తాడేపల్లి: ఉనికి కోసమే టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్ర అంటున్నారని, ఆయన యాత్రకు ప్రజా స్పందన లేదని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ తలశీల రఘురామ్ అన్నారు. నారా లోకేష్ పాదయాత్ర అనుమతిపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఆయన ఖండించారు. సోమవారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు మేయర్ మనోహర్ నాయుడుతో కలిసి తలశీల రఘురామ్ మీడియాతో మాట్లాడారు. లోకేష్ ఉనికి కోసమే.. - ఎవరు పాదయాత్ర చేయాలన్నా.. పోలీసులు మైకు, సెక్యూరిటీ వాహనాల వివరాలు అడుగుతారు . వాటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగితే రూట్ మ్యాప్ కచ్చితంగా ఇవ్వాలి. అవి ఇవ్వకుండా, ఈ పాదయాత్రను చూసి మేమేదో భయపడతున్నాం, అడ్డుకుంటున్నాం అని టీడీపీ నేతలు లేని హైప్ ను క్రియేట్ చేసి, రాజకీయం చేస్తున్నారు. కేవలం లోకేష్ ఉనికి కోసం చేసే పాదయాత్ర మాత్రమే ఇది. మీరు పాదయాత్రలు చేసినా, బస్సు యాత్రలు చేసినా మిమ్మల్ని ప్రజలు ఆదరించరు, నమ్మరు. - మేం ఎక్కడికి వెళ్లినా ప్రజలు మాకు బ్రహ్మరథం పడుతున్నారు...ఏ గ్రామానికి వెళ్లినా ముఖ్యమంత్రి జగన్ గారు మా ఇంట్లో ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారని లబ్ధిదారులే ముందుకొచ్చి చెప్తారు. మా ఎమ్మెల్యేలు ప్రతి గడప గడపకు వచ్చి, ప్రభుత్వం ఏం చేసిందో కూడా చెప్పారని చెబుతారు. - ఎక్కడో హైదరాబాద్ లోని రాజప్రాసాదాల్లో కూర్చుని ప్రభుత్వ పనితీరు బాగాలేదు అంటే కుదరదు. గ్రామాల్లోకి వెళితే మా ప్రభుత్వ పనితీరు కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. - ప్రతి గ్రామంలో సచివాలయాలు కట్టాం.. నాడు - నేడు ద్వారా స్కూల్స్, ఆసుపత్రులు బాగుచేశాం. ఆర్బీకే సెంటర్లు, హెల్త్ క్లినిక్ లు కళ్లకు కట్టినట్లు కన్పిస్తాయి. ఇవన్నీ ప్రజలే మీకు చెబుతారు. ఇన్ని రోజులు మీరెలాగూ గ్రామాల్లోకి వెళ్లలేదు.. ఇప్పుడన్నా వెళ్లండి..ప్రజలు మీ కళ్లు తెరిపిస్తారు. అపుడైనా మీకు జ్ఞానోదయం అవుతుందని ఆశిస్తున్నాం. అప్పుడు అయినా, మీకు కనువిప్పు కలుగుతుంది... మీరు ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో.. అప్పుడైనా పునరాలోచించుకోండి. ప్రజలంతా సంతోషంగా ఉంటే.. ఎందుకు వారిని ఇబ్బంది పెడుతున్నాం అని మీరు మధ్యలోనే పాదయాత్ర ఆపుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. గుర్తుంచుకోండి. దత్తపుత్రుడికి పగ్గాలు అప్పగిస్తాడన్నదే లోకేష్ భయంః - తనను కాదని, దత్త పుత్రుడికి బాబు పార్టీ పగ్గాలు అప్పగిస్తాడన్న భయంతో చేస్తున్న యాత్ర మాత్రమే. ప్రజల కోసం చేసే పాదయాత్ర అయితే అసలే కాదు. - తన తండ్రి తనను దూరంగా పెట్టి, ఎక్కడ పవన్ కళ్యాణ్‌కు పగ్గాలు అప్పజెప్తాడోననే భయంతో, ఉనికి కోసం, తన తండ్రి మీద తిరుగుబాటుతో మాత్రమే లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడు. చివరికి పార్టీకి కూడా కాకుండా పోతానేమో అన్న భయంతో లోకేష్ చేస్తున్న పాదయాత్ర అది. - ఇది ప్రజా సంక్షేమం కోసం చేసే యాత్ర కాదు..