తాడేపల్లి: రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు, కొందరు పోలీసులు కలిసిపోయి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే చూస్తూ ఊరుకోమంటారా అని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్య్‌క్షుడు అంబటి రాంబాబు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కాపాడాల్సిన వారే ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తుంటే మౌనంగా ఉండమంటారా? వ్యవస్థల వైఫల్యం కళ్ళముందే కనిపిస్తోంటే ప్రజాస్వామ్య మనుగడనే ప్రశ్నిస్తుంటే ఒక ప్రజా నాయకుడుగా జగన్ తలదించుకుని వెళ్ళిపోవాలని అంటారా? అని కూటమి సర్కార్‌ను నిలదీశారు. ఇలాంటి పరిణామాల వల్లే రామగిరిలో లింగమయ్య హత్య జరిగిందని, ఇటువంటి దాష్టీకాలు చేయిస్తున్న ప్రభుత్వ పెద్దలకు కొమ్ము కాస్తున్న అధికారులపై వైయస్ జగన్ పోరాటం ముమ్మాటికీ సరైనదేనని స్పష్టం చేశారు. ప్రజల పక్షాన ఆయన ప్రశ్నించడంతో కూటమి సర్కార్ ఉలిక్కిపడుతోందని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే... మాజీ సీఎం వైయస్ జగన్‌కు కూటమి ప్రభుత్వం కల్పిస్తున్న భద్రత విషయంలో భారీ కుట్ర జరుగుతోంది. జెడ్‌ప్లస్ కేటగిరి ఉన్న వైయస్ జగన్ భద్రతను కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నీరుగారుస్తోంది. ఆయనకు ఏదైనా జరిగితే సంతోషిద్దామనే దోరణితో చంద్రబాబు, లోకేష్ ఉన్నారు. రాష్ట్రంలో వారి డైరెక్షన్‌లోనే పోలీసులు చట్టాలను అధిగమించి పనిచేస్తున్నారు. గీత దాటిన పోలీసులను భవిష్యత్తులో న్యాయస్థానాల ముందు నిలబెట్టి, వారి ఖాకీడ్రస్ విప్పించడం ఖాయం. శ్రీసత్యసాయి జిల్లా రామగిరి ఎంపీపీ స్థానంకు గతనెల 27వ తేదీన జరగాల్సి ఉప ఎన్నిక సందర్బంగా అధికార తెలుగుదేశం పార్టీ అరాచకం సృష్టించింది. తమకు మెజార్టీ లేకపోయినా పోలీసులను ఉపయోగించుకుని అడ్డదోవలో ఎంపీపీ పదవిని దక్కించుకునేందుకు ప్రయత్నించింది. టీడీపీ నేతలతో కలిసి పోలీసులే వైయస్ఆర్‌సీపీ ఎంపీటీసీలను బలవంతంగా టీడీపీ వైపు తిప్పుకునేందుకు తెగబడ్డారు. దీనిని వైయస్ఆర్‌సీపీ సమర్థంగా ఎదుర్కొంది. దీనిని భరించలేని తెలుగుదేశం గుండాలు గతనెల 30వ తేదీన రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి చెందిన వైయస్సార్సీపీ బీసీ నేత లింగమయ్యను దారుణంగా హతమార్చారు. ఇది జరగడానికి పూర్తిగా పోలీసులు తెలుగుదేశంపార్టీకి కొమ్ముకాస్తూ, వారి దౌర్జన్యాన్ని ప్రోత్సహించడమే కారణం. అలాగే పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి ఎంపీపీ ఉప ఎన్నికల్లో కూడా తెలుగుదేశం తమకు మెజార్టీ లేకపోయినా కూడా ఏదో ఒక విధంగా గెలవాలని వైయస్ఆర్‌సీపీ ఎంపీటీసీలను బలవంతంగా తీసుకువెళ్ళేందుకు ప్రయత్నించింది. పోలీసులు ఈ విషయంలోనూ చట్ట ప్రకారం వ్యవహరించకుండా టీడీపీకి అండగా