రాజమహేంద్రవరం: కూటమి ప్రభుత్వం రూ.3 వేల కోట్ల విలువైన భూములను కారుచౌకగా కట్టబెట్టిన 'ఉర్సా' మంత్రి నారా లోకేష్ బినామీ సంస్థ అని మాజీ ఎంపీ, వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి మార్గాని భరత్ ఆరోపించారు. రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడుతూ ఏపీలో కారుచౌకగా ఈ సంస్థకు భూములను కట్టబెట్టాలనే కుట్రలో భాగంగానే 'ఉర్సా' ఆవిర్భవించిందని వెల్లడించారు. మంత్రి నారా లోకేష్ అమెరికాకు వెళ్ళడానికి ముందు నెలలోనే 'ఉర్సా' కంపెనీ రిజిస్టర్ అయ్యిందని అన్నారు. ఇండియాలో ఆ సంస్థను రిజిస్టర్ చేసిన రెండు నెలల్లోనే వేల కోట్ల విలువైన భూములను కట్టబెట్టేందుకు ఆఘమేఘాల మీద ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చిందని తెలిపారు. ఇది భారీ కుంభకోణం కాదా అని ప్రశ్నించారు. ఇంకా ఆయనేమన్నారంటే... ఐటీ మంత్రి నారా లోకేష్ 2024 అక్టోబర్‌లో అమెరికాలో పర్యటించారు. సరిగ్గా ఆయన పర్యటనకు ముందు నెల అంటే 2024 సెప్టెంబర్ 27న అమెరికాలో ఉర్సా క్లస్టర్స్ అనే సంస్థను ఎన్‌ఆర్‌ఐ ప్రమోటర్లు కౌశిక్ పెందుర్తి, సతీష్ అబ్బూరిలు రిజిస్టర్ చేశారు. దీనికి అనుబంధ సంస్థగా ఇండియా ఉర్సా క్లస్టర్స్ పైవేట్ లిమిటెడ్ ను 2025 ఫిబ్రవరి 12వ తేదీన రిజిస్టర్ చేశారు. ఈ సంస్థ ప్రధాన కార్యాలయంను హైదరాబాద్‌లోని ఒక రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌లో చూపించారు. అమెరికాలోనూ ఒక సాధారణ ఇంట్లో ఈ సంస్థ అంతర్జాతీయ కార్యాలయం ఉంది. ఈ సంస్థకు సంబంధించి ఏ సామర్థ్యంను చూసి ఇన్ని వేల కోట్ల విలువైన భూములను కారు చౌకగా ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందో అర్థం కావడం లేదు. ఇంత విలువైన భూములను కేటాయించేందుకు చకచక ఫైళ్ళు పరుగులు తీయించడం వెనుక మంత్రి నారా లోకేష్ ఉన్నారు. తన బినామీలకు కేటాయించేందుకే ఎటువంటి నిబంధనను పాటించలేదు. ఉర్సా భూముల కుంభకోణంపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తుంటే, సీఎం చంద్రబాబు, నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పరిశ్రమలశాఖమంత్రి ఎందుకు స్పందించడం లేదు? ఉర్సా పేరుతో ఒక సూట్‌కేస్ కంపెనీకి రూ.3 వేల కోట్ల విలువైన భూములను అతి తక్కువ రేటుకే అప్పగిస్తుంటే ఎందుకు మాట్లాడటం లేదు. గజం రూ.30 వేలు పలుకుతున్న విశాఖ కాపులుప్పాడు భూములను రూ.50 లక్షలకు ఎలా విక్రయిస్తున్నారు? దీనిలో మతలబు ఏమిటీ? ఇంత పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతుంటే చీఫ్ సెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీలు ఏం చేస్తున్నారు? ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వ భూములను ఎలా విక్రయిస్తారు? కేంద్ర సంస్థలకు ఎక్కువ రేట్లకు భూ కేటాయింపులు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలైన ఎల్‌ఐసీ, ఆర్బీఐ, ఎస్బీఐ, ఆయిల్ కార్పోరేషన్ తదతర సంస్థలకు విశాఖ, అమరావతిలో ఎకరా సుమారు రూ.4 కోట్ల చొప్పున రేటు ఖరారు చేశారు. కానీ ఊరు పేరు లేని ఉర్సా సంస్థకు వేల కోట్ల విలువైన భూములను ఎకరం రూ.50 లక్షలకు ఎలా విక్రయిస్తామని ముందుకు వచ్చారు? ఇది చంద్రబాబు, లోకేష్ బినామీలకు మేలు చేయడం కోసం కాదా? దేశ రక్షణకు అత్యంత కీలకమైన ఇండియన్ ఆర్మీకి సైతం ఎకరం రూ.