రాష్ట్రంలో రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులా?

వాటిపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా?

వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి సవాల్‌

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి ప్రెస్‌మీట్‌.

ఏ పరిశ్రమ ఎప్పుడొచ్చింది? ఎక్కడొచ్చింది?

వాటి ద్వారా ఎంత మందికి ఉపాధి లభించింది?

పెట్టుబడి ఎంత, ఉత్పత్తి సామర్థ్యం ఎంతో చెప్పగలరా? 

ఆ వివరాలు సచివాలయాల్లో ప్రదర్శించగలరా?

సూటిగా ప్రశ్నించిన పుత్తా శివశంకర్‌రెడ్డి

అశోక్‌ లీలాండ్‌ యూనిట్‌ 2018కు ముందే ప్రారంభం

అయినా ఇప్పుడు మొదలైనట్లు లోకేష్‌ ఆర్భాటం

కొత్తగా అనుమతి. ఉత్పత్తి ప్రారంభించినట్టు కలరింగ్‌

తన శాఖ కాకపోయినా పబ్లిసిటీ కోసం లోకేష్‌ ఆరాటం

ప్రెస్‌మీట్‌లో పుత్తా శివశంకర్‌రెడ్డి ఆక్షేపణ

తాడేపల్లి: రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులపై పదే పదే అబద్ధాలు ప్రచారం చేస్తున్న కూటమి ప్రభుత్వం, మరోసారి అదే పని చేసి, ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తోందని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి ఆక్షేపించారు. ఆ దిశలోనే మంత్రి నారా లోకేష్, రాష్ట్రంలో ఈ 9 నెలల్లో రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, 4 లక్షల ఉద్యోగాలకు అవకాశం ఉందంటూ ప్రగల్భాలు పలికారని ఆయన దుయ్యబట్టారు. ఈ విషయంలో ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, కూటమి ప్రభుత్వం వచ్చాక, రాష్ట్రంలో వచ్చిన పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అందులో అన్ని వివరాలు పొందుపర్చాలని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్‌మీట్‌లో పుత్తా శివశంకర్‌రెడ్డి కోరారు.

పుత్తా శివశంకర్‌ ఇంకా ఏమన్నారంటే..

శ్వేతపత్రం విడుదల చేస్తారా?:
    కూటమి ప్రభుత్వ ఈ 9 నెలల పాలనలో రాష్ట్రంలో రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి నారా లోకేష్‌ ఆర్భాటంగా చెప్పారు. దాదాపు నెల రోజుల క్రితం, గత నెల 24న గవర్నర్‌ ప్రసంగంలో రాష్ట్రంలో అప్పటి వరకు రూ. 6.50 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వాటి ద్వారా 4 లక్షల మందికి ఉద్యోగావకాశాలు వచ్చాయని చెప్పుకున్నారు. నెల కూడా గడవక ముందే, రాష్ట్రంలో రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెబుతున్నారు.
     ఈ వ్యవధిలోనే రూ.50 వేల కోట్లు పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయి!. నిజానికి గవర్నర్‌ ప్రసంగంపై చర్చ సందర్భంగా రాష్ట్రంలో రూ.6.50 లక్షల కోట్ల పెట్టుబడులపై మండలిలో వైయ‌స్ఆర్‌సీపీ సభ్యులు నిలదీస్తే, సమాధానం చెప్పకుండా దాటవేశారు. ఎదురుదాడి చేసే ప్రయత్నం చేశారు. అలాగే ఉద్యోగాలు కల్పించామని చెప్పలేదని, అన్ని ఉద్యోగాలకు అవకాశం ఉందని చెప్పామని, పచ్చి అబద్ధం చెప్పారు.
    ప్రభుత్వానికి నిజంగా ఈ విషయంపై చిత్తశుద్ధి ఉంటే, వారు చెబుతున్నట్లుగా రాష్ట్రంలో రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులపై పూర్తి వివరాలతో వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి. ఎక్కడెక్కడ, ఎంతెంత పెట్టుబడులతో ఏయే పరిశ్రమలు ఏర్పాటయ్యాయి? వాటి ద్వారా ఎంత మందికి ఉపాధి లభించింది? అన్న పూర్తి వివరాలు ప్రకటించాలి.