నిలుస్తూ, వైయస్ఆర్‌సీపీ ఎంపీటీసీలను భయబ్రాంతులకు గురి చేశారు. ఇటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. టీడీపీ ముందు మోకరిల్లిన పోలీస్ వ్యవస్థ శాంతిభద్రతను కాపాడాల్సిన పోలీస్ వ్యవస్థ అధికారపార్టీ ముందు మొకరిల్లింది. చివరికి రామగిరి మండలంలో వైయస్ఆర్‌సీపీ నేత లింగమయ్యను హత్య చేసే స్థాయిలో టీడీపీ గుండాలు తెగబడటానికి కారణం పోలీసులు ఆ పార్టీకి విధేయులుగా, శాంతిభద్రతలను పట్టించుకోకుండా గాలికి వదిలేయడమే. ఈ క్రమంలో జరిగిన లింగమయ్య హత్య తరువాత ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు రామగిరికి వెళ్ళిన వైయస్ జగన్ పర్యటనకు కూడా పోలీసులు అనేక ఆటంకాలు కలిగించారు. కనీసం ఒక జెడ్‌ప్లస్ కేటగిరి ఉన్న మాజీ సీఎంకు కల్పించాల్సిన భద్రతను కూడా ఏర్పాటు చేయలేదు. హెలిప్యాడ్ వద్ద పదకొండు వందల మంది పోలీసులు ఉన్నారని చెబుతున్న ప్రభుత్వం వేలాధి మంది హెలికాఫ్టర్ చుట్టూ ఎలా రాగలిగారో చెప్పాలి. చివరికి హెలికాఫ్టర్ విండ్‌షీల్డ్ దెబ్బతినే పరిస్థితి ఏర్పడినా పోలీసులు అక్కడ కనిపించలేదు. ఈ రకంగా తమ పోస్టింగ్‌ల కోసం, తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలే ముఖ్యంగా పనిచేస్తున్న పోలీస్ వ్యవస్థను గురించి వైయస్ జగన్ గారు మాట్లాడారు. చంద్రబాబు కన్నా పెద్ద మోసగాడు ఉన్నారా? వైయస్ జగన్ గారు మాట్లాడిన దానిపై టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులు మాట్లాడుతూ 'వైయస్ జగన్ రౌడీ' అంటూ వ్యాఖ్యానించారు. రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్ మాట్లాడుతూ 'వైయస్ జగన్ సైకో' అంటూ దూషించారు. మరో మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ 'వైయస్ జగన్ జీవితంలో నిజం ఎప్పుడూ చెప్పరు' అంటూ మాట్లాడారు. ఈ దేశంలో చంద్రబాబు కంటే పెద్ద మోసగాడు ఎవరైనా ఉన్నారా? రాష్ట్రంలో ఇంత దారుణమైన పరిస్థితి ఉంది. రౌడీయిజం, దాడులు, హత్యలతో అరాచకం సృష్టిస్తున్నారు. పల్నాడులో గ్రామాలకు గ్రామాలే రక్షణ లేక ఇళ్ళు వదిలి వెళ్లిపోయారు. నేటికీ వారు తిరిగి రాలేదు. దీనికి పోలీస్ వ్యవస్థ బాధ్యులు కాదా? పోలీస్ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుని రౌడీయిజం చేస్తున్నది చంద్రబాబు కాదా? దీనిపై వైయస్ జగన్ స్పందించారు. తప్పు చేసిన ప్రతి వ్యక్తిని చట్ట పరంగా శిక్షిస్తామని అన్నారు. అది తప్పా? ఇక హోంమంత్రి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. ఎస్‌ఐని కూడా బదిలీ చేసే పవర్ కూడా ఆమెకు లేదు. పోస్టింగ్‌ల కోసం భవిష్యత్తు పాడుచేసుకోవద్దు ప్రభుత్వాన్ని తన కనుసన్నల్లో నడుపుతున్న నారా లోకేష్ గుర్తుంచుకోవాలి. రోజులు ఎప్పటికీ ఒకేలా ఉండవు, రోజులు మారతాయి. పోలీస్ రాజ్యంతో ఇష్టం వచ్చినట్లు చేయాలని అనుకుంటే పొరపాటే. రాబోయే రోజుల్లో మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలి. ఈ ప్రభుత్వంలో చట్టప్రకారం నడిచే పోలీసులకు పోస్టింగ్‌లు ఉండవు. అధికారపార్టీ చెప్పినట్లు అడ్డగోలు కేసులు పెట్టేవారికి, ప్రతిపక్షంను బెదిరించేవారికే పోస్టింగ్‌లు ఉంటాయి. కనీసం పోలీసులు కేసులు నమోదు చేసేందుకు కూడా ముందుకు రావడం లేదు. వ్యక్తిగతంగా నేను పెట్టిన అయిదు ఫిర్యాదులపై కోర్ట్‌కు వెడితే తప్ప పోలీసులు కేసులు రిజిస్టర్ చేయలేదు. ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నించినందుకు నాపైన కూడా కేసు పెట్టారు. పోలీసులు లోకేష్ చెప్పినట్లు చేస్తున్నారే తప్ప, చట్టం చెప్పినట్లు చేయడం లేదు. డీపీజీకి కలిసేందుకు అనుమతి తీసుకుని ఆయన కార్యాలయంకు వెడితే, కనీసం కలిసేందుకు కూడా ఇష్టపడలేదు. మాకు అధికారం వచ్చిన రోజున చట్టాన్ని అధిగమించి వ్యవహరించే పోలీసులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. బట్టలు ఊడదీసి నిలబడతాం. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీస్ వ్యవస్థ ఎవరి మోచేతి నీళ్ళు తాగే దుస్థితికి వచ్చింది. వారి చర్యలను మరిచిపోం. పోలీసులు ఇష్టానుసారం రౌడీయిజం చేస్తూ, అధికారపార్టీకి కొమ్ము కాస్తున్నప్పుడు వారిని హెచ్చరించడం తప్పా? వైయస్ జగన్ గారు కూడా ప్రజాస్వామిక పద్దతుల్లోనే వారిని హెచ్చరించారు. చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు గతంలో పోలీసుల గురించి ఎలా మాట్లాడారో ఈ మీడియా సమావేశంలో వీడియో దృశ్యాలను ప్రజలు చూసేందుకు గానూ ప్రదర్శిస్తున్నాం. ఎంత దారుణంగా పోలీస్ వ్యవస్థను కించపరిచేలా వారు మాట్లాడారో ప్రజలు గమనించాలి. పోలీసులు సంఘ విద్రోహశక్తులు అంటూ చంద్రబాబు మాట్లాడారు. పోలీసుల తీరును న్యాయస్థానాలే ఆక్షేపిస్తున్నాయి కొందరు పోలీసులు తమ పోస్టింగ్‌ల కోసం చంద్రబాబు చెప్పినట్లు వింటూ, అధర్మంగా పనిచేస్తున్నారు. న్యాయస్థానాలు కూడా పోలీసుల తీరును, వారు బనాయిస్తున్న కేసులను తప్పు పట్టింది. దీనిపై హోంమంత్రి కాదు, డీఫాక్టో హోంమంత్రిగా వ్యవహరిస్తున్న నారా లోకేష్ సిగ్గు పడాలి. సోషల్ మీడియా పోస్టింగ్‌లు పెట్టిన వ్యక్తిపై దోపిడీ కేసు పెట్టిన ఘనులు మన పోలీసులు. దీనిని న్యాయస్థానమే ప్రశ్నించింది. వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలు, నాయకులపై ఇటువంటి దారుణమైన పద్దతుల్లో పోలీసులు వ్యవహరిస్తుంటే మీపైన వైయస్ జగన్ మాట్లాడకుండా ఎలా ఉంటారు? హెలికాఫ్టర్ ల్యాండింగ్ ప్రదేశంలో పోలీస్ భద్రత లేకపోవడం వల్ల వైయస్ జగన్ ను చూసేందుకు వేలాది మంది జనం ఎగబడ్డారు. వైయస్ జగన్ గారిని చూడాలని, కలవాలని ఇచ్చారు. హెలిప్యాడ్‌లో పోలీసులు ఏ మాత్రం భద్రత కల్పించలేదు. జగన్ గారి పర్యటనలకు భద్రత కల్పించాల్సిన అవసరం లేదని చెప్పండి. మా ఏర్పాట్లు మేం చేసుకుంటాం. గతంలో