చిత్తూరు జిల్లా: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో దౌర్జన్యం పరాకాష్టకు చేరుకుంది. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నిక ఉత్కంఠను రేకెత్తించింది. వైయస్ఆర్‌సీపీకి సంఖ్యా బలం అధికంగా ఉన్నప్పటికీ.. ప్రలోభాలు, దౌర్జన్యాలతో ఎలాగైనా సరే ఆ పదవిని చేజిక్కించుకోవడానికి టీడీపీ బరితెగించింది. కౌన్సిలర్ల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేసింది. వైయస్ఆర్‌సీపీకి చెందిన డా. సుధీర్ కొద్ది నెలల క్రితం కుప్పం చైర్‌పర్సన్ పదవితో పాటు కౌన్సిలర్ పదవికి కూడా రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో నూతన చైర్‌పర్సన్‌ను ఎన్నుకునేందుకు సమావేశం నిర్వహించారు. ఇక్కడ మొత్తం 25 వార్డులకు గాను వైయస్ఆర్‌సీపీ 19, టీడీపీ కేవలం 6 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. సుధీర్ రాజీనామా చేసినప్పటికీ 18 మందితో వైయస్ఆర్‌సీపీ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. అయినప్పటికీ టీడీపీ నేతలు కొందరు బరితెగిస్తూ నేరుగా రంగంలోకి దిగారు. బెదిరింపులు, తాయిలాలతో కౌన్సిలర్లను దారిలోకి తెచ్చుకుని చైర్మన్ గిరీ కొట్టేశారని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ భరత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే... కుప్పం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక చాలా అనైతికం, ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే, చంద్రబాబు ఎమ్మెల్యేగా ఉన్న కుప్పంలోనే ప్రజాస్వామ్యం అపహాస్యం అయితే ఆయన సీఎంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎలా పరిరక్షిస్తారని ప్రశ్నిస్తున్నాం. వైయస్ఆర్‌సీపీకి 19 మంది కౌన్సిలర్ల బలం ఉన్నా ఈ రోజు ఛైర్మన్ ఎన్నికలని తెలియగానే ఎన్ని రకాలుగా బెదిరించాలో అన్ని రకాలుగా చేశారు, బెదిరించి, భయపెట్టి ఒక్కో అభ్యర్ధికి రూ. 50 లక్షలు ఆఫర్ చేసి బలవంతంగా వైయస్ఆర్‌సీపీ నుంచి టీడీపీలో చేర్చుకున్నారు. 10 మందిని ఈ రకంగా ప్రలోభపెట్టి, భయపెట్టి మేం విప్ జారీచేసినా విప్ ధిక్కరిస్తూ వారు వ్యతిరేకంగా ఓటు వేశారు. అయినా కూడా 9 మంది కౌన్సిలర్లు భయపడకుండా, జంకకుండా జగనన్నతోనే మేం ఉంటామని ఓటు వేశారు. ధైర్యం ఉంటే టీడీపీకి ఓటు వేసిన వారు రిజైన్ చేసి మళ్ళీ గెలిచి ఛైర్మన్ పదవి తీసుకుని ఉంటే బావుండేది. గతంలో జగన్ గారు మాత్రం ఇలా వస్తామంటే మీరంతా పోటీచేసి గెలిచిరండి అని ఖరాఖండిగా చెప్పారు. వైయస్ఆర్‌సీపీ గుర్తుపై గెలిచి వ్యతిరేకంగా ఓటు వేసిన వారిపై హైకోర్టులో కేసు వేసి వారి పదవులు పోయేలా చేస్తాం. విప్ ధిక్కరించినందున వారిపై చర్యలు తప్పవు. రాబోయే ఎన్నికల్లో కుప్పంలో వైయస్ఆర్‌సీపీ జెండా ఎగురవేస్తాం. ఇలాంటి క్లిష్టపరిస్ధితుల్లో మాతో ఉన్న కౌన్సిలర్లు 9 మందికి చేతులు జోడించి నమస్కరిస్తున్నా. కూటమి నేతలు అధికారం ఎల్లకాలం మీ దగ్గర ఉండదని గుర్తించుకోవాలి, కుప్పం నియోజకవర్గంలో వేలాది మంది వైయస్ఆర్‌సీపీ సైనికులు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో వైయస్ఆర్‌సీపీ జెండా ఎగరడం ఖాయమని భరత్ ధీమా వ్యక్తం చేశారు.