అధికారపార్టీ అడ్డదారులు 

బలం లేకున్నా దొడ్డిదారిన పదవులు దక్కించుకునేందుకు టీడీపీ కుట్రలు..

సంఖ్యాబలం లేకపోయినా స్థానిక సంస్థల్లో పదవుల కోసం దౌర్జన్యకాండ

వైయ‌స్ఆర్‌సీపీ సభ్యులను తమ వైపు తిప్పుకునేందుకు భారీఎత్తున ప్రలోభాలు

తమ దారికి రాకుంటే కిడ్నాప్‌లు.. బెదిరింపులు.. ఆస్తుల ధ్వంసం

విప్‌ లెటర్లు ఇచ్చేందుకు వెళ్లిన వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై టీడీపీ మూకదాడులు, కార్లు ధ్వంసం

ఎన్నికకు ఒక్కరోజు ముందే పలుచోట్ల భీతావాహ వాతావరణం

జిల్లా పరిషత్, మండల పరిషత్‌ ఉప ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నేతలు కుట్రలకు పదును పెట్టారు. సంఖ్యాబలం లేకపోయినా పదవుల్ని తమ ఖాతాలో వేసుకునేందుకు దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. కేసుల పేరిట బెదిరింపులకు పాల్పడుతున్నారు. మాట వినకపోతే కిడ్నాప్‌లకూ వెనుకాడటం లేదు. ‘మీరు ఎన్నిచోట్ల గెలిస్తే మాకేంటి. మాకు ఒక్క సభ్యుడు లేకపోయినా.. మీకు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు బలం ఎంత ఉన్నా మమ్మల్నేం చేయలేరు. ఈ ప్రభుత్వం మాది. మేం చెప్పిందే వేదం. మేం చేసేదే శాసనం. మా మాట వినకుంటే మీరెవరూ బతికి బట్టకట్టలేరు’ అంటూ రెచ్చిపోతున్నారు.  

అచ్చంపేటలో కిడ్నాప్‌
పల్నాడు జిల్లా అచ్చంపేట ఎంపీపీ పదవికి గురువా­రం ఎన్నిక జరనుండగా.. వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థిని, ఆమె భర్తను బుధవారం మధ్యాహ్నం కిడ్నాప్‌ చేశారు. నాలుగు కార్లలో వచ్చి టీడీపీ మూకలు వారిద్దరినీ ఎత్తుకెళ్లి అజ్ఞాతంలోకి తరలించారు. 2021 సెప్టెంబర్‌లో జరిగిన ఎన్నికలలో అచ్చంపేట మండల పరిషత్‌ పరిధిలోని మొత్తం 17 ఎంపీటీసీ స్థానాలకు గాను.. 16 స్థానాలను వైయ‌స్ఆర్‌సీపీ గెలుచుకుంది. 

ఆ పార్టీ తరఫున తాడు­వాయి, మాదిపాడు ఎంపీటీసీ స్థానాల్లో ఎస్టీ అభ్య­ర్థులు భూక్యా రజనీబాయి, భూక్యా స్వర్ణమ్మభాయి గెలుపొందారు. రిజర్వేషన్‌ ప్రకారం.. భూక్యా రజనీబాయిని ఎంపీపీగా సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వ్యక్తిగత కారణాల వల్ల రజనీబాయి ఆ పదవికి రాజీనామా చేశారు. కాగా.. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు నూతన ఎంపీపీని ఈ నెల 27వ తేదీన ఎన్నుకోవాల్సి ఉంది.

అయితే, టీడీపీకి ఎస్టీ అభ్యర్థే లేరు. దీంతో ఎంపీపీ పదవిని తమ ఖాతాలో వేసుకునేందుకు ఆ పార్టీ నేతలు కుట్ర పన్నారు. బుధవారం అర్ధరాత్రి పోలీసుల సాయంతో ఎంపీటీసీల ఇళ్లపై పడ్డారు. 15మంది ఎంపీటీసీల్లో 8 మందిని గంజాయి, అక్రమ మద్యం కేసుల్లో ఇరికించి నాన్‌బెయిలబుల్‌ కేసులు పెడతా­మని హెచ్చరించి రహస్య స్థావరానికి తరలించారు. 