అటువంటిదానికి ప్రజల మద్దతు ఉండదు. - మీ యాత్రలకు పేర్లు ఎన్నైనా పెట్టుకోవచ్చు... చిత్తశుద్ధిలేని మీరు ఎన్ని యాత్రలు చేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మరు. - ఈ రోజు జగన్ గారు బయటకు వస్తే యువకులతోపాటు అన్నివర్గాల ప్రజలు కదిలి వస్తారు...పాదయాత్రలో ఆనాడూ అదే జరిగింది. - తాను నిల్చొన్న స్థానంలోనూ గెలవలేని వ్యక్తి లోకేష్.. మిగతావాళ్ళని ఎలా గెలిపించగలడు..?. అతని వెంట ఎవరైనా ఎలా వెళ్తారు అనే అనుమానం లోకేష్ కు కూడా ఉంది. - అందుకే పాదయాత్రని మేమేదో అడ్డుకుంటున్నాం.. అంటూ దుష్ప్రచారం చేసి వారి కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు. - పవన్, లోకేష్ ఇద్దరూ అన్నదమ్ములే. లోకేష్ ఒక చోట ఓడిపోతే.. పవన్ రెండు చోట్ల ఓడిపోయాడు. వీళ్లు ప్రజల్లోకి వెళ్లి చేసేది ఏమీ ఉండదు.. వీళ్లు ప్రజల్ని కూడగట్టేది అంతకన్నా ఉండదు. అనామకుడి పాదయాత్రకు ఇంత హడావుడా..? పాదయాత్రకు అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది అని మాట్లాడే వాళ్ళు, టీడీపీ హయాంలో ఏం చేశారో ఒక్కసారి ఆలోచించుకోవాలి. నవంబర్ 6వ తేదీన మా నాయకుడు, ప్రతిపక్ష నేతగా, పార్టీ అధ్యక్షుడిగా పాదయాత్ర చేయాలనుకుంటే నవంబరు 3 వ తేదీ వరకూ అనుమతి ఇవ్వలేదు. మా నాయకులు పోలీసుల దగ్గరకు వెళ్లి రూట్ మ్యాప్ ఇచ్చి, పూర్తి వివరాలు చేప్తే తప్ప మాకు అనుమతి ఇవ్వలేదు . సామాన్య ప్రజలు కూడా ఎవరైనా పాదయాత్ర చేయవచ్చు . - అలాంటప్పుడు ఒక అనామకుడు, రేపో మాపో కాబోయే మాజీ ఎమ్మెల్సీ పాదయాత్ర చేస్తే ఇంత హడావుడి అవసరం లేదు. - ఇప్పుడు వాళ్లని డీజీపీ గారు ఏమైతే అడిగారో ఆనాడు మమ్మల్ని కూడా పోలీసులు అవే అడిగారు.. మేం ఆనాడు అన్నీ సమర్పించాకే అనుమతులు ఇచ్చారు. రూట్ మ్యాప్ లో మార్పులు చేర్పులు ఉంటే ఆయా జిల్లాల్లో ఎస్పీలకు సమాచారం ఇవ్వాలి. ఏం జరిగినా మాదే బాధ్యత అని.. ప్రతి జిల్లాలో బాధ్యుడిగా మా జిల్లా అధ్యక్షుడిని పెట్టాం. ఏదైనా జరిగితే నాది బాధ్యత అని నాతో కూడా ఆనాడు పోలీసులు సంతకాలు పెట్టించుకున్నారు. - మా పాదయాత్రకు ఎన్నో సార్లు విఘాతం కల్పించినా.. ఏ రోజూ పల్లెత్తి మాట మాట్లాడలేదు. మీలా మేం రాజకీయం చేయాలనుకోవడం లేదు - కదిరిలో కందికుంట ప్రసాద్, తాడేపల్లిగూడెంలో బాపిరాజు లాంటి వారు బైకు ర్యాలీల పేరుతో మా యాత్రకు అడ్డుగా ఎలా వచ్చారో టీడీపీ వాళ్ళు గుర్తుకు తెచ్చుకోవాలి. - మీరు ఎన్ని విఘ్నాలు