విశాఖపట్నం: విశాఖపట్నంలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు ఉన్న డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి పేరును తొలగించేందుకు చేస్తున్న కుట్రను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని వైయస్‌ఆర్‌సీపీ విశాఖజిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ హెచ్చరించారు. విశాఖపట్నం పీఎంపాలెంలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వద్ద వైయస్‌ఆర్ పేరును తొలగించే ప్రయత్నాలకు వ్యతిరేకంగా వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా స్టేడియం వద్ద మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ వైయస్‌ఆర్ పేరును తొలగించాలన్న కూటమి ప్రభుత్వ దుర్మార్గపు ఆలోచనలను సాగనివ్వమని స్పష్టం చేశారు. మహానేత వైయస్‌ఆర్ ఆనవాళ్ళను తుడిచేయాలని సీఎం చంద్రబాబు అనుకోవడం ఆయన అవివేకానికి నిదర్శనమని మండిపడ్డారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండుసార్లు సీఎంగా పనిచేసిన స్వర్గీయ వైయస్ రాజశేఖరరెడ్డి సేవలకు గుర్తుగా విశాఖపట్నం పీఎంపాలెంలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు ఆయన పేరును పెడుతూ 2009లో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ గవర్నింగ్ బాడీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గత పదహారు సంవత్సరాలుగా డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంగానే ఇక్కడ అనేక అంతర్జాతీయ, జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు జరిగాయి. స్టేడియంలో మాజీ సీఎం స్వర్గీయ వైయస్‌ఆర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఈ పదినెలల్లోనే రాష్ట్రంలో ఎక్కడా వైయస్‌ఆర్ అనే పేరు లేకుండా చేయాలనే కుట్రతో దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. దానిలో భాగంగానే 2024 జూన్ లో అధికారంలోకి రాగానే ఎఎన్‌యులో ఉన్న వైయస్‌ఆర్ విగ్రహాన్ని తొలగించారు. బాపట్లలో వైయస్‌ఆర్ విగ్రహానికి నిప్పు పెట్టారు. సీతకొండ వద్ద ఆనాడు వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ది చెసిన వ్యూపాయింట్‌కు వైయస్‌ఆర్ పేరు పెడితే దానిని ధ్వంసం చేశారు. రైతుభరోసా కేంద్రాలు, ఆరోగ్యశ్రీ పథకాలకు వైయస్ఆర్ పేరును తొలగించారు. ఇప్పుడు విశాఖ అంతర్జాతీయ స్టేడియంకు ఉన్న వైయస్‌ఆర్ పేరును కూడా తీసేసేందుకు కుట్ర చేస్తున్నారు. ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్న నేపథ్యంలో అందోళనలు చేయకుండా సంయమనం పాటిస్తున్నాం. స్టేడియం వద్ద నిరసనలు తెలియచేస్తామని చెప్పడంతో వైయస్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు గృహనిర్భందంలోకి తీసుకున్నారు. అర్థరాత్రి సమయాల్లో నేతల ఇళ్ళకు వెళ్ళి పోలీసులు హంగామా సృష్టించడం దారుణం. ఏసీసీలో తిష్ట వేసిన టీడీపీ ఎంపీల వత్తిడితోనే... స్టేడియంలో నూతనంగా నిర్మించిన ఆర్చీ, స్టేడియంకు చెందిన ఫసాట్ లలో వైయస్‌ఆర్ పేరు లేకుండా చేశారు. వైయస్‌ఆర్ పేరును ఎందుకు పెట్టలేదో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ వివరణ ఇవ్వాలి. ప్రస్తుతం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌లోని రెండు కీలక పదవుల్లో టీడీపీకి చెందిన ఎంపీలు ఉన్నందునే ఈ దుర్మార్గానికి ఒడిగట్టారా? బీసీసీఐ నిబంధనల ప్రకారం రాజకీయ పదవుల్లో ఉన్నవారు క్రికెట్ అసోసియేషన్‌లకు బాధ్యత వహించకూడదు. దానిని కూడా ఉల్లంఘించి, టీడీపీ ఎంపీలు ఎసిఎను కైవశం చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం వైయస్‌ఆర్ పేరును చూస్తేనే ఉలిక్కిపడుతోంది. వైయస్ రాజశేరరెడ్డి గారు సీఎంగా పనిచేసిన సమయంలో విశాఖపట్నంను ఎంతో అభివృద్ధి చేశారు. బీఆర్‌టీఎస్ వ్యవస్థను అభివృద్ది చేశారు. ఐటీహిల్స్, ఆరిలోవలో ఉన్న హెల్త్ సిటీ, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేశారు. బీహెచ్‌పీవి వంటి ప్లాంట్‌లను పరిరక్షించారు. షిప్‌యార్డ్ కు అండగా నిలిచారు. విశాఖట్నంను ఆర్థిక కేపిటల్‌గా తీర్చిదిద్దారు. ఆయన కృషిని గుర్తించి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఈ ప్రాంతంలోని స్టేడియంకు వైయస్ రాజశేఖరరెడ్డి గారి పేరు పెడితే ఇప్పుడు దానిని కూడా తొలగించేందుకు సిద్దమయ్యారు. జగన్ గారి సీఎంగా ఉన్నపుడు ఎన్టీఆర్ పేరును కొత్తగా కృష్ణాజిల్లా నుంచి ఏర్పాటైన జిల్లాకు పెట్టారు. నాలుగుసార్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు ఏనాడైనా ఎన్టీఆర్ పేరును ఒక జిల్లాకు పెట్టాలని ఆలోచన చేశారా? ఎన్టీఆర్ చావుకు కారకుడైన చంద్రబాబు ఆయన పేరుకు గౌరవం ఎలా ఇస్తారు? కనీసం ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కూడా ఏనాడు కోరుకోలేదు. వైయస్ జగన్ గారి నేతృత్వంలో నాలుగున్నర లక్షల మంది క్రీడాకారులను ఆడుదాం ఆంధ్రా పేరుతో నిర్వహించాం. నాలుగు సార్లు సీఎంగా చేసిన చంద్రబాబు క్రీడలను ప్రోత్సహించిన పాపాన పోలేదు.