వైయస్ఆర్ జిల్లా: మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి పాత్ర లేదని, ఉందని కోర్టు తీర్పిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతా అంటూ వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైయస్ఆర్ జిల్లా కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో గురువారం రాచమల్లు శివప్రసాదరెడ్డి మీడియాతో మాట్లాడారు. అవినాశ్‌ను ఆరేళ్లుగా వేధిస్తున్నారు వివేకానందరెడ్డి హత్య జరిగి ఆరేళ్లయినా టీవీ సీరియల్ మాదిరిగా టీడీపీ ఇంకా మాట్లాడుతూనే ఉంది. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని తప్పుడు కథనాలు అచ్చేస్తూనే ఉన్నారు. ఒకపక్క కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్నా అవినాశ్ డైరెక్షన్..పీఏ కృష్ణారెడ్డి యాక్షన్ అని రాస్తున్నారంటే ఎల్లో మీడియా కుట్రలకు అంతే లేదనిపిస్తుంది. ఎంతసేపటికీ ఈ హత్య కేసులో వైయస్ జగన్‌ను ఇరికించాలని తాపత్రయం తప్పించి, అధికారంలో ఉండి ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయాలన్న చిత్తశుద్ధి చంద్రబాబులో కనిపించడం లేదు. - చనిపోయిన వ్యక్తి మా కుటుంబ సభ్యుడే అయినా వైయస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసే కుట్రల్లో భాగంగా పదే పదే ఎంపీ అవినాశ్ రెడ్డి మీద తప్పుడు ఆరోపణలు చేసి తద్వారా వైయస్ జగన్‌ని, వైయస్ఆర్‌సీపీని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని విశ్వపత్రయత్నాలు చేస్తున్నారు. వివేకా రక్తాన్ని తెచ్చి వైయస్ జగన్ చొక్కాకు పులమాలని ఈ ఆరేళ్లుగా చేయని కుట్రలు లేవు. - ఏబీయన్, ఆంధ్రజ్యోతి, ఈనాడు, మహాన్యూస్ వంటి ఛానెళ్లు, పేపర్లు కలిసి కొన్ని కోట్ల మంది దగ్గర వారి కుటుంబ గౌరవాన్ని పలచన చేశారు. తనకేపాపం తెలియకపోయినా టీడీపీ చేస్తున్న కుట్రల కారణంగా ఈ ఆరేళ్లుగా అవినాశ్ రెడ్డి తీవ్రమైన నరకం అనుభవిస్తున్నాడు. - తమ అబద్ధాన్ని, ప్రచారాన్ని నిజం చేయడానికి సీబీఐ సహా అన్ని వ్యవస్థలను కలుషితం చేశారు. మీడియాతో నిత్యం అబద్ధాలు మాట్లాడిస్తున్నారు. పోలీసులు కూడా ప్రభుత్వం ఏది చెబితే దానికి డూడూ బసవన్న అన్నట్టు తల ఊపుతున్నారు. నిందితుల ఫిర్యాదు చేస్తే కేసా? - సెన్సార్ సర్టిఫికెట్ తెచ్చుకుని రిలీజైన హత్య సినిమాలో ఒక సన్నివేశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే నేరమని కేసు వైయస్ఆర్‌సీపీ కార్యకర్త పవన్ కుమార్ రెడ్డి విచారణ పేరుతో స్టేషన్‌కి పిలిపించి కొట్టారు. ఈ సినిమా ద్వారా వివేకా హత్యతో అవినాశ్‌కి సంబంధం లేదని ప్రజలకు నిజం తెలిసిపోతుందని చంద్రబాబు భయం. ఇదేనా ప్రజాస్వామ్యం ప్రభుత్వం. - తనను పోలీసులు కొట్టడంపై పవన్ కుమార్‌రెడ్డి మా అధినేత వైయస్ జగన్‌ను కలిసి బాధను వెళ్లబోసుకుంటే ఆంధ్రజ్యోతిలో పవన్‌తో వైయస్ జగన్ గూడుపుఠాని అంటూ దిగజారి తప్పుడు వార్త అచ్చేశారు. - వివేకాను తామే దారుణంగా నరికి చంపామని నేరాన్ని అంగీకరించిన దస్తగిరి, సునీల్ కుమార్ అనే వ్యక్తులు ఫిర్యాదు చేస్తే పవన్ కుమార్ మీద పోలీసులు కేసు నమోదు చేశారంటే నిందితులకు ఈ ప్రభుత్వం అండగా ఉందని చెప్పడానికి ఇంతకన్నా సాక్ష్యం అవసరం లేదు. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న సునీల్ కుమార్ మనోభావాలు దెబ్బతిన్నాయని చెబితే పోలీసులు పవన్ కుమార్‌ను కొట్టడం కన్నా దారుణమైన అంశం ఇంకోటి ఉండదు. దస్తగిరి, సునీల్ కుమార్‌లకు రూ. కోట్లు ఎలా వచ్చాయి? - వివేకా హత్యకు ముందు దస్తగిరి, సునీల్ కుమార్‌లు రూ. 