మరోవైపు మాదిపాడు ఎంపీటీసీ భూక్యా స్వర్ణమ్మ­బాయిని టీడీపీ కండువా కప్పుకోవాలంటూ ఒత్తిడి తెచ్చారు. వినకపో­వడంతో బుధవారం ఉదయం 12గంటల సమయంలో టీడీపీ నాయ­కులు నాలుగు కార్లలో వచ్చి స్వర్ణమ్మబా­యిని, ఆమె భర్త రమేష్ నాయక్‌ను కిడ్నాప్‌ చేసి అజ్ఞాతంలోకి తరలించారు.  

టీడీపీ దాడులతో రచ్చరచ్చ
శ్రీసత్యసాయి జిల్లా రామగిరి ఎంపీపీ ఎన్నికకు సంబంధించి తమ అభ్యర్థికి సంబంధించి బీఫామ్‌ అందజేసేందుకు వెళ్లిన వైయ‌స్ఆర్‌సీపీ నేతల­పై బుధవారం టీడీపీ మూకలు దాడికి తెగబడ్డాయి. పార్టీ లీగల్‌ సెల్‌ నాయకులు బీఫామ్‌ అందజేసేందుకు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి చెందిన వాహనంలో రామగిరి ఎంపీడీవో కార్యాలయానికి చేరుకోగా టీడీపీ నాయకులు దాడి చేశారు.

వైయ‌స్ఆర్‌సీపీ నేతలను నిర్బంధించారు. మరో­వైపు రొద్దం, కదిరి నియోజకవర్గం గాండ్లపెంటలో వైయ‌స్ఆర్‌సీపీకి సంపూర్ణ మెజారిటీ ఉంది. ఆ రెండుచోట్లా ఎన్నిక జరగకుండా అడ్డుకునేందుకు కూటమి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. తగిన బలం లేకపో­యినా ఎమ్మెల్యే పరిటాల సునీత అధికార బలాన్ని ఉపయోగించి ఎంపీపీ పదవిని అడ్డదారిలో టీడీపీ ఖాతాలో వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

వైయ‌స్ఆర్‌ జెడ్‌పీలో ఎన్నిక అడ్డుకునేందుకు..
వైఎస్సార్‌ జిల్లా పరిషత్‌ పరిధిలో 50 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా.. 2021 ఎన్నికల్లో 49 స్థానాలను వైయ‌స్ఆర్‌సీపీ గెలిచింది. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఆకే­పాటి అమర్‌నాథ్‌రెడ్డి జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ప్రస్తు­తం అక్కడ జెడ్పీ చైర్మన్‌కు ఎన్నిక జరుగుతోంది. కొందరు జెడ్పీటీ­సీలు పార్టీ ఫిరాయించగా.. ఇప్పటికీ 42 మంది జెడ్పీటీసీలు వైయ‌స్ఆర్‌సీపీ వెంటే ఉన్నారు.

 చైర్మన్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ తర్వాత టీడీపీకి సభ్యుల బలం లేని కారణంగా పోటీ చేయడం లేదని ఆ జిల్లా టీడీపీ అధ్యక్షుడు ప్రకటించారు. అయితే, టీడీపీ తరఫున గెలిచిన ఒకే ఒక్క జెడ్పీటీసీతో  జెడ్పీ చైర్మన్‌ ఎన్నికను నిలుపుదలకు హైకోర్టును ఆశ్రయించారు.

