అస‌మ‌ర్ధ మంత్రి లోకేష్‌ను భర్తరఫ్‌ చేయాలి 

వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రవిచంద్ర డిమాండ్‌

పది పరీక్షల్లో మాస్ కాపీయింగ్, పేప‌ర్ లీకేజీలను నిర‌సిస్తూ విద్యా భ‌వ‌న్ ఎదుట ధ‌ర్నా

మంగ‌ళ‌గిరి:  విద్యార్ధుల జీవితాల‌తో చెలగాట‌మాడుతున్న అస‌మ‌ర్ధ మంత్రి నారా లోకేష్‌ను భ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రవిచంద్ర డిమాండ్ చేశారు. పదో తరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్, పేప‌ర్ లీకేజీలను అరికట్టి అక్రమాలకు పాల్పడుతున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వ‌ర్యంలో గురువారం ధర్నా నిర్వ‌హించారు. అనంతరం విద్యా శాఖ డైరెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైయస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రవిచంద్ర మాట్లాడుతూ.. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షా ప్రశ్న ప‌త్రాలు లీకేజీ అవుతున్నాయన్నారు.  యధేచ్ఛగా  మాల్ ప్రాక్టీసింగ్, మాస్ కాపీయింగ్, లీకేజీ ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం కనీసం నియంత్రించడం లేదన్నారు. పరీక్ష ప్రారంభమైన వెంటనే మొబైల్ వాట్సాప్ ల్లో ప్ర‌శ్నాప‌త్రాలు బయటకి వస్తుంటే కనీస పర్యవేక్షణ లేదన్నారు. మార్చి 21న శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో మాల్ ప్రాక్టీస్ జరిగింది.

మార్చి 24న వైయ‌స్ఆర్‌ కడప జిల్లాలో గణిత ప్రశ్నాపత్రం లీక్ అయింద‌ని తెలిపారు. వైయ‌స్ఆర్‌ జిల్లాలో లీకేజీ ఘటనపై 9 మందిని అరెస్ట్ చేశార‌ని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదో తరగతి పరీక్షలు గందరగోళంగా మారిపోయాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. పదో తరగతి పరీక్షల్ని కూడా సరిగ్గా నిర్వహించలేని దుస్థితి లో కూటమి ప్రభుత్వం ఉన్నదని విమర్శించారు. ప్రశ్నా ప‌త్రాల‌ లీకేజీ కి నైతిక బాద్యత వహించి నారా లోకేష్ విద్యా శాఖా మంత్రిగా తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పది నెలల కూటమి ప్రభుత్వ పాలనలో పరీక్షల నిర్వహణలో వైఫల్యం చెందిందని దుయ్యబట్టారు. చంద్రబాబు చరిత్ర అంతా ప్రశ్నా ప‌త్రాల‌ లీకేజీ అని ఎద్దేవా చేశారు.  

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6 లక్షల మందికి పైగా పదో తరగతి పరీక్షలు రాస్తున్నార‌ని, విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఫైర్ అయ్యారు. కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో మాస్ కాపీయింగ్, లీకేజీ, మాల్ ప్రాక్టీస్ జరుగుతున్నాయ‌ని ఆరోపించారు.  మిగతా పరీక్షల్ని ప‌క‌డ్బందీగా నిర్వహించాలని ఆయ‌న కోరారు. అక్రమాలకు పాల్పడుతున్న కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాల‌ని,  క్రిమినల్ కేసులు నమోదు చేసి వాటి గుర్తింపును రద్దు చేయాలని ర‌విచంద్ర డిమాండ్ చేశారు. కార్య‌క్ర‌మంలో విద్యార్థి నేతలు కే. శివారెడ్డి, ఐ. శ్రీనివాస్, ఎం.గోపీచంద్,  కొండల్ రావు, సురేష్, ప్రతాప్, పూజిత్, ప్రతాప్, నాగరాజు, రాము, సురేంద్ర, మహేష్ తదితరులు పాల్గొన్నారు. 

Back to Top