కోటికి విక్రయించారు. ఉర్సాకు మాత్రం ఇంత తక్కువకు 56 ఎకరాలు ఎలా ఇస్తున్నారు? ఎందుకు ఈ సంస్థపై ప్రేమ? ఇది కాకుండా ఐటీ పార్క్‌లో ఎకరం మూడున్నర ఎకరాలను ఎకరం కోటిన్నరకు ఎలా ఇస్తున్నారు? మేం కూడా ఐటీ కంపెనీలు పెడతామంటే ఇదే విధంగా భూములు ఇస్తారా? గతంలో బిల్లీరావుకు ఇదే తరహాలో చంద్రబాబు భూకేటాయింపులు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ఆపద్దర్మ సీఎంగా ఉన్న సమయంలో ఆయకు సన్నిహితుడైన బిల్లీరావుకు ఐఎంజీ భారత్ అనే సంస్థ పేరుతో శంషాబాద్‌లో నాలుగు వందల ఎకరాలను కట్టబెట్టే ప్రయత్నం చేశారు. వైయస్ రాజశేఖరరెడ్డి సీఎం అయిన తరువాత ఈ కుంభకోణంపై విచారణ జరపడంతో ఆనాడు చంద్రబాబు చేసిన కుట్ర, అవినీతి వ్యవహారం బయటపడింది. చివరికి న్యాయస్థానాల్లో దీనిపై వ్యాజ్యాలు దాఖలవ్వడంతో కోర్ట్‌ల జోక్యంతో ఆ భూములను కాపాడటం జరిగింది. అలాగే ఇప్పుడు ఉర్సా సంస్థకు జరుపుతున్న భూ కేటాయింపులపై కూడా సీబీఐ వంటి సంస్థలతో విచారణ జరపాలి. ఉర్సా సంస్థ ప్రమోటర్లు 21 సెంచరీ కంపెనీలు పెట్టి డీఫాల్ట్ అయిన చరిత్ర కూడా ఉంది. రెండు నెలల్లో పుట్టిన సంస్థకు ఇన్ని వేల కోట్ల భూములు ఎలా ఇస్తున్నారు? దీనికి కేబినెట్ ఎలా అనుమతులు ఇచ్చింది? ఈ కుంభకోణంను కప్పిపుచ్చుకునేందుకు ఐటీని ఏపీలో ప్రమోట్ చేసుకుంటున్నట్లుగా చంద్రబాబు బిల్డప్ ఇస్తున్నారు. ఐటీకి తానే ఆధ్యుడనని చెప్పుకునే చంద్రబాబు పక్క రాష్ట్రాల్లోని బెంగుళూరు, చెన్నై, ముంబై, పూణేల్లో ఐటీ పార్క్‌లు ఎలా వచ్చాయి? దానికి కూడా తానే ఆధ్యుడా? హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ కాంట్రాక్టర్‌లతో ఎన్టీఆర్ ట్రస్ట్ భవనాలను కట్టించుకోవడం నిజం కాదా? ఒకవైపు టీసీఎస్ వంటి ప్రముఖ ఐటీ సంస్థను ముందు పెట్టి 99 పైసలకు భూములను ఇచ్చి, దానిపైనే ప్రజల దృష్టి ఉండేలా చూడటం, తరువాత చాపకింద నీరులా ఉర్సా కంపెనీకి ఎకరం రూ.50 లక్షలకు విక్రయించేందుకు కుట్ర చేస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్‌లో ఆరితేరిన చంద్రబాబు భూకుంభకోణం విషయంలోనూ అలాగే చేస్తున్నారు. నారా లోకేష్ తోడల్లుడి కుటుంబానికి జయంతిపురంలో రూ.498 కోట్ల విలువైన భూములు నారా లోకేష్ తోడల్లుడు, విశాఖ ఎంపీ భరత్ తండ్రి పట్టాభిరామారావుకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జూలై 2015లో కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో ఏపీఐఐసీకి చెందిన నాలుగు వందల తొంబై ఎనిమిది ఎకరాల భూమిని కేవలం ఎకరం రూ.లక్షకు ఇచ్చారు. ఆనాడు మార్కెట్ రేటు ప్రకారం చూస్తే ఎకరం కోటి రూపాయలు ఉంది. అంటే రూ.498 కోట్ల విలువైన భూమిని ఎకరం రూ.లక్షకు ఇచ్చేశారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి సీఎంగా బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు బంధుప్రీతి లేకుండా అందరినీ సమానంగా చూస్తామని పదవీ బాధ్యతలు చేపట్టారు. కానీ దానినితూట్లు పొడుస్తూ, తమ బంధువులకు మేలు జరిగేలా చర్యలు తీసుకున్నారు. నక్కపల్లి భూములపై స్పందించాలి నక్కపల్లి ఏపీఐఐసీ భూములను ప్రైవేటు కంపెనీకి కట్టబెట్టే ప్రయత్నంపై ఏపీ చీఫ్ సెక్రటరీకి మాజీ కేంద్రప్రభుత్వ కార్యదర్శి శర్మ లేఖ రాశారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో స్టీల్ కర్మాగారం నిర్మాణం, తీర ప్రాంతంలో ఒక పోర్ట్ నిర్మాణంకు ఏపీఐఐసీకి నుంచి 2300 ఎకరాల భూమిని కూటమి ప్రభుత్వం ఆర్సెలర్ మిట్టల్ అనే ప్రైవేట్ కంపెనీకి ఇచ్చేందుకు సిద్దమయ్యింది. 2010 జూలైలో నక్కపల్లి మండలంలో ఎపిఐఐసీ 2300 ఎకరాలు భూమిని సేకరించింది. ఇది కాకుండా మరో 724 ఎకరాల ప్రభుత్వ భూమి, 753 ఎకరాల డీ పట్టా భూమిని కూడా సేకరించింది. ప్రభుత్వ భూమిని సేకరించినప్పుడు దానిని ప్రభుత్వరంగ సంస్థలకే కేటాయించాలి. 1894, 2013 భూసేకరణ చట్టాలకు విరుద్దంగా ప్రైవేటు సంస్థలకు ఎలా కేటాయిస్తారు? విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడాలి, క్యాప్టీవ్ మైన్స్ ఇవ్వాలని విశాఖవాసులు కోరుతుంటే కూటమి ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదు. కానీ చట్టాలను ఉల్లంఘిస్తూ, అక్కడి పర్యావరణంను దెబ్బతీసేలా ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం భూములు కట్టబెట్టేందుకు చర్యలు తీసుకుంటోంది. దీనిపై శర్మగారు రాసిన లేఖలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చిత్తశుద్ది ఉంటే ఈ లేఖపై ప్రభుత్వం అధికారికంగా వివరణ ఇవ్వాలి.