తాడేపల్లి: కూటమి ప్రభుత్వం వైయస్‌ఆర్‌సీపీ నాయకులపై కక్షసాధింపులో భాగంగా లేని లిక్కర్ స్కాంను ఒక పథకం ప్రకారం సృష్టించిందని వైయస్‌ఆర్‌సీపీ లీగల్‌సెల్ అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. లిక్కర్ స్కాం పేరుతో కూటమి ప్రభుత్వమే ఒక భారీ కుట్రకు శ్రీకారం చుట్టి, వైయస్‌ఆర్‌సీపీ నేతలను దానికి బాధ్యులుగా చూపించేందుకు దుర్మార్గమైన ప్రణాళికను అమలు చేస్తోందని మండిపడ్డారు. ఈ స్కాం పేరుతో జరుగుతున్న హంగామాను పరిశీలిస్తే కూటమి ప్రభుత్వం ఎంత నిస్సిగ్గుగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పుడు కేసులు బనాయించేందుకు ప్రయత్నం చేస్తోందో తెలుస్తుందన అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని, సోషల్ మీడియా యాక్టివీస్ట్‌లను తప్పుడు కేసులు బనాయించి వేధించిన ప్రభుత్వం, తాజా మరో భారీ కుట్రకు తెరతీసింది. వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో రూ.4వేల కోట్ల లిక్కర్‌స్కాం జరిగిందంటూ ఒక ప్రణాళిక ప్రకారం కూటమి ప్రభుత్వం ఈ కుట్రను అమలు చేస్తోంది. 2014-19లో తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన మద్యం పాలసీలో అనేక అవినీతి అక్రమాలు జరిగాయి. డెబ్బైశాతం బ్రాండ్లను ఎంపిక చేసిన నాలుగు కంపెనీలకే ఇచ్చారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని తగ్గించాయి. ఈ వ్యవహారంలో కోట్ల రూపాయలు చేతులు మారాయి. వీటిపై వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం 2023లో కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడగానే అధికారులపై వత్తిడి తెచ్చి ఆ కేసులో నమోదైన ఎఫ్ఐఆర్‌ను పక్కకు పెట్టేయించారు. ఈ కేసుల్లోంచి ఇప్పుడు బయటపడేందుకు వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన మద్యం పాలసీపై ఎదురుకేసులు నమోదు చేయించేందుకు కూటమి ప్రభుత్వం తెగబడింది. కూటమి పెద్దల డైరెక్షన్‌లోనే ఫిర్యాదు వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంపై లిక్కర్ స్కాం పేరుతో కేసులు నమోదు చేసి కక్షసాధించేందుకు కూటమి పెద్దల డైరెక్షన్‌లోనే శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా 9.9.2024న వై.వెంకటేశ్వర శ్రీనివాస్ అనే వ్యక్తి రిజిస్టర్ పోస్ట్ ద్వారా రెవెన్యూ, ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఒక లేఖ రాశారు. ఈ వ్యక్తి తన లేఖలో వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున లిక్కర్ పాలసీలో అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నాయని, ఢిల్లీ లిక్కర్ స్కాం కన్నా పెద్ద స్కాం జరిగిందని ఆరోపణలు చేశారు. ఏ ఆధారాలతో ఈ ఆరోపణలు చేశారో, ఈ వ్యక్తికి ఉన్న విశ్వసనీతయ ఏమిటో కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. ఈ లేఖను కోట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పోరేషన్ లిమిటెడ్‌లో అంతర్గత విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ ఆఘమేఘాల మీద ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా ఒక మెమోను జారీ చేశారు. తొమ్మిది రోజుల్లోనే ఈ మెమోను ఆధారం చేసుకుని బేవరేజెస్ కార్పోరేషన్ నుంచి వచ్చిన నివేదికలో గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగాయని నిర్ధారిస్తూ, దీనిపై విచారణ జరపాలంటూ ముఖేష్ కుమార్ మీనా 20.9.2024న సీఐడీకి ఫిర్యాదు చేశారు. వెంటనే సీఐడీ అధికారులు దీనిపై 23.09.2024న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్‌ను పరిశీలిస్తే దీనిలో ఎవరిని విచారించారు, ఏ అంశాలను పరిశీలించారు, ఎటువంటి ఫైళ్ళను