మిర్చియార్డ్ కు వైయస్ జగన్ గారు వెళ్లినప్పుడు కూడా అలాగే జెడ్‌ప్లస్ సెక్యూరిటీని ఉపసంహరించుకున్నారు. దీనిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసినప్పుడు ఆయనే ఆశ్చర్యపోయారు. చట్టప్రకారం వ్యవహరించని వారు, తెలుగుదేశంకు కొమ్ముకాస్తారో, ఖాకీడ్రస్‌లో ఉండి అరాచకంకు మద్దతిస్తారో వారిని న్యాయస్థానాల ముందు, చట్టం ముందు వారి డ్రస్ విప్పించి బయట నిలబెట్టిస్తాం. ధర్మం కోసం పోరాడుతున్న నాయకుడు వైయస్ జగన్ గారు. రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం, పోలీసులు విఫలమవుతున్నారా? లేక కుట్ర చేస్తున్నారా? చంద్రబాబు, లోకేష్ మాట విని జగన్ గారి సెక్యూరిటీ మీద కుట్ర చేస్తున్నారు. ఈ కుట్రలో భాగస్వాములైన వారు తరువాత దాని ఫలితానలు అనుభవించక తప్పుదు. హోంమంత్రి తీరు మారాలి పులివెందుల ఎమ్మెల్యే అంటూ హోంమంత్రి ఎగతాళిగా మాట్లాడారు. ఆయన ఎప్పటికీ పులివెందుల ఎమ్మెల్యేనే, అలాగే మాజీ సీఎం, ఒక మాజీ సీఎం కుమారుడు, ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, అత్యంత జనాధరణ కలిగిన నాయకుడు. ఆయనకు చట్టప్రకారమే జడ్‌ప్లస్ కేటగిరి భద్రత ఉంటుంది. కూటమి ప్రభుత్వ దయాదాక్షిణ్యాల మీద వచ్చింది కాదు. లింగమయ్య హత్య కుటుంబ నేపథ్యంలో జరిగిందని హోంమంత్రి మాట్లాడుతున్నారు. క్రిమినల్ సైకాలజీ ఉన్న వ్యక్తి అంటూ వైయస్ జగన్‌పై దూషణలకు దిగారు. కూటమి ప్రభుత్వం వచ్చి పదకొండు మాసాలు అయ్యింది. ఇప్పటికే పోలీస్ వ్యవస్థ ఇంత దారుణంగా వ్యవహరిస్తుంటే, అరాచకం రాదా? మాపైన వేధింపులు, హత్యలు, ఇళ్ళపై దాడులు చేస్తున్నప్పుడు పోలీసులు పట్టించుకోకుండా ఉంటే ఏం చేయాలి? ప్రభుత్వాలు వస్తాయి, పోతాయి. ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్లు తమ సర్వీస్ అయ్యేవరకు పనిచేయాలి. వారు సక్రమంగా పనిచేయకపోతే వ్యవస్థలు కుప్పకూలుతాయి. పోలీసులు భద్రత ఇవ్వకపోతే న్యాయస్థానంకు వెళ్ళతాం, కేంద్రప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తాం. ఈ రాష్ట్రంలో వంటరిగా ఎన్నికల్లో పోటీ చేసే సత్తా ఉన్న నాయకుడు, నలబైశాతం ఓటు బ్యాంక్ ఉన్న నాయకుడు. అటువంటి నేతకు సెక్యూరిటీ కల్పించే విషయంలో కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారనే అనుమానాలు పెరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం తమ విధానాన్ని సరిచేసుకోవాలి. అన్యాయాలు,అరాచకాలకు మార్గం వేయవద్దు. ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదు. ముందుగానే వైయస్ జగన్ గారు వన్‌వే కోసమే హెలికాఫ్టర్‌ను మాట్లాడుకున్నారని హోంమంత్రి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. విండ్‌షీల్డ్ పగిలింది కాబట్టి వీఐపీని తీసుకువెళ్ళలేమని పైలెట్ చెబుతుంటే దానిని వక్రీకరించేలా మాట్లాడుతున్నారు.