నరసరావుపేట: దేశంలోనే రెండో బర్డ్ ఫ్లూ మరణం నరసరావుపేటలో నమోదైనా కూడా ప్రభుత్వం అప్రమత్తం కాకుండా మొద్దునిద్ర పోతోందని నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ఇటీవల బర్డ్ ఫ్లూ కారణంగా చనిపోయిన నరసరావుపేటకు చెందిన బాలిక కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బాలిక మరణంతో అప్రమత్తం కావాల్సిన ప్రభుత్వం విషయాన్ని తేలికగా తీసుకోవడం దారుణమని అన్నారు. ప్రభుత్వ ఉదాసీన వైఖరి వల్ల ప్రజల ప్రాణాలే ప్రమాదంలో పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే... దేశంలో రెండో బర్డ్ ఫ్లూ మరణం నరసరావుపేటలో నమోదైంది. రెండు రోజుల క్రితం రెండేళ్ల చిన్నారి మంగళగిరి ఎయిమ్స్‌లో బర్డ్ ఫ్లూ వ్యాధికి చికిత్స పొందుతూ మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో చనిపోయినట్టు ఆస్పత్రి వైద్యులే ధ్రువీకరించారు. పూణేలోని ఐసీఎంఆర్ వైరాలజీ ల్యాబ్ లో బాలిక శాంపిల్స్ తీసుకుని టెస్టుల అనంతరం బర్డ్ ఫ్లూ మరణంగా నిర్ధారించారు. బర్డ్ ఫ్లూతో తొలిమరణం 2021లో మహారాష్ట్రలో సంభవించగా రెండో మరణం మన రాష్ట్రంలోనే నరసరావుపేటలో నమోదు కావడం బాధాకరం. చిన్నారి చనిపోయిన ఇంటికి సమీపంలో పది రోజుల క్రితం బర్డ్ ఫ్లూతో కొన్ని కోళ్లు చనిపోయాయని బాలిక పెదనాన్న కూడా చెబుతున్నాడు. ఆ కోళ్ల నుంచి వచ్చిన ఇన్ఫెక్షన్ కారణంగానే చిన్నారికి బర్డ్ ఫ్లూ సోకి ఉండొచ్చని కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బాలికకు ఇన్ఫెక్షన్ సోకడానికి ప్రధాన కారణాలపై అన్వేషించకుండా స్థానిక ఎమ్మెల్యే డాక్టరై ఉండి కూడా ఇది బర్డ్ ఫ్లూ మరణం కాదని ప్రకటించడం ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉంది. దేశంలోనే ఎప్పుడూ లేనివిధంగా చిన్నారి బర్డ్ ఫ్లూతో మరణిస్తే తీవ్రంగా పరిగణించాల్సిపోయి ప్రభుత్వం చోద్యం చూస్తోంది. ఇంతవరకు వారి కుటుంబాన్ని ఆరోగ్యశాఖ మంత్రి లేదా వైద్యారోగ్య శాఖ సిబ్బంది పరామర్శించడానికి, ఈ ప్రాంతాన్ని పరిశీలించడానికి కూడా రాకపోవడం నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. రాష్ట్రంలో పక్షులు చనిపోతే ఆరు జిల్లాలను బర్డ్ ఫ్లూ ఇన్పెక్షన్ సెంటర్లుగా ప్రకటించిన ప్రభుత్వం, బర్డ్ ఫ్లూతోనే చిన్నారి చనిపోయిందని ఐసీఎంఆర్ ధ్రువీకరించిన తర్వాత కూడా నరసరావుపేటను ఇన్ఫెక్షన్ సెంటర్‌గా ప్రకటించకపోవడం దారుణం. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. గత వైయస్సార్సీపీ హయాంలో కరోసా సమయంలో వలంటీర్ల ద్వారా ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్‌లు జరిగేవి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక వలంటీర్ల వ్యవస్థను తీసేశారు. ప్రజారోగ్యాన్ని పూర్తిగా గాలికొదిలేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు దొరకడం లేదు. ఆరోగ్యశ్రీకి బిల్లులు పెండింగ్ పెట్టడంతో ఆస్పత్రి యాజమాన్యాలు వైద్యం నిరాకరించే పరిస్థితికి తీసుకొచ్చారు.