ్లతో దేశవ్యాప్తంగా రైతు సంఘాలు ఉద్యమం చేస్తున్నాయో, అవన్నీ దరిదాపుగా ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారి నాయకత్వంలోని ప్రభుత్వం అమలు చేయడం జరుగుతోంది. - అలాగే వైఎస్‌రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో కూడా రైతు సమస్యలు వచ్చినప్పుడు, మానవతా దృక్పధంతో, రైతులపై ప్రేమతో ఆ సమస్యలను తక్షణమే పరిష్కరించడం జరిగింది. ఇప్పుడు వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా రైతులన్నా, రైతు సంఘాల నాయకులు అన్నా సానుకూలంగానే ఉన్నాం. ఏపీలో ఇంతకు ముందు రెండుసార్లు రైతు సంఘాలు ఇచ్చిన బంద్‌కు ప్రభుత్వం మద్దతు తెలిపింది. - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌలు రైతులకు కూడా రైతు భరోసా అందించడం, అలాగే వ్యవసాయానికి తొమ్మిది గంటలపాటు ఉచిత విద్యుత్ అందించడం, ప్రభుత్వమే ఉచితంగా పంటల బీమా అందించడం, ఏ పంట ఇన్‌పుట్ సబ్సిడీని ఆ పంట కాలంలోనే చెల్లించడం మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారి నాయకత్వంలోనే జరుగుతోంది. అదే చంద్రబాబు నాయుడు హయాంలో రైతులపై కాల్పులు జరపడం, రైతు సంఘాల నేతలను అరెస్ట్ చేసి జైళ్ళల్లో పెట్టడం, ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని అడిగితే... అప్పట్లో డిమాండ్ చేసిన ప్రకాశం జిల్లాలో వైయస్సార్ సీపీ రైతు సంఘం నాయకుడితోసహా, వామపక్ష పార్టీల రైతు సంఘాల నేతలపై నాన్‌బెయిల్‌బుల్ వారెంట్ జారీ చేసి, అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కానీ వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల మీద, రైతు సంఘాల పట్ల గౌరవం, అభిమానం ఉంది కాబట్టే... ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాలు ఇచ్చిన బంద్‌కు సంఘీభావం తెలుపుతున్నాం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పాలన నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారి పాలన వరకూ ఎప్పుడూ మేం రైతు పక్షమే.. రైతు పక్షపాతి ప్రభుత్వమే. ఏ కార్యక్రమం అమలు చేసినా పార్టీని చూడం, మతం చూడం, కులం చూడని ప్రభుత్వం ఇది. ఇప్పుడు కూడా అదే భావనతో రేపటి బంద్‌కు సంఘీభావం తెలుపుతూ రాత్రి 12 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఆర్టీసీ బస్సులను నిలిపివేస్తున్నాం. టీడీపీ నేతలు ఈ ప్రభుత్వంలో రైతుకు జరిగే మంచిని మంచిగా చెప్పే ప్రయత్నం చేయకపోయినా ఫర్వాలేదుకానీ, మాపై ఎంతసేపటికీ బురదజల్లడం సమంజసం కాదు. ఏమైనా లోటుపాట్లు ఉంటే ప్రభుత్వం, ముఖ్యమంత్రిగారికి గానీ, లేకుంటే వ్యవసాయ శాఖకు గానీ, ఏపీ అగ్రికల్చర్ మిషన్ దృష్టికి తీసుకు వస్తే వాటిని పరిష్కరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాం. అయితే మేమేదో మిరాకిల్స్ జరిగిపోతున్నాయని చెప్పడం లేదు. వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే రూ. 51వేల 500 కోట్లు వ్యవసాయ, వ్యవసాయేతర అనుబంధ రంగాలకు సంబంధించిన రైతులకు నేరుగా ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఇది. కేంద్ర ప్రభుత్వం కూడా పట్టుదలకు వెళ్లకుండా రైతు సంఘాలతో చర్చించి, వారి న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాల్సిన బాధ్యత ఉంది. రైతు సమస్యల పరిష్కారంలో కేంద్రంతో మాట్లాడేందుకు మేము ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాం. మా పార్టీ ఎంపీలు కూడా పార్లమెంట్‌లో రైతు సమస్యలను లేవనెత్తే విషయంలో ఒకడుగు ముందే ఉన్నారు. రైతు సంఘాల నేతలు కూడా వాస్తవ విషయాలను వాస్తవంగా చెప్పండి. అంతేకానీ, రైతులపై కాల్పులు జరిపించినవాళ్లు, వ్యవసాయం గురించి ఎగతాళిగా మాట్లాడిన వ్యక్తులను వెనక పెట్టుకుని మాట్లాడటం భావ్యం కాదు. ధర్మబద్ధమైన డిమాండ్లను పరిష్కరించే విషయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారు ఎప్పుడూ ముందు ఉంటారు. అందులో భాగంగానే రేపటి బంద్‌కు మద్దతు తెలుపుతున్నాం. రైతుల సమస్యల విషయంలో రైతులకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక్క రోజులో అద్భుతాలు జరిగిపోతాయని ఎక్కడా చెప్పటం లేదు. చిన్న చిన్న లోపాలు ఉంటే సరిదిద్ధుకుంటాం. అంతేకాని చంద్రబాబు నాయుడులా సముద్రాన్ని, తుపాన్ ను కంట్రోల్ చేశామని మేము ఎవ్వరం చెప్పడం లేదు. సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే, వాటిని పరిష్కరించేందుకు ముందుంటాం. రైతుల కోసం పనిచేసే ప్రభుత్వంగా, రైతు ప్రభుత్వంగా రేపటి బంద్‌కు సంఘీభావం తెలుపుతున్నాం.