మీరు చేస్తే దైవాశ్సీలు..మేం చేస్తే లాబీయింగా?

వైయ‌స్ఆర్‌సీపీ రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్ వైవీ సుబ్బారెడ్డి

సీఎం వైయ‌స్ జగన్‌పై ఎల్లో పత్రికలు బురద జల్లడమే పనిగా పెట్టుకున్నాయి

స్వామీజీలు, దేవుళ్ల విష‌యంలో నీచ రాజ‌కీయాలు వ‌ద్దు

విజయ్ కుమార్‌ స్వామిని తెచ్చుకున్నది మీరే..

 మార్గదర్శి కేసు నుంచి బయట పడేసేందుకు మీరు తెచ్చుకున్నారా..?

వివేకా హ‌త్య కేసులో సీబీఐ విచారణ పక్షపాత ధోరణిలో జరుగుతోంది

అంతిమంగా న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం

మీడియా స‌మావేశంలో  వైవీ సుబ్బారెడ్డి  

తాడేప‌ల్లి:  ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై కొన్ని పత్రికలు బురద జల్లడమే పనిగా పెట్టుకున్నాయని వైయ‌స్ఆర్‌సీపీ రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్‌ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు.  ప్రభుత్వంపైన, దేవుళ్లపైన తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.  విజయ్‌కుమార్‌స్వామి విజయవాడ ఎవరి విమానంలో వచ్చారు? రామోజీ వియ్యంకుడి విమానంలోనే ఆయన వచ్చార‌ని తెలిపారు. రామోజీ బంధువు ప్రత్యేక విమానంలో వాళ్ల కార్యక్రమం కోసమే స్వామి వచ్చారు. విజయ్‌కుమార్‌ స్వామిని తెచ్చుకున్నది మీరే. మీ మార్గదర్శి కేసు నుంచి బయట వేయించుకునేందుకు తెచ్చుకున్నారా? అని వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. మీరు చేస్తే దైవాశీస్సులు? మేం చేస్తే లాబీయింగా? అని నిల‌దీశారు. మంగ‌ళ‌వారం తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. 

వైవీ సుబ్బారెడ్డి ఏమన్నారంటేః

ఎల్లో మీడియా దుర్మార్గపు రాతలుః
    ఎల్లోమీడియా పత్రికలు, ఛానెళ్లు విజయకుమార్‌ స్వామి గురించి రకరకాల కథనాలను ప్రచారం చేస్తున్నాయి. విజయకుమార్‌ స్వామిని లాబీయిస్టుగా పోలుస్తూ,  లాబీయింగ్‌కు వాడుకుంటున్నామని  దుర్మార్గమైన రాతలు రాస్తున్నారు. అంటే,  స్వామిజీలను, దేవుళ్లను వారి స్వార్థ రాజకీయాలకు వాడుకునే దిగజారుడు కార్యక్రమానికి ఎల్లోమీడియాతో పాటు, ఆ పత్రికలు ఎవరినైతే కొమ్ముకాస్తున్నాయో వారే ఈ కథనాలను రాయిస్తున్నారనేది అందరూ గమనిస్తున్నారు. వీరి రాతల యొక్క ముఖ్య ఉద్దేశమేమంటే, జగన్‌మోహన్‌రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నపళంగా దిగిపోవాలని కలలు కంటూ, చంద్రబాబును అర్జెంట్‌గా అధికారంలోకి తీసుకురావాలని.. ఆ తర్వాత దోచుకోవచ్చు, పంచుకోవచ్చనేది వారి ఆరాటంగా కనిపిస్తుంది. ఎల్లోమీడియా నీచమైన రాతల్ని ఖండిస్తున్నాం.

