దొడ్డిదారిలో పదవులు కైవసం చేసుకోవటం సిగ్గుచేటు

 తాడేప‌ల్లి:  స్థానిక సంస్థ‌ల్లో బ‌లం లేక‌పోయినా దొడ్డిదారిలో కూట‌మి నేత‌లు ప‌ద‌వులు కైవ‌సం చేసుకోవ‌డం సిగ్గుచేట‌ని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌య ఇన్‌చార్జ్‌, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి విమ‌ర్శించారు. ఇవాళ విశాఖపట్నం, గుంటూరు నగర మేయర్‌ పదవులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరో ఐదు మున్సిపాలిటీలలో మొత్తం తొమ్మిది పదవులకు జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ కూట‌మి నేత‌లు అనుస‌రించిన తీరును అప్పిరెడ్డి తీవ్రంగా ఖండించారు.   తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..స్థానిక సంస్థ‌ల ప‌ద‌వుల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ కూట‌మి ప్ర‌భుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింద‌ని మండిప‌డ్డారు. 

స్థానిక సంస్థల్లో సజావుగా సాగుతున్న పాలనను చంద్ర‌బాబు చెడగొడుతున్నార‌ని ఫైర్ అయ్యారు. ప్రజలు మెజారిటీ ఇవ్వనప్పుడు ఎందుకు అధికారం కోసం  తాపత్రయం పడుతున్నార‌ని ప్ర‌శ్నించారు.  గ‌తంలో తాడిపత్రి మున్సిపాలిటీలో మా పార్టీకి స్వ‌ల్ప మెజారిటీ త‌గ్గినా మేం ప్ర‌జాస్వామ్యాన్ని గౌర‌వించామ‌ని, అక్క‌డి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి సైతం వైయ‌స్ జగన్ ని మెచ్చుకున్నారని గుర్తు చేశారు.  ఇవాళ ఏం జరుగుతుందో చూసి జనం నవ్వుతున్నారని తెలిపారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఏరకంగా టీడీపీ గెలుస్తుంది?, మాచర్ల,  తుని, విశాఖపట్నం, గుంటూరు ఇలా అన్నిచోట్లా వైయ‌స్ఆర్‌సీపీ సభ్యులే అధికంగా ఉన్నార‌ని చెప్పారు. మా సభ్యులను ప్రలోభపెట్టి, బెదిరించి టీడీపీ వైపు తిప్పుకున్నార‌ని ఆక్షేపించారు. ఫ్యాను గుర్తు మీద గెలిచిన వారిని టీటీడీ వైపు లాక్కున్నారని దుయ్య‌బ‌ట్టారు. విప్ ని ధిక్కరించిన వారిపై కోర్టుకు వెళ్తామ‌ని, పార్టీ పరంగా చర్యలు తీసుకుంటున్నామ‌ని లేళ్ల అప్పిరెడ్డి హెచ్చ‌రించారు. 

Back to Top