తాడేపల్లి: తాజాగా లిక్కర్ స్కాం అంటూ చేస్తున్న హంగామా అంతా కూటమి సర్కార్ సృష్టించిన బేతాళ కథ అని వైయస్ఆర్‌సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గాలినంతా పోగుచేసి ప్రభుత్వం తప్పుడు కేసులకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస ఆధారాలు లేని ఈ కేసులో అక్రమ అరెస్ట్‌లు చేస్తున్నారని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై నమోదైన కేసులకు కౌంటర్‌గా చంద్రబాబు డైరెక్షన్‌లో ఈ లిక్కర్ స్కాంను సృష్టించారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే... గతంలో తెలుగుదేశం పాలనలో మద్యం కుంభకోణం జరిగితే దానిమీద వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విచారణ జరిపి కేసు పెట్టడం జరిగింది. దానిమీద దర్యాప్తులో నేటి ముఖ్యమంత్రి చంద్రబాబును ఏ-3 గా చేర్చడం జరిగింది. ఎక్సైజ్ శాఖ మంత్రి, ఐఏఎస్ అధికారి కూడా ఇందులో నిందితులుగా ఉన్నారు. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దానికి కౌంటర్‌గా అదే అంశాలతో కక్షకట్టి వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కాం అంటూ కొత్త డ్రామాను తెరమీదికి తీసుకువచ్చారు. ఊరూపేరూ లేని వెంకటేశ్వర శ్రీనివాస్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసులు నమోదు చేశారు. ఆయనేమన్నా విజిల్ బ్లోయరా? లిక్కర్ కేసులతో అతనికేం సంబంధమో తెలియదు. 09.09.2024న రిజిస్టర్ పోస్టు ద్వారా ఢిల్లీ స్కాం కంటే ఎక్కువ స్కాం ఇక్కడ జరిగిందని ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌కు సదరు వ్యక్తి లేఖ పంపితే అదే రోజు స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు విచారణ చేయమని ఆదేశించారట. ఎవరెవర్ని విచారించారో తెలియదు కానీ, కేవలం 9 రోజుల్లోనే రూ. 4 వేల కోట్ల కుంభకోణం జరిగిందని రిపోర్టు ఇచ్చారు. ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనాకి 18.09.2024న ఈ రిపోర్ట్ సమర్పిస్తే, దీనిపై 23.09.2024న ఎఫ్ ఐఆర్ నమోదు అయ్యింది. ఈ విచారణలో అధికారులు 9 రోజుల్లో ఎవరెవర్ని విచారించారు, ఏ రికార్డులు పరిశీలించారు, ఏవేం ఆధారాలు సేకరించారో చెప్పకుండా ఎఫ్ ఐఆర్ కాలమ్‌లో ముద్దాయిల వివరాల దగ్గర అన్‌నోన్ అక్యూజ్డ్ అని మాత్రం రాశారు. ముందుగానే కేసు నమోదు చేసి రాజకీయ కక్షతో ఎవరిని వేధించాలో నిర్ణయించుకున్న తర్వాత వారిని ఇప్పుడు ఎంపిక చేసుకుని ముద్దాయిలుగా చేరుస్తున్నారు. లేఖను చూపించి కేసులు నమోదు సాధారణంగా ఫిర్యాదుదారుడు పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కేసు నమోదు చేయడమో, లేదా ఎస్పీని కలవడమో, అదీ కాదంటే హైకోర్టుకు పోయి తన వద్ద ఉన్న ఆధారాలతో విజిలెన్స్ విచారణ కోరడం జరుగుతుంది. ఇలాంటి సహజ విధానాలకు విరుద్ధంగా ఒక లెటర్ రాయించడం, దాన్ని రిజిస్టర్ పోస్టు ద్వారా పంపిస్తే దాని ఆధారంగా సీఐడీ వారు హడావుడిగా సిట్ ఏర్పాటు చేసి కేసు రిజిస్టర్ చేయడం, విచారణకి ఆదేశించడం.. అక్రమ కేసులు బనాయించడం లాంటివన్నీ చకచకా జరిగిపోయాయి. వైయస్ఆర్‌సీపీ హయాంలో జరగని, లేని, మద్యం స్కాంపై చంద్రబాబు వెనకుండి ఇదంతా నడిపిస్తున్నారు. విజిలెన్స్ విచారణ జరిపి ఆధారాలతో నిందితులపై కేసులు నమోదు చేయండని ఎక్కడా ఆయన ఆదేశించలేదు. కేవలం ఒక లెటర్ ఆధారంగా ప్రభుత్వం అన్ నోన్ అక్యూజ్డ్ పేరుతో తమకు నచ్చిన వారిని వేధించడమే లక్ష్యంగా కేసులు నమోదు చేయడమే పనిగా పెట్టుకుంది. తర్వాత కాలంలో ఒక్కొక్కర్ని అరెస్ట్ చేసుకుంటూ పోతున్నారు. ఏపీఎస్‌బీసీఎల్ ఉద్యోగులను ఎవర్ని విచారిస్తున్నారో, ఎవర్ని ముద్దాయిలుగా చేరుస్తున్నారో, ఎవర్ని సాక్షులుగా చేరుస్తున్నారో వారికే అర్థం కాని పరిస్తితి. ఏపీఎస్‌బీసీఎల్ ఎండీ వాసుదేవరెడ్డిని చాలాకాలం ముద్దాయిగా చేర్చారు. నన్ను బెదిరిస్తున్నారు, తప్పుడు వాంగ్మూలం ఇవ్వమని వేధిస్తున్నారని ఆయన కోర్టుల ద్వారా పోరాటం చేశారు. ఆయనపాటు ఏపీఎస్‌బీసీఎల్ ఉద్యోగి సత్యప్రసాద్, మరికొందరు ఉద్యోగులను బెదిరించి వారి నుంచి 164 స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. కనీసం పోలీస్ స్టేషన్ కూడా లేకుండా సిట్ ఏర్పాటు సిట్ ఏర్పాటు చేసిన తర్వాత దానికంటూ ఒక పోలీస్ స్టేషన్ ఉండాలి. కానీ ఉద్దేశపూర్వకంగా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయలేదు. ముద్దాయిల్ని ఎక్కడ విచారిస్తున్నారో చెప్పడం లేదు. అలా చేస్తే సీసీ కెమెరాల్లో రికార్డు అవుతుందని, విచారణకు ఎవరెవరు వస్తున్నారో తెలిసి పోతుందని నిబంధనలను సైతం ఉల్లంఘించారు. గౌరవంగా బతుకుతున్న డిస్టిలరీ యజమానులను విచారణ పేరుతో పిలిపించి వేధింపులకు గురిచేస్తున్నారు. కన్ఫెషన్ స్టేట్‌మెంట్ల మీద సంతకాలు తీసుకోవడానికి సిట్ నానా రకాల చర్యలకు పాల్పడుతోంది. అస్తవ్యస్తంగా సిట్ దర్యాప్తు నేర విచారణ ప్రక్రియలో సిట్ చట్టవిరుద్దంగా వ్యవహరిస్తుంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘిస్తోంది. పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసుకోకపోగా అధికారులను కూర్చోబెట్టుకుని బెదిరింపులకు దిగుతున్నారు. ఎక్కడ విచారిస్తున్నారో చెప్పడం లేదు. ఎక్కడెక్కడ తిప్పుతున్నారో అర్థం కావడం లేదు. పోలీసులు చెప్పిన విధంగా సాక్ష్యం ఇవ్వకపోతే గౌరవంగా వ్యాపారాలు చేసుకునే వారిని కూడా ముద్దాయిలుగా చేరుస్తామని బెదిరిస్తున్నారు. గతంలో 2014-19 మధ్య చంద్రబాబు హయాంలో ఏడాదికి రూ. 1300 కోట్ల చొప్పున దాదాపు రూ. 5వేల కోట్ల మేర లిక్కర్ కుంభకోణం జరిగిందని కేసులు నమోదు చేయడం జరిగింది. దానిలో నాటి సీఎం చంద్రబాబును ఏ 3 గా నమోదు చేయడం జరిగింది. దానికి ప్రతీకారంగా నేటి కూటమి ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలు చేస్తోంది. మొదట రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేశారు. ఒకటిన్నర రోజుల తరువాత ఆయన్ను కోర్టులో హాజరు పరిచారు. ఆ సమయంలో ఆయన కన్ఫెషన్ స్టేట్ మెంట్ కూడా దానికి అటాచ్ చేశారు. ప్రభుత్వానికి మద్యం ద్వారా