తాడేపల్లి: వక్ఫ్ సవరణ బిల్లుపై టీడీపీ డబుల్ గేమ్ ఆడుతుందని వైయస్ఆర్‌సీపీ పీఏసీ మెంబర్ షేక్ ఆసిఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ముస్లిం హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. ముస్లింల సంక్షేమాన్ని, అభివృద్దిని నిర్లక్ష్యం చేస్తూ.. పైకి మాత్రం ముస్లింలను రక్షించేవాడిలా నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. శుక్రవారం తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో షేక్ ఆసిఫ్ మీడియాతో మాట్లాడారు. ముస్లిం సమాజం మొత్తం వ్యతిరేకిస్తున్న వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో చంద్రబాబు రాష్ట్రంలో ఒకలా, ఢిల్లీలో మరో రకంగా మాట్లాడుతున్నాడు. ఈ బిల్లు విషయంలో చంద్రబాబు రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారు. టీడీపీ మద్ధతు మీదనే కేంద్రం ఆధారపడి ఉంది. ఆ బిల్లును ఆదిలోనే టీడీపీ వ్యతిరేకించి ఉంటే ఇప్పుడు జేపీసీ వరకు వచ్చి ఉండేది కాదు. ఒకపక్క బిల్లుకి మద్దతు ప్రకటిస్తూనే నిన్న ఇఫ్తార్ విందులో వక్ఫ్ ఆస్తులను పరిరక్షిస్తున్నామని అబద్ధాలు చెబుతున్నారు. వక్ఫ్ సవరణ బిల్లు గనుకు పార్లమెంట్‌లో పాసైతే ముస్లిం సమాజం తీవ్రంగా నష్టపోతుంది. వక్ఫ్ సవరణ బిల్లును వైయస్ఆర్‌సీపీ వ్యతిరేకిస్తోందని ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ బిల్లుపై ఏర్పడిన జాయింట్ పార్లమెంట్ కమిటీ(జేపీసీ) క్షేత్రస్థాయి పర్యటన నిమిత్తం హైదరాబాద్ వచ్చినప్పుడు పార్టీ వ్యతిరేకతను వినిపించడంతో పాటు రాతపూర్వకంగా కూడా తెలియజేయడం జరిగింది. పార్లమెంట్‌లో బిల్లును వ్యతిరేకించాలని ఎంపీలకు పార్టీ అధినేత వైయస్ జగన్ పలుమార్లు దిశానిర్దేశం చేశారు. వక్ఫ్ భూములకు సంబంధించి ఇప్పటికే వక్ఫ్ ట్రిబ్యునల్ ఉన్నా కేంద్రం దాన్ని బలహీన పరిచే ప్రయత్నం చేస్తోంది. వక్ఫ్ భూములపై కలెక్టర్లకే అథారిటీ ఇవ్వాలని వైయస్ఆర్‌సీపీ డిమాండ్ చేస్తోంది. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ముస్లింల విద్యార్థులకు రిజర్వేషన్లు కల్పించమే కాకుండా వారి పిల్లలకు పూర్తి రీయింబర్స్‌మెంట్ ఇవ్వడం జరిగింది. 58 నెలల కాలంలో ముస్లిం మైనారిటీలకు వివిధ పథకాల రూపంలో నేరుగా బటన్ నొక్కి రూ. 13,613 కోట్లు వారి ఖాతాల్లో జమ చేసిన ఘనత వైయస్ జగన్ కే దక్కుతుంది. ఇళ్ల స్థలాలు, విద్యా కానుక, సంపూర్ణ పోషణ వంటి నాన్ డీబీటీ పథకాల ద్వారా మరో రూ. 10,800 కోట్లు అందించడం జరిగింది. మొత్తం వైయస్సార్సీపీ ప్రభుత్వంలో రూ. 24 వేల కోట్లకు పైగా మైనారిటీల సంక్షేమం కోసం ఖర్చు చేసి అండగా నిలిచిన ఘనత మా నాయకులు వైయస్ జగన్‌కే దక్కుతుంది. షాదీ తోఫా పథకం అమలు చేసి ముస్లిం విద్యార్థులు బాగా చదవాలని ఆశిస్తూ పదో తరగతి నిబంధన కూడా విధించాం. ఆ విధంగా పిల్లలను చదువులపైపు ప్రోత్సహించిన ప్రభుత్వం మాది. అంతేకాకుండా ఉర్దూను రెండో భాషగా గుర్తిస్తూ మేలు చేశాం. ఆంధ్రప్రదేశ్ మైనారిటీ కాంపోనెంట్ చట్టం (సబ్ ప్లాన్) తీసుకొచ్చాం. గతంలో హజ్ యాత్రకు హైదరాబాద్ నుంచి వెళ్లే పరిస్థితి నుంచి విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచే వెళ్లేలా ఎంబార్కేషన్ సెంటర్ తీసుకొచ్చాం. ఆ మేరకు విజయవాడ నుంచి వెళ్లే హాజీలకు అదనంగా విమాన ఖర్చుల కోసం ఒక్కొక్కరికి రూ. 80వేల చొప్పున అందించడం జరిగింది. హాజీలకు రాయితీ కల్పించడం కోసం రూ. 14 కోట్లు ఖర్చు చేసిన ఘనత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వానిదేనని గర్వంగా చెబుతున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాయితీలు భరించాలనే అక్కసుతో కేంద్రానికి లేఖ రాసి ఏకంగా ఎంబార్కేషన్ పాయింట్‌నే రద్దు చేయించారు. గడిచిన పది నెలల పాలన చూసిన తర్వాత, ముస్లింల పట్ల చంద్రబాబు వైఖరి చూసి ఈసడించుకుంటున్నారు. ముస్లిం ప్రయోజనాలను ఢిల్లీ తాకట్టుపెట్టి, ద్వంద్వ విధానాలతో పనిచేస్తున్న చంద్రబాబుని మైనారిటీలు ఎప్పటికీ నమ్మే పరిస్థితి ఉండదు.