తాడేపల్లి: రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి టీడీపీనే కారణమని, మారుమూల గ్రామాల్లో కూడా వైరస్ వ్యాపిస్తుందంటే టీడీపీ స్లీపర్ సెల్స్ రంగంలోకి దింపిందేమోనని పశుసంవర్థక, మత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ అనుమానం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయ ఆవరణలో మంత్రి మోపిదేవి వెంటక రమణ విలేకరుల సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే.. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తికి టీడీపీనే కారణం. కరోనా వ్యాప్తికి టీడీపీ కార్యకర్తలు స్లీపర్ సెల్స్‌గా పనిచేస్తున్నారు. టీడీపీ స్లీపర్‌సెల్స్ రంగంలోకి దింపిందేమో.. అనుమానంగా ఉంది. మారుమూల గ్రామాల్లోకి వైరస్‌ను ప్రవేశపెట్టారా అనే అనుమానం కూడా వస్తుంది. గ్రామాల్లో కరోనా పాజిటివ్ కేసులు వస్తున్నాయంటే టీడీపీ కుట్ర దాగుందేమోననే అనుమానం కలుగుతుంది. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను, ఎన్నికల్లో ఓడించిన రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు చంద్రబాబు ఏ స్థాయికైనా దిగజారుతాడు. ఆ చర్యల్లో భాగంగానే ఇలాంటి చిల్లర రాజకీయాలకు చంద్రబాబు తెరలేపాడా అనే అనుమానం కలుగుతుంది. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. కన్నాలక్ష్మీనారాయణ గవర్నర్‌కు లేఖ రాయడం కూడా రాజకీయమే. దేశంలోఏ ముఖ్యమంత్రి చేపట్టని విధంగా అనేక విధాలైన కార్యక్రమాలు, చర్యలు సీఎం వైయస్ జగన్ తీసుకుంటున్నారు కాబట్టే ఏపీ సేఫ్ జోన్‌లో ఉంది. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. విపత్కర పరిస్థితుల్లోనూ ఆక్వారంగాన్ని ఆదుకునే ప్రయత్నం చేశాం. ఆక్వా రైతుల ఉత్పత్తులకు ఎగుమతుల అవకాశాన్ని కల్పించాం. కొనుగోలు ధరలను ముందే నిర్ణయించడం ద్వారా రైతులకు మేలు జరిగింది. 80 శాతం హేచరీస్ ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయి. రొయ్య పిల్లల ఉత్పత్తికి ప్రోత్సహాన్ని ఇస్తున్నాం. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే రొయ్యలకు 5 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచాలని నిర్ణయం. ఎలాంటి వైరస్ లేదని నిర్ధారించిన తరువాతే రైతులకు అందజేస్తాం. గుజరాత్‌లో చిక్కుకున్న మత్స్యకారులను వెనక్కి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పటికే సీఎం వైయస్ జగన్ కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో మాట్లాడారు’ అని మంత్రి మోపిదేవి తెలిపారు.