ఒక్క సభ్యుడు లేకపోయినా..
నెల్లూరు జిల్లా విడవలూరు ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో టీడీపీ పెద్దఎత్తున ప్రలోభాలు మొదలుపెట్టింది. మండలంలో మొత్తం 14 ఎంపీటీసీలకు గాను వైయ‌స్ఆర్‌సీపీ 12 మంది, సీపీఎంకు ఇద్దరు సభ్యుల చొప్పున బలం ఉంది. టీడీపీకి ఒక్క సభ్యుడు కూడా లేకపోయినా ఎంపీపీ పదవిని దక్కించుకునేందుకు అరాచకాలకు తెరతీసింది. 8 మంది ఎంపీటీసీలను తమ వైపు తిప్పుకునేందుకు టీడీపీ నేతలు చివరి నిమిషం వరకూ ప్రలోభాలకు గురి చేస్తూనే ఉన్నారు. 
» పల్నాడు జిల్లా అచ్చంపేటలో టీడీపీకి ఎస్టీ అభ్యర్థి లేకపోవడంతో ఎంపీటీసీ, ఆమె భర్త కిడ్నాప్‌ 
»     సత్యసాయి జిల్లా రామగిరిలో బీఫామ్‌ ఇచ్చేందుకు వెళ్లిన వైయ‌స్ఆర్‌సీపీ నేతల­పై టీడీపీ మూకల దాడి 
»    తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు ఎంపీటీసీలకు రూ.3 లక్షల చొప్పున ఎర 
»     ముగ్గురు ఎంపీటీసీలున్న కాకినాడ రూరల్‌ ఎంపీపీ పదవి కోసం జనసేన బరితెగింపు 
»     తిరుపతి రూరల్‌ ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో అక్రమాల నివారణకు న్యాయస్థానం తలుపుతట్టిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి 
»    ఒకే సభ్యుడు ఉండటంతో వైయ‌స్ఆర్‌ జిల్లాలో జెడ్పీ చైర్మన్‌ ఎన్నికను అడ్డుకునేందుకు హైకోర్టులో పిటిషన్‌ 

‘తూర్పు’లో ప్రలోభాలు
తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు ఎంపీపీ స్థానంలో గెలిచేందుకు తగిన బలం లేని కూటమి పార్టీల నేతలు వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీటీసీల్లో కొందరికి రూ.3 లక్షల చొప్పున ఆశచూపారు. నలుగురు వైయ‌స్ఆర్‌సీపీ సభ్యులను ఎన్నిక వేళ హాజరుకాకుండా ఉండాలని అధికార పార్టీ శ్రేణలు బెదింపులకు దిగుతున్నారు. 

కాకినాడ రూరల్‌ మండల పరిషత్‌లో జనసేన పార్టీ వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీటీసీలను ప్రలోభాలకు గురి చేస్తోంది. మండలంలో 18 మంది ఎంపీటీసీలు ఉండగా.. వైయ‌స్ఆర్‌సీపీకి 15 మంది, జనసేనకు ముగ్గురు చొప్పున ఉన్నారు. ఎంపీపీ ఎన్నిక దృష్ట్యా ఏడు­గురు ఎంపీటీసీకు రూ.5 లక్షల చొప్పున ఇచ్చేలా ప్రలోభపెట్టి ఆ పార్టీలో చేర్చుకున్నారని వైయ‌స్ఆర్‌సీపీ నాయ­కులు ఆరోపిస్తున్నారు.  

నేడు రెండు జెడ్పీ,  60 మండల పరిషత్‌లలో ఎన్నికలు
ఖాళీగా ఉన్న వైయ‌స్ఆర్  జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవికి గురువారం ఎన్నిక జరగనుంది. కర్నూలు జెడ్పీ కో–ఆప్టెడ్‌ సభ్యుని ఎన్నికతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 60 మండలాల్లో 28 ఎంపీపీ పదవులు, 23 మండల ఉపాధ్యక్ష, 12 మండల కో–ఆప్టెడ్‌ సభ్యుల పదవులకు సైతం గురువారం ఎన్నికలు జరగనున్నాయి.