ఆదాయం వచ్చేలా, అదేవిధంగా పార్టీ ఫండ్ ఇవ్వాలని తనకు సూచించినట్టు రాజ్ కసిరెడ్డి వాంగ్మూలంలో రాశారు. కానీ దాని కింద రాజ్ కసిరెడ్డి సంతకం లేదు. మిథున్‌రెడ్డిని ఈ కేసులో కుట్రపూరితంగా చేర్చారు. న్యాయస్థానంలో హాజరుపరిచినప్పుడు కూడా మెజిస్ట్రేట్ ముందు తాను సంతకం చేయలేదని, అందులో ఇచ్చిన స్టేట్‌మెంట్ నాది కాదని రాజ్ కసిరెడ్డి స్పష్టంగా చెప్పారు. దాన్ని కూడా కోర్టు రికార్డు చేసింది. ఆయనతోపాటు చాణక్య, శ్రీధర్‌రెడ్డితో కూడా ఇదే విధంగా నేరాంగీకార పత్రాలు రాయించుకున్నారు. రిమాండ్ రిపోర్టులో వారు సంతకాలు చేయలేదని వారే చెబుతున్నారు. కానీ మధ్యవర్తుల మధ్య అంగీకరించారంటూ పేర్కొంటున్నారు. కానీ వారే నేరం చేసినట్టు అంగీకరించినట్టు, సంతకాలు చేసినట్టు ఎల్లో మీడియాలో విపరీతంగా విష ప్రచారం చేస్తున్నారు. ఈ కేసులో నాటి ఐఏఎస్ అధికారులను, సీఎం ఓఎస్డీని, ముఖ్యమంత్రి వైయస్ జగన్ పేర్లను ఉద్దేశపూర్వకంగా చేర్చి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. డైవర్షన్ పాలిటిక్స్‌తో ప్రజల్లో విష ప్రచారం చేస్తున్నారు. హామీలు నెరవేర్చకపోగా ప్రజలు వారిని ద్వేషిస్తుండటంతో ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్‌కి పాల్పడుతున్నారు. టీడీపీ హయాంలో అవినీతికి పక్కా ఆధారాలు గత తెలుగుదేశం ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చి మద్యాన్ని ఏరులై పారించింది. చంద్రబాబు కొన్ని కంపెనీలకే ప్రయోజనం కలిగించేలా వ్యవహరించారు. 53.21 శాతం మద్యం నాలుగు కంపెనీలే కొనుగోలు చేసినట్టు సీటెల్ అనే సాఫ్ట్‌వేర్ ద్వారా తెలిసింది. ఇప్పుడూ కొన్ని బ్రాండ్లను నాశనం చేసి కొన్ని కంపెనీలకే లబ్ధి చేకూర్చుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. 2014-19 మధ్య చంద్రబాబు సీఎంగా ఉండగా 2012 నుంచి అమల్లో ఉన్న ప్రైవేటు మద్యం దుకాణాలు, బార్లపై వసూలు చేసే ప్రివిలైజ్ ఫీజు నిబంధనలకు విరుద్ధంగా రద్దు చేసి ముడుపులు అందుకున్నారు. అందుకోసం చీకటి జీవో నెంబర్ 468 రిలీజ్ చేశారు. తద్వారా రాష్ట్ర ఖజానాకు ఏకంగా రూ. 5వేల కోట్లకుపైగా నష్టం చేకూర్చారు. ఎమ్మార్పీ కన్నా 20 శాతం ఎక్కువ పెంచి విక్రయించడం ద్వారా మద్యం సిండికేట్‌లో టీడీపీ నాయకులు దాదాపు రూ. 25 వేల కోట్లు సంపాదించిందని ఆనాటి పత్రికల్లో వచ్చిన ప్రధాన ఆరోపణ. స్వతంత్రంగా ఆడిట్ నిర్వహిస్తున్న కాగ్ తన నివేదికల్లో కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. చంద్రబాబు ముఠా బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో నాటి వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం హయాంలో ఆధారాలతో సహా కేసులు నమోదు చేయడం జరిగింది. ఆ కేసును కూటమి ప్రభుత్వం వచ్చాక అటకెక్కించారు. ఆ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించే దమ్ము చంద్రబాబుకి ఉందా? అమ్మకాలు తగ్గితే లంచాలొస్తాయా? కూటమి ప్రభుత్వం తాజాగా చెబుతున్న లిక్కర్ వ్యవహారంలో వాస్తవంగా