కల్పించినా జగన్మోహన్‌రెడ్డి గారు మొక్కవోని సంకల్పంతో పాదయాత్ర చేశారు. మీలా పాదయాత్ర చేయకముదే... ఒక అడుగు వేయడానికి కూడా భయపడుతూ, నడలేమోమో అన్న భయంతో, ముందుగానే ప్రభుత్వం మీద నెపం వేసేందుకే టీడీపీ నానా యాగీ చేస్తున్నట్లు ఉంది. - మేమైనా, వాళ్ళైనా పోలీసు నిబంధనలకు లోబడే పాదయాత్రలు చేయాలి. భయం మా బ్లడ్ లోనే లేదుః - వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలకు, వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారికి భయమనేది బ్లడ్‌లోనే లేదు. - లోకేష్ ఏ స్థాయి నాయకుడు. కనీసం ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు...ఒక పార్టీ అధ్యక్షుడు కూడా కాదు... రేపో మాపో ఉన్న ఎమ్మెల్సీ పదవీ కూడా ఊడిపోయే లోకేష్ కు ఎందుకంత హడావుడి చేస్తున్నారు. - ఎల్లో మీడియాని కూడా ప్రశ్నిస్తున్నాను... లోకేష్ పాదయాత్రకు అంత ప్రయార్టీ ఎందుకు ఇస్తున్నారో ఆలోచించాలి. - గ్రామాల్లోకి వెళితే జగన్ గారు మా కుటుంబానికి ఇంత ఇచ్చారు...మీరేమి ఇస్తారు అని జనం మిమ్మల్ని ప్రశ్నిస్తారు. వాటికి సమాధానం చెప్పుకుంటూ మీరు పాదయాత్ర చేయండి ఎవరైనా చనిపోతే బాధ్యత ఎవరిదో అడగాలిః - డీజీపీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను... కందుకూరు, గుంటూరు తరహాలో ఎవరన్నా చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారనే అంశాన్ని కూడా లిఖిత పూర్వకంగా టీడీపీ వాళ్ళను అడగాలి. - ఇటీవల టీడీపీ సభల వల్ల 11 మంది అమాయక ప్రజలు చనిపోయారు..దానికీ బాధ్యత తీసుకోవాలి. - గతంలో మేము పాదయాత్ర చేసినప్పుడు కూడా, మాతోనూ ఇలానే సంతకాలు తీసుకున్నారు... మంగళగిరిలో మేం దీక్ష చేస్తుంటే అక్కడి డిఎస్పీ నాతో సంతకం చేయించుకున్నారు. ఆ స్థల యజమానిని సంతకం పెట్టమని బెదిరించాడు...ఆయన స్థానంలో నేను సంతకం పెట్టాను. ఎవరన్నా చనిపోతే మాపై హత్యా నేరం మోపుతాం అని కూడా అన్నారు. అలానే ఇప్పుడు లోకేష్ యాత్రలో కూడా వారిని బాధ్యులుగా చేయాలి. డీజీపీ గారు ఇలాంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి - మా పాదయాత్రలో ఎవరికేం జరిగినా నాదీ బాధ్యత అని మా నాయకుడు, మేం బాధ్యత తీసుకున్నాం. - పోలీసుల్ని టార్గెట్ ను చేయడం టీడీపీ వారికి అలవాటుగా మారిపోయింది . పోలీసులు మీవాళ్లు కాదు..మా వాళ్లు కాదు..ప్రభుత్వ అధికారులు అని గుర్తుంచుకోవాలి - మీకు నిర్వహణ తెలియకే 11 మందిని చంపారు... ఇప్పుడైనా కనీసం డీజీపీ గారు చెప్పేది వినండి. ఆఫీసుల్లో కూర్చుని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడమే ప్రపంచం అనుకుంటున్నారు - ఏపీ ప్రజల్లో చాలా రాజకీయ చైతన్యం ఉంది.. ఎవరి కెపాసిటీ ఏమిటో వారికి బాగా తెలుసు. మహాఅయితే లోకేష్ ది కామెడీ యాత్ర అవుతుంది.