వైయస్ఆర్ జిల్లా : ఏపీలో మైనార్టీలను చంద్రబాబు పూర్తిగా విస్మరించారని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మండిపడ్డారు. కూటమి సర్కార్ నిర్లక్ష్యం కారణంగానే విజయవాడ నుంచి హజ్ యాత్ర పాయింట్ తొలగించారన్నారు. వైయస్ఆర్‌సీపీ హయాంలో కష్టపడి విజయవాడ పాయింట్ సాధించినట్టు తెలిపారు. గురువారం కడప నగరంలో మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మీడియాతో మాట్లాడుతూ..‘విజయవాడ నుంచి హజ్ యాత్ర పాయింట్ తొలగించడం సరికాదు. వైయస్ఆర్‌సీపీ హయాంలో కష్టపడి విజయవాడ పాయింట్ సాధించాం. మైనార్టీలను చంద్రబాబు పూర్తిగా విస్మరించారు. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే పాయింట్ తొలగించారు. గతంలో మన రాష్ట్రం నుండి హజ్ యాత్రకు వెళ్లాలంటే వేరే ప్రాంతాల నుండి వెళ్ళేవారు. 2019లో కూడా హైదరాబాద్ పాయింట్ నుండి హాజీలు యాత్రకు వెళ్లారు. అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం మన రాష్ట్ర హజీలకు సరైన సదుపాయాలు కల్పించలేదు. ఆ తర్వాత మన రాష్ట్రం నుండే హజీలను హజ్ యాత్రకు పంపించాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగింది. దీంతో, 2020లో మన రాష్ట్రం విజయవాడ నుండి యాత్రకు పాయింట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2020, 2021 రెండేళ్లు కరోనా నేపథ్యంలో హజ్ యాత్ర జరగలేదు. 2022లో కూడా తక్కువ మందిని మాత్రమే అక్కడి ప్రభుత్వం అనుమతించింది. 2023లో కేంద్ర ప్రభుత్వానికి అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం లేఖ రాయడం జరిగింది. 2023లో మన రాష్ట్రం నుండి విజయవాడ వద్ద పాయింట్ నుంచే 1813 మంది హజ్ యాత్రకు వెళ్లారు. అదనపు భారాన్ని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం భరించేలా ఉత్తర్వులు జారీచేసింది. ఇంత కష్టపడి సాధించిన యాత్ర పాయింట్‌ను తీసేయడం బాధాకరం. ఇది కేవలం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం మాత్రమే. మైనార్టీ వర్గాలను ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా విస్మరించారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.