స్కామ్ జరిగిందా? మద్యాన్ని ఎక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారా? తక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారా? మద్యం విక్రయాల్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా? లేక ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే లంచాలు ఇస్తారా? మద్యం విక్రయ వేళల్ని తగ్గిస్తే లంచాలు వస్తాయా? లేక వేళాపాలా లేకుండా అమ్మితే లంచాలు వస్తాయా? లిక్కర్ అమ్మే షాపులను పెంచితే లంచాలు ఇస్తారా? లేక షాపులను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? షాపులకు తోడు పర్మిట్ రూమ్‌లు, వాటితోపాటు బెల్టు షాపులుపెడితే లంచాలు ఇస్తారా? లేక బెల్టు షాపులు తీసేసి, పర్మిట్ రూమ్‌లు రద్దు చేస్తే లంచాలు ఇస్తారా? 2014-19లో చంద్రబాబు నిర్ణయించిన బేసిక్ రేట్లకు కాకుండా బేసిక్ రేట్లు పెంచి డిస్టలరీల నుంచి కొనుగోలు చేస్తే లంచాలు వస్తాయా? లేక అవే రేట్లు కొనసాగిస్తే లంచాలు వస్తాయా? మద్యంపై తక్కువ ట్యాక్సుల ద్వారా ఎక్కువ అమ్మకాలు చేసే విధంగా డిస్టలరీలకు మేలు చేస్తే లంచాలు వస్తాయా? లేక ట్యాక్సులు పెంచి, తద్వారా అమ్మకాలు తగ్గితే లంచాలు వస్తాయా? ఎంపిక చేసుకున్న 4-5 డిస్టలరీలకు మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? లేక అన్ని డిస్టలరీలకు దాదాపుగా సమాన స్థాయిలో ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? ఇప్పుడున్న డిస్టలరీలకు సింహభాగం అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో వస్తాయా? లేక ఏ ఒక్క డిస్టలరీకి అనుమతి ఇవ్వని వైయస్సార్సీపీ ప్రభుత్వంలో ఉన్నవారికి లంచాలు వస్తాయా? వీటిని సమాధానాలు చెబితే అసలు స్కామే జరగలేదని తెలుస్తుంది. వైయస్ఆర్‌సీపీ హయాంలో పారదర్శకంగా అమ్మకాలు 2019- 24 మధ్య వైయస్ఆర్‌సీపీ హయాంలో మద్యంలో సిండికేట్ విధానానికి అడ్డుకట్ట వేసింది. 33 శాతం మద్యం దుకాణాలు తీసేసింది. మద్యం దుకాణాలకు అనుబంధంగా ఉన్న 43వేల బెల్ట్ షాపులను, 4380 పర్మిట్ రూమ్‌లు రద్దు చేయడం జరిగింది. మద్యం ధరలను షాక్ కొట్టేలా పెంచింది. ఎక్సైజ్ నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు అమలు చేసింది. మద్యం అమ్మకాలు కట్టడి చేసేందుకు విక్రయాలు తగ్గించడానికి మద్యం విక్రయ వేళలను తగ్గించింది. ప్రతి ఊరికి ఒక మహిళా పోలీస్‌ను నియమించి మద్యం విక్రయాలను కట్టడి చేసింది. ఇంత పారదర్శకంగా మద్యం విదానానికి రూపకల్పన చేసింది. ఒకవైపు గత తెలుగుదేశం ప్రభుత్వంలో భారీ స్కాం మీరు చేసి.., ఇప్పుడు తప్పుడు ఆరోపణలతో అబద్దపు సాక్ష్యాలు సృష్టించి, బేతాళుడి మాదిరిగా ఒక కథ అల్లి, దాని చుట్టూ పెద్ద ఎత్తున ప్రచారం చేసి, వైయస్ జగన్ చుట్టూ ఉన్న వ్యక్తులను టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలి. నిబంధనలు ఉల్లంఘించి కూటమి నాయకుల రాజకీయ కక్షల్లో భాగం కావొద్దు. చట్టాలను ఉల్లంఘించిన వారు భవిష్యత్తులో చట్టం ముందు దోషులుగా నిలబడక తప్పుదు.