తనిఖీ చేశారు అనే కనీస సమాచారం కూడా లేదు. అంతేకాకుండా ఈ ఎఫ్ఐఆర్ నెం.21/2024లోని కాలమ్ నెంబర్ 7లో ముద్దాయిలు అని ఉన్న చోట 'గుర్తు తెలియని వ్యక్తులు' అని కోట్ చేశారు. అలాగే మొత్తం రూ.4000 కోట్లకు పైగా అవినీతి జరిగినట్లుగా ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. ఇంత మొత్తం ఎలా అవినీతి జరిగిందో దానికి సంబంధించిన ప్రాథమిక వివరాలను కూడా ఎఫ్ఐఆర్‌లో నమోదు చేయలేదు. తెలుగుదేశం వీరవిధేయులతో సిట్ ఏర్పాటు సాధారణంగా ఏదైనా భారీ అవినీతి అక్రమాలపై ఫిర్యాదులు వచ్చినప్పుడు సంబంధిత అంశాలపై ఆడిట్ రిపోర్ట్ లను పరిశీలిస్తారు. విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తారు. అటువంటివి ఏమీ లేకుండా ఒక సాధారణ వ్యక్తి లేఖ రాస్తే, దానిపై తొమ్మిది రోజుల్లో నివేదిక తెప్పించుకుని, తక్షణం సీఐడీకి ప్రిన్సిపల్ సెక్రటరీ ఫిర్యాదు చేయడం, రెండు రోజుల్లో సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం చూస్తేనే దీని వెనుక కూటమి ప్రభుత్వ పెద్దలు నడిపిస్తున్న నాటకం అర్థమవుతుంది. అంతేకాదు సీఐడీ ఏకంగా అయిదుగురు అధికారులతో ఈ కేసుపై విచారణకు సిట్‌ను ఏర్పాటు చేసింది. తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి వీరవిధేయులుగా ఉన్న ఆఫీసర్‌లను ఏరికోరీ మరీ ఈ సిట్‌లో నియమించారు. సిట్‌ను నియమించే సందర్బంలో సుప్రీకంకోర్ట్ సూచించిన ఏ మార్గదర్శకాలను కూడా పాటించలేదు. సిట్‌కు సంబంధించిన పోలీస్‌స్టేషన్ ను పేర్కొనలేదు. అందులో సీసీటీవీ కెమేరాలను ఏర్పాటు చేసి, స్టేట్‌మెంట్లు రికార్డు చేసే సమయంలో దానిని చిత్రీకరించాలన్న నిబంధనలను పట్టించుకోలేదు. బేవరేజెస్ కార్పోరేషన్‌కు సంబంధించిన ఫైళ్ళ రూటింగ్‌ను పరిగణలోకి తీసుకోలేదు. కార్పోరేషన్ ఉద్యోగులను బెదిరించి, భయపట్టి సిట్ తాము రాసుకున్న స్టేట్‌మెంట్లపై సంతకాలు చేయించుకుంది. తాము చెప్పినట్లు కొందరి పేర్లు లిక్కర్ స్కాంలో ఉన్నాయని చెప్పకపోతే మీ ఉద్యోగాలు ఉండవు, ఈ కేసులో జైలుకు వెళ్ళాల్సి వస్తుందంటూ బెదిరించారు. సంతకాలు పెట్టిన ఉద్యోగులు తాము సాక్ష్యులమా, లేక ముద్దాయిలమా అని భయాందోళనలు చెందుతున్నారు. అలాగే డిస్టలరీ కంపెనీలను సిట్ అధికారులు బెదిరించి తమకు అనుకూలమైన స్టేట్‌మెంట్లపై సంతకాలు చేయించుకుంటున్నారు. ముందు బురదచల్లడం... తరువాత ముద్దాయిలుగా చూపడం లిక్కర్ పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో ముద్దాయిల కాలమ్‌లో ఎవరి పేర్లు లేకపోయినప్పటికీ వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ మిధున్‌రెడ్డి పేరు ఉన్నట్లు ఎల్లో మీడియాకు లీకులు ఇస్తున్నారు. ఎల్లో మీడియాలో దీనిపై బుదరచల్లేలా ప్రముఖంగా వార్తలు రాయించారు. దర్యాప్తునకు సంబంధించిన అంశాలను ఎప్పటికప్పుడు ఎల్లో మీడియాకు లీకులు ఇస్తూ, తాము ఎవరినైతే ఈ కేసులో ఇరికించాలని భావిస్తున్నారో వారిపై తప్పుడు కథనాలను రాయిస్తూ, ఆ తరువాత వారిని ముద్దాయిలుగా చూపే కుట్ర జరుగుతోంది. లిక్కర్ పాలసీ ప్రకారమే బేవరేజెస్ కార్పోరేషన్ పనిచేసింది. జగన్ గారి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కొత్తగా ఏ డిస్టలరీకి అనుమతులు ఇవ్వలేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో అనుమతులు పొందిన డిస్టలరీల నుంచే కొనుగోళ్ళు చేసింది. మద్యంను నియంత్రించేందుకు ఒక పారదర్శక విధానాన్ని అమలు చేసింది. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం మద్యంపై అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ తప్పుడు కేసులతో వేధింపులకు పాల్పడాలనే లక్ష్యంతో పనిచేస్తోంది.