అమరావతి: ఆంధ్రప్రదేశ్‌క ప్రత్యేక హోదా కల్పించాలంటూ గత ఐదేళ్ల కాలంలో ఉద్యమాలు చేసిన వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ..ఇదే నినాదంతో ముందుకు వెళ్తోంది. ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రత్యేక హోదానే ప్రధాన ఎజెండాగా పోరాటం చేయనుంది. అలాగే పోలవరానికి రావాల్సిన నిధులు, విభజన హామీలే లక్ష్యంగా పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీలు కేంద్రాన్ని కోరనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా హైదరాబాద్ ఆదాయాన్ని కోల్పోతున్న 13 జిల్లాల నవ్యాంధ్రకు ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని 2014లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ప్రకటించారు. ఆ తర్వాత నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారు. అయితే, ప్లానింగ్ కమిషన్‌ను తీసేసిన మోదీ.. నీతి ఆయోగ్‌ను తీసుకొచ్చారు. నీతి ఆయోగ్ సూచనల ప్రకారం.. దేశంలోని ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యంకాదని మోదీ ప్రభుత్వం చెప్పడంతో ఏపీలో ఆందోళనలు వెల్లువెత్తాయి. అప్పుడు ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టింది. దీంతో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి హోదా కోసం పోరాటం చేసింది. వైయస్ జగన్ మోహన్ రెడ్డి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమించి ఇప్పటికీ ఈ డిమాండ్ సజీవంగా ఉందంటే అది ఆయన పోరాట ఫలితమే అని చెప్పవచ్చు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్రంలో 151 సీట్లతో గెలుపొంది ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. 25 ఎంపీ స్థానాలకు గాను 22 చోట్ల వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు గెలుపొందారు. సీఎం హోదాలో ఢిల్లీకి వెళ్లిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధానిని కోరారు. హోదా ఇచ్చే వరకు అడుగుతూనే ఉంటామని చెప్పారు. ఈ క్రమంలో శీతాకాల సమావేశాల సందర్భంగా మరోమారు ప్రత్యేక హోదాపై ఉద్యమించాలని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలకు నిన్న వైయస్ జగన్ దిశానిర్దేశం చేశారు. అలాగే రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్‌లో పట్టుబట్టాలని సూచించారు. ఈ దిశగా వైయస్‌ఆర్ సీపీ ఎంపీలు పార్లమెంట్ సమావేశాలకు సిద్ధమవుతున్నారు. Read Also: టీడీపీ నేతలు హత్యా రాజకీయాలు మానుకోవాలి