ఇందుకు సంబంధించి ఈ నెల 18న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. వీటితో పాటు 200 గ్రామ పంచాయతీల్లోనూ ఉప సర్పంచ్‌ స్థానాలకు గురువారమే ఎన్నికలు జరగనున్నాయి.   

ఫిర్యాదు చేస్తే చించేశారు
చిత్తూరు జిల్లాలో రామకుప్పం మండల పరిషత్‌ అధ్యక్షురాలు శాంతకుమారి మరణంతో ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ 16 ఎంపీటీసీ స్థానాలు ఉండగా అన్నిచోట్లా వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులే గెలుపొందారు. ఈ స్థానాన్ని కైవసం చేసు­కునేందుకు టీడీపీ కుట్రలకు తెర­లేపింది. ఉప ఎన్నిక సజావుగా నిర్వహించాలని, వైయ‌స్ఆర్‌సీపీఎంపీటీసీలకు రక్షణ కల్పించాలని నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయ­కర్త భరత్‌కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ ఫిర్యాదు కాపీని టీడీపీ నేతలు పోలీసుల నుంచి లాక్కుని చించివేశారు.

శ్రీసత్యసాయి జిల్లా గాండ్లపెంట మండలంలో 7 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, 6 స్థానాలను వైయ‌స్ఆర్‌సీపీ కైవసం చేసు­కుంది. ఎంపీపీ జగన్‌మోహన్‌ ఆ పదవికి రాజీనామా చేయడంతో ఎన్నిక అనివా­ర్యౖ­మెంది. బలం లేకపోయినా ఎంపీపీ కుర్చీని ఎలాగైనా కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో టీడీపీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీటీసీలపై ఒత్తిడి తెస్తున్నారు.

ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో ఎంపీపీ పోటీలో ఉన్న వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీటీసీ సభ్యునిపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్‌ చేయించారు. మరో ఎంపీటీసీ సభ్యునిపైనా కేసు నమోదు చేయించారు. 

పుల్లలచెరువు మండల పరిషత్‌ ఉపాధ్యక్ష పదవి సైతం ఎన్నిక జరుగుతుండగా.. ఇక్కడ మొత్తం 15 ఎంపీటీసీ స్థానాలుకు గాను 11 స్థానాలు వైయ‌స్ఆర్‌సీపీ, 4 స్థానాలు టీడీపీ పక్షాన ఉన్నాయి. వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీటీసీలకు టీడీపీ ప్రలోభాలు పెట్టేందుకు చివరి నిమిషం వరకు తీవ్రంగా యత్నిస్తోంది.

తిరుపతిలో వైయ‌స్ఆర్‌సీపీ ముందుజాగ్రత్త
తిరుపతి ఎంపీపీ పదవికి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి రాజీనామా చేయటంతో గురువారం ఉప ఎన్నిక జరుగుతోంది. మండలంలో 40 ఎంపీటీసీ స్థానాలుండగా.. 38చోట్ల వైయ‌స్ఆర్‌సీపీఅభ్యర్థులే గెలుపొందారు. ఒకస్థానం టీడీపీ టీడీపీ దక్కించుకుంది. ప్రస్తుతం 32 మంది ఎంపీటీసీలు వైయ‌స్ఆర్‌సీపీ వెంటే ఉండగా.. ప్రలోభాల లొంగిన ఐదుగురు ఎంపీటీసీలు టీడీపీకి మద్దతు ప్రకటించారు. 

ఈ నేపథ్యంలో తిరుపతి డిప్యూటీ మేయర్‌ ఉప ఎన్నిక సందర్భంగా కూటమి నేతల అరాచకాలను దృష్టిలో ఉంచుకుని ఎంపీపీ ఎన్నికను సజావుగా నిర్వహించేలా ఆదేశాలివ్వాలంటూ చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

Back to Top