తిరుపతి: తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల కోసమే చంద్రబాబు అమరావతిని రాజధానిగా ఎంచుకున్నాడని, బాబుది దూర ఆలోచన కాదు.. దురాలోచన అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తుళ్లూరులో ఆందోళన చేసేవారంతా టీడీపీ నాయకులు, కార్యకర్తలు మాత్రమేనని, బాబు మ్యాన్ మేడ్ ఆందోళనలని అన్నారు. తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు దురాలోచనలో భాగంగానే ఈ ఆందోళనలు చేయిస్తున్నాడన్నారు. చంద్రబాబు బినామీలు రాజధానిలో భూములు కొన్నారనేది ఆరోపణ కాదు వాస్తవమేనని, 7 వేల ఎకరాలకుపైగా రాజధాని ప్రాంతంలో కొనుగోలు చేశారని పేర్లతో సహా అసెంబ్లీలో చెప్పడం జరిగిందన్నారు. భూ ఆక్రమణలపై విచారణ జరుగుతుందని, పూర్తయిన తరువాత ఎన్ని వేల ఎకరాలు అనేది బయట పడుతుందన్నారు. సింగపూర్ ప్రభుత్వం ఎంఓయూలు కుదుర్చుకున్నామని చంద్రబాబు చెబుతున్నాడని, సింగపూర్ ప్రభుత్వంతో కాదు.. ప్రైవేట్ కంపెనీలతో ఎంఓయూ చేసుకున్నాడని తేలిందన్నారు. వైయస్‌ఆర్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ కంపెనీలు కూడా గౌరవంగా తప్పుకున్నాయన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత రాజధాని ప్రాంతంలో చంద్రబాబు అండ్ కో అక్రమంగా లాక్కున్న భూములు తిరిగి ఇచ్చేస్తామని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు చెప్పారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గుర్తుచేశారు. క్యాపిటల్ అమరావతిలో పెట్టాలనే ఆలోచన చేస్తే.. హైదరాబాద్‌లో 200 ఎకరాల్లో రాజధాని నిర్మించుకున్నారని, అలాగే మన రాష్ట్రంలో కూడా రాజధాని నిర్మాణానికి కావాల్సిన భూములు 4–5 వందల ఎకరాలు పెట్టుకొని మిగిలిన భూమి రిటర్న్ చేస్తామన్నారు. 4–5 వందల ఎకరాలకు సంబంధించిన ప్రభుత్వ భూములే ఉన్నాయి కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు.