నేడు విశాఖ‌లో వైయ‌స్ఆర్‌సీపీ నిరసనలు.. 

స్టేడియం వద్ద పోలీసుల మోహరింపు 

విశాఖపట్నం: విశాఖ క్రికెట్ స్టేడియం వద్ద వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో కాసేపట్లో నిరసన కార్యక్రమం జరగనుంది. దివంగత మహానేత వైయ‌స్ఆర్ పేరును క్రికెట్‌ స్టేడియానికి తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ వైయ‌స్ఆర్‌సీపీ నేతలు నిరసనలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో కూటమి కక్ష సాధింపులో భాగంగా నిరసనలను అడ్డుకునేందుకు పోలీసులు భారీ సంఖ్యలో స్టేడియం వద్ద మోహరించారు.

కూటమి సర్కార్‌ పాలనలో విశాఖ క్రికెట్‌ స్టేడియానికి వైయ‌స్ఆర్ పేరును తొలగించడం పట్ల వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తొలగించిన పేరు యథావిధిగా పెట్టాలని వైయ‌స్ఆర్‌సీపీ డిమాండ్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలో క్రికెట్‌ స్టేడియానికి వైయ‌స్ఆర్ పేరు తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ వైయ‌స్ఆర్‌సీపీ నేతలు నిరసనలకు పిలుపునిచ్చారు. దీంతో, చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగారు.

నిరసనల నేపథ్యంలో గురువారం తెల్లవారుజామునుంచే వైయ‌స్ఆర్‌సీపీ నేతలను ముందస్తు అరెస్ట్‌లు చేస్తున్నారు. ఈరోజు ఉదయమే పలువురు నేతల ఇళ్ల వద్దకు పోలీసులు చేరుకుని వారి హౌస్‌ అరెస్ట్‌ చేశారు. అంతేకాకుండా క్రికెట్‌ స్టేడియం వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు.

ఇక, నగరంలోని పీఎంపాలెం వద్దనున్న డాక్టర్ వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డి ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడి­యంలో మాజీ సీఎం వైఎస్సార్‌ పేరును పాలకవర్గం తొలగించింది. వైఎస్సార్‌ రాష్ట్రానికి అందించిన సేవలకు గుర్తుగా 2009 సెప్టెంబరు 14న అప్పటి ఏసీఏ అధ్యక్షుడు గోకరాజు గంగరాజు ఆధ్వ­ర్యంలో ఏసీఏ–వీడీసీఏ స్టేడియాన్ని వైయ‌స్ఆర్ ఏసీఏ–­వీడీసీఏ స్టేడియంగా పేరు మార్చారు. అప్పుడు అన్ని వర్గాల నుంచి మద్దతు లభించింది.

తాజాగా.. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికా­రంలోకి వచ్చాక, ప్రధానంగా విశాఖలో  వైయ‌స్ఆర్ గుర్తులు తుడి­చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందులో భాగంగా విశాఖ బీచ్‌ తదితరచోట్ల వైయ‌స్ఆర్ వ్యూ పాయింట్లు ధ్వంసం చేశారు. అలాగే, అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో పలుచోట్ల ఉన్న వైయ‌స్ఆర్ పేరును మరమ్మతుల పేరిట తొలగించేస్తున్నారు. ఈ చర్యపట్ల క్రికెట్‌ అభిమానులతోపాటు వైయ‌స్ఆర్ అభిమానులు మం­డిపడుతున్నారు. ప్రభుత్వం మార్కు తన పాలనలో చూపించాలిగానీ ఇలాంటి విధ్వంసకర విషయాల్లో కాదని ఆక్షేపిస్తున్నా­రు.

YSRCP Leaders Protest AT Visaka Cricket Stadium Updates

Back to Top