అమరావతి: ఇన్నాళ్లూ రకరకాల ప్రకటనలతో ప్రజలను మభ్యపెట్టిన కూటమి ప్రభుత్వం అసలు రంగు ఇవాళ శాసన మండలి సాక్షిగా బట్టబయలైంది. గురువారం మండలిలో విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి వచ్చిన సమాధానాలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. దావోస్ పర్యటనకు ముందు చంద్రబాబు, లోకేష్‌లు ఊదరగొట్టారు. లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు. తీరా దావోస్ వెళ్లి ఖాళీ చేతులతో తిరిగి వచ్చారు. దావోస్ నుంచి ఎంత పెట్టుబడులు వచ్చాయని వైయస్ఆర్‌సీపీ సభ్యులు మాధవరావు, రవీంద్రబాబు, కవురు శ్రీనివాస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వీరి ప్రశ్నకు ప్రభుత్వం వింత సమాధానం చెప్పింది. దావోస్ పర్యటనలో ఏంఓయూ లు జరగలేదని అంగీకరించింది. డబ్ల్యూఈఎఫ్ కేవలం అంతర్జాతీయ వేదిక మాత్రమే అంటూ సమాధానం వింత భాష్యం చెప్పారు. అది పెట్టుబడులకు ఎంఓయూ లు చేసుకునే వేదిక కాదంటూ సమాధానం చెప్పడంతో ఎమ్మెల్సీలు ఆశ్చర్యపోయారు. చంద్రబాబుతో పాటు దావోస్ పర్యటనకు వెళ్లిన పక్క రాష్ట్రాలు తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు లక్షల కోట్లు ఎంవోయూలు కుదుర్చుకున్న విషయాన్ని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు గుర్తు చేస్తున్నారు. విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్ధి చేయడం లేదు: మంత్రి దుర్గేష్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్ధి చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక ఎలాంటి సినీ పరిశ్రమ అభివృద్ది చేయడం లేదంటూ మండలి సాక్షిగా పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. విశాఖ లో సినీ పరిశ్రమ అభివృద్ధి ప్రతిపాదన లేదని మంత్రి దుర్గేష్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. స్టూడియోల కోసం భూములు కేటాయించే ఆలోచన లేదని సమాధానంలో వెల్లడించారు. గత ప్రభుత్వం చేసిన మంచిని ఒప్పుకున్న ప్రభుత్వం మండలి సాక్షిగా వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మత్స్యకారులకు చేసిన మేలును కూటమి ప్రభుత్వం ఒప్పుకోక తప్పలేదు. వైయస్ జగన్ ప్రభుత్వంలో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి ఎలాంటి చర్యలు తీసుకుందని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవ రావు మండలిలో ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు మంత్రి బిసి జనార్ధన్ రెడ్డి సమాధానం ఇస్తూ..2019-24 లో నిర్మాణం కోసం 9 కొత్త ఫిషింగ్ హార్బర్ లు ప్రతిపాదనలు చేశారని చెప్పారు. మొదటి దశ కింద ఉప్పాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, జువ్వలదిన్నె హార్బర్ల నిర్మాణానికి ప్రతిపాదనలు. రెండవ దశ కింద బుడగట్లపాలెం, పూడిమడక, ఓడరేవు, కొత్తపట్నం, బియ్యపు తిప్ప హార్బర్ కు ప్రతిపాదించారు. 2024 మార్చి వరకు రూ.970.56 కోట్లు ఫిషింగ్ హార్బర్లకు ఖర్చుచేసినట్లు మంత్రి వివరించారు. తొలిదశ కింద జువ్వలదిన్నె 86.75 శాతం పనులు, నిజాంపట్నం 64.71 శాతం, మచిలీపట్నం 61.29 శాతం, ఉప్పాడ 69.29 శాతం పనులు పూర్తి అయినట్లు మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి తెలిపారు. మూడవ దశ కింద హార్బర్ల నిర్మాణానికి పనులు అప్పగించామని, భూ సమస్యలు పరిష్కారమవ్వగానే భౌతికపరమైన పనులు మొదలవుతాయని, మిగిలిన పోర్టులు దశల వారీగా పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఫిషింగ్ హార్బర్లను ప్రైవేటీకరించే ఏ ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదని మంత్రి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక హార్బర్: ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక హార్బర్ ఉండేలా నాటి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రణాళిక రూపొందించి పనులు ప్రారంభించారని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు తెలిపారు. ఇందులో భాగంగానే గత ప్రభుత్వం 9 కొత్త ఫిషింగ్ హార్బర్లు తెచ్చినట్లు చెప్పారు. రూ.3,500 కోట్లతో ఈ ఫిషింగ్ హార్బర్లు నిర్మించాలని భావించినట్లు పేర్కొన్నారు. ఇందులో 10,525 బోట్లు లంగరు వేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. 4.5 లక్షల టన్నుల మత్స్యసంపద ఎగుమతికి అవకాశం ఉందన్నారు. జువ్వలదిన్నె పోర్టును ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా గత ఆగస్ట్ లో ప్రారంభమైనట్లు గుర్తు చేశారు. అన్ని హార్బర్లు పూర్తైతే జిడిపి 9 వేల కోట్లకు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. 555 మత్స్యకార గ్రామాలకు మేలు జరుగుతుందని, 6.3 లక్షల మంది మత్స్యకారులకు లబ్ధి చేకూరుకుతుందని మాధవరావు వివరించారు. ప్రభుత్వమే ఫిషింగ్ హార్బర్లను పూర్తి చేసి నిర్వహించాలని ఎమ్మెల్సీ డిమాండ్ చేశారు. పీ4 పాలసీలో ఎంతమందిని పారిశ్రామిక వేత్తలుగా మార్చారని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీలకు పెండింగ్ లో ఉన్న ఇన్సెంటివ్స్ ఎప్పుడు విడుదల చేస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ది చెందితేనే పరిశ్రమలు వస్తాయని వైయస్ జగన్ అనేక సంస్కరణలు తీసుకు వచ్చారని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం నూతన పరిశ్రమల స్థాపనకు ఎలాంటి చర్యలు తీసుకుందని ప్రశ్నించారు. కోవిడ్ సమయంలో కూడా కొత్త పరిశ్రమలు తీసుకువచ్చారని, రాష్ట్రంలో పేదరికం పోవాలంటే ఉద్యోగ కల్పన జరగాలని ఆయన కోరారు. రాబోయే రోజుల్లో మరిన్ని పరిశ్రమలు తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేయాలని, పరిశ్రమల కోసం భూములు ఇచ్చిన వారికి కూడా ఉద్యోగావకాశాలు కల్పించాలని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.