ఆ ప్రత్యేక విమానం రామోజీ బంధువుదే కదా..
    ఈ సందర్భంగా ఈ అంశంపై నేను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను. 
- అసలు విజయకుమార్‌ స్వామి ఎవరిద్వారా విజయవాడకు వచ్చారు..? ఇక్కడకు ఎందుకు వచ్చారు..? 
- ఆయన ప్రత్యేక విమానంలో వచ్చారు కదా.. ఆ విమానం ఎవరిది..? 
- ఆయన వచ్చిన విమానం రామోజీరావు బంధువు (వియ్యంకుడు) నవయుగ విశ్వేశ్వరరావుదే కదా.. 
- ఆయనతో పాటు విశ్వేశ్వరరావు కొడుకు శశిధర్, విజయకుమార్‌ స్వామి ఉంది నిజం కాదా..?

మరి మీరు.. మార్గదర్శి కేసుల నుంచి బయటపడేందుకే స్వామీజీని  పిలిపించారా..?
    అసలు, రామోజీరావు బంధువు విమానంలో విజయకుమార్‌స్వామిని ఎందుకు ఇక్కడకు తెచ్చుకున్నారనేది మాకు తెలియదు. కానీ, ముఖ్యమంత్రి గారికి ఆశీస్సులు అందజేయడాన్ని.. లాబీయింగ్‌ అని పేరుపెట్టి అదే రామోజీ మీడియాలో కథనాలు రాయడం ఎంత దుర్మార్గమో అందరూ ఆలోచించాలి. అసలు, మీరు విజయకుమార్‌ స్వామిని విజయవాడకు ఎందుకు తీసుకొచ్చారు..?. 
-  మీ మార్గదర్శి కేసుల నుంచి బయట వేయించుకునే కార్యక్రమానికి తెచ్చుకున్నారా..?. 
- ఇదే రామోజీరావు బంధువులు 2017–18లో హైదరాబాద్‌లో గృహప్రవేశం జరిగితే, విజయకుమార్‌స్వామి కూడా వచ్చారు. అప్పుడు కూడా నవయుగ విశ్వేశ్వరరావు, శశిధర్‌తో వచ్చారు కదా..? మరి, అప్పుడు ఎందుకు వచ్చారనుకోవాలి. - మీరు చేసేవన్నీ దైవకార్యాలనుకోవాల్నా..?  దానికి సమాధానం చెప్పండి..? ఇంత నిసిగ్గుగా కథనాలు రాస్తారా..? 

ముఖ్యమంత్రిగారికి స్వామీజీల ఆశీస్సులు ఇప్పిస్తే తప్పేంటి..?
    నాకు 2007 నుంచి విజయ్‌కుమార్‌ స్వామితో పరిచయం ఉంది. నాకు చాలామంది స్వామీజీలు తెలుసు. ఈ విజయకుమార్‌ స్వామి అంటే నాకు ప్రత్యేక గౌరవం ఉంది. ఆయన మంచి భక్తిపరులు. ఎల్లోమీడియా ప్రచురించినట్లు ఆ స్వామివారితో మాజీ రాష్ట్రపతులు, ప్రస్తుత రాష్ట్రపతితోనూ పరిచయాలున్నట్లు అందరికీ తెలిసిందే కదా.. ఆ విధంగా నాకున్న పరిచయంతో మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కూడా కలపాలని తీసుకెళ్లాను. ముఖ్యమంత్రి గారికి స్వామివారి ఆశీస్సులు ఉంటే రాష్ట్రానికి, ప్రజలకు మేలు కలుగుతుందని భావించాను. దానికోసమే నేను ఎంతోమంది స్వామీజీలను తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారికి కలిపిన సందర్బాలు అనేకం ఉన్నాయి. అందులో భాగంగానే చినజీయర్‌స్వామిని, స్వరూపానంద స్వామివారిని, మంత్రాలయం రాఘవేంద్ర మఠం స్వాములను, తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీశైలం, కనదుర్గమ్మ దేవస్థానం వేదపండితుల్ని పిలిపించి ఆశీర్వచనాలు ఇప్పించాను. విజయకుమార్‌ స్వామి గారు విజయవాడకు వస్తున్నారని తెలిసి.. నేను ప్రత్యేకంగా ఆయన్ను రిక్వెస్టు చేసినమీదట వారు అందుకు అంగీకరించారు. నేను ఆరోజు విజయవాడలో లేనప్పటికీ, ఏర్పాట్లు అన్నీ చేయడంతో స్వామివారు వచ్చి ముఖ్యమంత్రి గారికి ఆశీస్సులు అందించి వెళ్లారు. 

మీకైతే ఆశీస్సులు.. మాకైతే లాబీయింగా..?
    స్వామీజీలపై వాళ్లకు నమ్మకం ఉందో లేదో మాకు తెలియదు. మాకైతే పూర్తిగా నమ్మకం ఉంది. ముఖ్యమంత్రికి, రాష్ట్రానికి, ప్రజలకు మేలు కలుగుతుందనే నమ్మకంతోనే..  మేం స్వామీజీల ఆశీస్సులు తీసుకుంటాం. మేమేదో లాబీయింగ్‌ చేస్తున్నామంటున్నారు కదా.. మరి, ఈ రామోజీరావులాంటి వాళ్లు ఏం చేయడానికి విజయకుమార్‌ స్వామిని రప్పించుకున్నారు. మేము స్వామివారి ఆశీస్సులు తీసుకుంటే.. దానికి లాబీయింగ్‌ అని పేరెట్టి దుర్మార్గపు రాతలు రాస్తారా..?.
- అదే, మీ కోసం స్వామీజీలు వస్తే..  దానికి దైవాశీస్సులు అని పేరుపెట్టి చెప్పుకుంటారా..?. 
- ఎల్లో మీడియా వక్రభాష్యాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతుంది. ప్రజలు మిమ్మల్ని ఛీ కొట్టకముందే..  ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోండి. 

- విజయకుమార్‌ స్వామి వారు చాలా సింపుల్‌గా ఉండే వ్యక్తి. ఎవరి అవసరాలకు తగ్గట్టు వారు ప్రత్యేక విమానాల్లో ఆయన్ను తెచ్చుకుంటూ ఉంటారు గానీ అది మాకు సంబంధంలేదు. ఆయన మైసూరులో ఉంటారు. 2007 నుంచి ఆయనపై నమ్మకంతో నేను కలుస్తూ ఉంటాను.  విజయకుమార్‌ స్వామి వారంటే ఒక దైవాంశసంభూతులుగా మాకు నమ్మకం. కనుక, ఎల్లోమీడియాకు చెందిన ఒక పత్రిక రాసిందని, తర్వాతి రోజు మరో పత్రిక కథనాలు రాయడాన్ని ఖండిస్తున్నాను. రాజకీయలబ్ధి కోసం నీచకార్యక్రమాలకు పాల్పడవద్దని ఎల్లోమీడియా పత్రికలకు, టీడీపీ నేతలకు హితవు పలుకుతున్నాను. 

వ్యక్తుల టార్గెట్ గా దర్యాప్తుః
        వివేకానందరెడ్డి గారి హత్యకేసులో ఒక పక్షపాతధోరణితో సీబీఐ విచారణ జరుగుతున్నట్లు కొన్ని ఆధారాలు, పరిస్థితులు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ముందునుంచీ అవినాశ్‌రెడ్డి చెప్పే వాదనలను సీబీఐ పట్టించుకోకపోవడం.. ఎల్లోమీడియా కథనాల ప్రకారం సీబీఐ నడుస్తుందనే అభిప్రాయం ఉంది. ఇది కళ్లముందు జరుగుతున్న వాస్తవం. రాజకీయకోణంలో ఒకరిద్దరు వ్యక్తుల్ని టార్గెట్‌ చేసినట్లే సీబీఐ వ్యవహరిస్తుందనేది ఇప్పటికే అవినాశ్‌రెడ్డి కోర్టు దృష్టికి కూడా తెచ్చారు. ఏదిఏమైనా ఈ కేసులో నిజనిజాలు నిగ్గుతేలాలి. న్యాయవ్యవస్థపై మాకు పూర్తిగా నమ్మకం ఉంది. 

Back to Top