ఆ ధైర్యం మీకుందా?:
    గత మా ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించే వాళ్లం. ఎందుకంటే అంత పారదర్శకంగా ఎక్కడా ఏ లోపం లేకుండా, అర్హతే ప్రామాణికంగా అన్నింటినీ అమలు చేశాం.
    ఇప్పుడు మీరు కూడా అలా, మీ పనులను, పథకాల అమలును.. ముఖ్యంగా రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడుల వివరాలను ఆయా ప్రాంతాల్లో గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శించగలరా? ఆ ధైర్యం మీకుందా?.
    నిజానికి కూటమి ప్రభుత్వం వచ్చాక పరిశ్రమలు రాష్ట్రం నుంచి పారిపోయే పరిస్థితి నెలకొంది. దాడులు, కమీషన్ల వేధింపులకు పారిశ్రామికవేత్తలు బెంబేలెత్తిపోతున్నారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ కంపెనీ. కూటమి ప్రభుత్వ వేధింపులతో జిందాల్‌ స్టీల్‌ ప్లాంట్‌ మహారాష్ట్రకు పారిపోయింది. మీడియాను అడ్డం పెట్టుకుని దావోస్‌ పర్యటనలో హడావుడి చేయడం తప్ప, మీరు సాధించిందేమీ లేదు. దావోస్‌ పర్యటనను పెయిడ్‌ హాలిడేగా వాడుకున్నారు. 

2018కి పూర్వమే ఆ యూనిట్‌:
    విజయవాడ సమీపంలోని ఏపీఐఐసీ కారిడార్‌లో 2018కి పూర్వమే అశోక్‌ లీలాండ్‌ యూనిట్‌ ప్రారంభం కాగా, ఆ తర్వాత కోవిడ్‌ కారణంగా డిమాండ్‌ తగ్గడంతో ఉత్పత్తి కూడా తగ్గింది. కానీ నిన్న (19వ తేదీ, బుధవారం) అక్కడ నారా లోకేష్‌ చేసిన అతి చూస్తే 2024లో తాము అధికారంలోకి వచ్చాకే, ఆ యూనిట్‌ ఏర్పాటైనంత బిల్డప్‌ ఇచ్చారు. ఆ యూనిట్‌కు తామే అనుమతి ఇచ్చినట్లు, దాన్ని తామే తెచ్చినట్లు చెప్పుకోవడం హాస్యాస్పదం. ఎప్పుడో ఉత్పత్తి ప్రారంభించిన యూనిట్‌లో ఇప్పుడు 600 ఉద్యోగాలు రాబోతున్నట్టు ప్రచారం చేసుకోవడం మరీ విడ్డూరం.
    అయ్యా, లోకేష్‌గారూ.. మంత్రిగా మీరు అశోక్‌ లీలాండ్‌ బస్పు ఎక్కడం కాదు.. ఎన్నికల్లో సూపర్‌సిక్స్‌ హామీల్లో మీరిచ్చిన మహిళలకు ఉచిత బస్సు హామీని అమలు చేసి టికెట్లు లేకుండా వారిని బస్సుల్లో తిప్పండి. 
    తన శాఖ తప్ప, అన్ని శాఖల్లో జోక్యం చేసుకుంటున్న మంత్రి నారా లోకేష్, రాష్ట్రంలో విద్యా రంగాన్ని భ్రష్టు పట్టించారు. గవర్నమెంట్‌ స్కూళ్లలో డ్రాపవుట్స్‌ పెరుగుతున్నా, విద్యాశాఖను సరిగ్గా నిర్వహించలేకపోతున్న లోకేష్, తనది కాని పరిశ్రమల శాఖలో వేలు పెట్టి హడావుడి చేశాడని పుత్తా శివశంకర్‌రెడ్డి ఆక్షేపించారు.
 

Back to Top