500, వెయ్యి కోసం చేయి చాపేవారు. అలాంటిది ఇప్పుడు కోట్లకు పడగలెత్తి జల్సాలు చేస్తున్నారంటే వారికి ఆ డబ్బులు ఎలా వచ్చాయి? తాము చెప్పిందల్లా చేసినందుకు, చెప్పిన మాటల్ని మీడియాలో మాట్లాడినందుకు సునీతరెడ్డి, నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబులే వారికి డబ్బులిచ్చి పోషిస్తున్నారు. ఒకప్పుడు చేతిలో రూ. వెయ్యి కూడా లేని వారి తరఫున దేశంలోనే ఖరీదైన లాయర్ సిద్ధార్థ లూథ్రా కేసు వాదిస్తున్నారంటే వెనుకనున్న మర్మం అర్థంకావడం లేదా? ముఖ్యమంత్రి చంద్రబాబుకి పర్సనల్ లాయర్‌గా మారిపోయిన సిద్ధార్థ లూథ్రా వీరి తరఫున కేసు వాదించే స్థాయి ఎలా వచ్చింది? - సునీతరెడ్డి, చంద్రబాబు నాయుడు నిందితుల పక్షాన నిలబడి ప్రోత్సహిస్తున్నారు. ఈ రాష్ట్రంలో సమస్యలేవీ లేనట్టు వివేకా కేసును పట్టుకుని వేలాడుతున్నారు. ప్రభుత్వం ఇరుకున పడినప్పుడల్లా డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కోసం వివేకా హత్యను వాడుకుంటున్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించకపోతే అంతిమంగా నష్టపోయేది కూడా ప్రజలే. - కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 10 నెలల్లో వందల మంది మహిళలపై అత్యాచారాలు జరిగితే వాటిమీద కనీసం పట్టించుకునే సమయం ఈ ప్రభుత్వానికి ఉండటం లేదు. రైతుల సమస్యలను పట్టించుకోరు. ఇచ్చిన హామీలను అమలు చేయరు. విద్యార్థులకు ఫీజులు చెల్లించడం లేదు. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకుండా రోగులను వేధిస్తున్నారు. ప్రభుత్వానికి ఏ కష్టమొచ్చిన వైయస్ జగన్ పేరు తీయడం, వివేకా హత్య చేసిన రక్తాన్ని ఆయన చొక్కాకి పులమడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. రెండో వివాహం కోణంలో విచారణ జరగడం లేదు - వైయస్ జగన్ పేరు వింటేనే కూటమి నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి, చంద్రబాబు వెన్నులో వణుకు పుడుతోంది. సీబీఐ అధికారి రాంసింగ్ తనను కొట్టి తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలని వేధించాడని పలుమార్లు వివేకా పీఏ కృష్టారెడ్డి చెప్పినా.. దాన్ని పరిగణలోకి తీసుకోరు. వివేకా రెండో వివాహం కోణంలో పోలీసులు విచారణ చేయడం లేదు. ముస్లిం యువతికి పుట్టిన బిడ్డ వివేకా కొడుకా కాదా అని డీఎన్ఏ టెస్టు ఎందుకు చేయలేదు? బెంగళూరులో రియల్ ఎస్టేట్ లావాదేవీలకు సంబంధించిన కోణంలో కూడా విచారణ చేయడం లేదు. ఎంతసేపటికీ అవినాశ్ చుట్టూ ఉచ్చుపన్నాలని ధ్యేయం తప్ప ఇంకోటి లేదు. వైయస్ జగన్‌ను ఎవరైనా అభిమానిస్తే వారిని ఏదో విధంగా వేధించడమే చంద్రబాబు లక్ష్యం. - టీడీపీకి వివేకానందరెడ్డి మీద ప్రేమ ఉందంటే నేను నమ్మను. చంద్రబాబుకి ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉందంటే అదీ లేదు. దానికి ఎన్టీఆర్‌కి వెన్నుపోటు, ఆ తదనంతరం జరిగిన పరిణామాలే ఉదాహరణలు. - ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలన్న ఆలోచన కూటమి ప్రభుత్వానికి అస్సలు లేదు. అహింసను ప్రోత్సహిస్తుందంటే దానికీ గతంలో జరిగిన మల్లెల బాబ్జి, పింగళి దశరథ్‌రామ్, వంగవీటి మోహనరంగ హత్యలు, ఎన్టీఆర్ మరణ ఉదంతం, వైయస్ఆర్ మరణం వెనుకున్న అనుమానాలు.. ఇలా చాలా సంఘటనలు కాదని నిరూపిస్తున్నాయి. చంద్రబాబు ఆడించే నాటకం - వివేకా హత్య కేసును అడ్డం పెట్టుకుని తెరవెనుక ఉండి చంద్రబాబు ఆడించే ఆటలో సునీత పావుగా మారిపోయారు. ఆమె ద్వారా దస్తగిరి, సునీల్ కుమార్ కూడా చంద్రబాబు చెప్పిందల్లా చేస్తున్నారు. - వివేకాను అత్యంత దారుణంగా నాలుగు గంటలపాటు నరికి నరికి చంపిన వ్యక్తులతో చంద్రబాబు అప్రూవర్‌గా మార్చి సెటిల్మెంట్లు చేయిస్తున్నారు. చంద్రబాబు ఆడే రాజకీయ క్రీడలో పావుగా మారి తండ్రిని చంపిన వ్యక్తులతో సునీతరెడ్డి చేతులు కలిపారు. - అవినాశ్‌రెడ్డికి వివేకా హత్యతో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ కేసుతో సంబంధం ఉందని కోర్టు తీర్పిస్తే నాతో సహా కడప జిల్లాకు చెందిన వైయస్ఆర్‌సీపీ నాయకులు పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజకీయాలకు శాశ్వత విరామం తీసుకుంటాం.