వేధించడం అంటే ఎలా ఉండాలో మాకు నేర్పుతున్నారా?

జైలులో మాజీ ఎంపీ నందిగాం సురేష్‌కు సజ్జల రామ‌కృష్ణారెడ్డి పరామర్శ 
 

గుంటూరు:వేధించడం అంటే ఎలా ఉండాలో మాకు నేర్పుతున్నారా అని వైయ‌స్ఆర్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేట‌ర్ స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి కూట‌మి ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. మీ కంటే బలంగా కొట్టగలిగే శక్తి వైయ‌స్ఆర్‌సీపీకి ఉంద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. మాజీ ఎంపి నందిగాం సురేష్ అక్రమ కేసుల్లో అరెస్టై నాలుగు నెలలు అవుతోందని, ఆధారాలు లేకుండా సురేష్‌పై కేసులు పెట్టారని ఆయ‌న అన్నారు. మంగళవారం గుంటూరు జైలులో నందిగం సురేష్‌ను పరామర్శించిన తర్వాత సజ్జల మీడియాతో మాట్లాడారు.

మాజీ ఎంపీకి కనీసం వాటర్‌ బాటిల్‌కి కూడా అనుమతి లేదా?
– దళితుడు, మాజీ ఎంపీ నందిగం సురేష్‌ అక్రమ కేసుల్లో అరెస్ట్‌ అయి దాదాపు నాలుగు నెలలవుతోంది. మాజీ ఎంపీ అయినా కూడా ఆయన పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదు. కనీసం తాగడానికి వాటర్‌ బాటిల్‌ తెచ్చుకోవడానికే అనుమతి నిరాకరించారంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతుంది. 
– దీని గురించి మేం ప్రశ్నిస్తే మరింత రెచ్చిపోతున్నారు. సీఎం కొడుకు, మంత్రి నారా లోకేష్‌ నేరుగా ఫోన్‌ చేసి ఆదేశాలిచ్చే పరిస్థితి. ఆయన ఆదేశాలు పాటించకపోతే ఏమవుతుందో అని అధికారులు భయపడుతున్నారు. 
– మూడు నాలుగేళ్ల క్రితం జరిగిన సంఘటనలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకున్నా, అప్పటికప్పుడు కేసులు బనాయిస్తున్నారు. నందిగం సురేష్‌కు బెయిల్‌ రాకుండా చూస్తున్నారు. అందుకే వాటిని తప్పుడు కేసులు అనాల్సి వస్తుంది. 

ఆనాడు మేము ఇలాగే వ్యవహరించి ఉంటే..:
– ఇప్పుడు సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్న విధంగా ఆనాడు శ్రీ వైయస్‌ జగన్‌ కూడా వ్యవహరించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. అధికారంలో ఉన్నామని ప్రత్యర్థులపై తప్పుడు కేసులు పెట్టలేదు. మాపై ఉన్న కేసులను తీసేయించాలని ప్రయత్నించలేదు. చట్టం తన పని తాను చేసుకుని పోయేలా ఎక్కడా కలుగజేసుకోలేదు. 
– కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పాత కేసులు తిరగదోడటంతో పాటు, ప్రత్యర్థులపై కొత్త కేసులు పెట్టి వేధిస్తున్నారు. న్యాయంగా ధర్మంగా వ్యవహరిస్తారని మేం ఏమరపాటుగా ఉన్నాం. ఇలా అక్రమంగా జైల్లో పెడతారని ఊహించలేదు. 
– కింది కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు న్యాయస్థానాల్లో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని రెచ్చిపోతున్నారు. 

సోషల్‌ మీడియా కార్యకర్తలపై వేధింపులు:
– వైయ‌స్ఆర్‌సీపీ ఉనికి లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారు. రెండు నెలలుగా సోషల్‌ మీడియా కేసులతో కార్యకర్తలను తీవ్రంగా వేధిస్తున్నారు. ఇది మామూలు కక్ష సాధింపు కాదు. శాశ్వతంగా లేకుండా చేయాలనేది వారి అజెండాగా కనిపిస్తోంది. కేసులు మీద కేసులు పెడుతున్నారు. పీటీ వారెంట్‌లతో జైళ్లకు తిప్పుతున్నారు. 
– మా అధ్యక్షుడు  వైయస్‌ జగన్‌కు సపోర్టుగా, వారికుండే స్వేచ్ఛతో ఎవరైనా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెడితే చాలు.. పార్టీలకు సంబంధం లేకుండా కేసులు పెట్టి వేధిస్తున్నారు. పార్టీ కూడా కానక్కర్లేదు.. ఆయన అభిమాని అయినా చాలు.. వదిలి పెట్టడం లేదు.
– ముగ్గురు పిల్లల తల్లి అని కూడా చూడకుండా పెద్దిరెడ్డి సుధారాణిని, ఆమె భర్తను జైల్లో పెట్టారు. జగన్‌ మీద అభిమానంతో ఎప్పుడో రెండేళ్ల కిందట పెట్టిన పోస్టును చూపించి అరెస్టు చేశారు. 
– గుంటూరులో రెండు వారాల క్రితం వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త ప్రేమ్‌ను అర్థరాత్రి అరెస్ట్‌ చేశారు. ఇంట్లో ఆడవారిని భయపెట్టి.. వచ్చింది పోలీసులో.. రౌడీలో అర్థం కాని పరిస్థితిలో నంబర్‌ లేని కారులో తీసుకెళ్లిపోయారు. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం నక్సలైట్ల విషయంలో ఇలాంటి అరెస్టులను చూశాం. 

కక్ష సాధింపులో కొత్త పద్ధతులు:
– కూటమి నాయకులు ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే వేధింపులు ఎలా చేయాలో మాకు నేర్పిస్తున్నట్టుగా ఉంది. భవిష్యత్తులో అధికారంలోకి వస్తే మేం ఎలా వ్యవహరించాలో రాసిపెట్టుకోమని మాకు సూచించినట్టుగా అర్ధమవుతోంది. 
– నాడు వైఎస్‌ జగన్‌ కూడా చంద్రబాబులా అనుకుని ఉంటే మేం అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే చంద్రబాబు జైల్లో ఉండేవాడు. మేం అలా అనుకోలేదు కాబట్టే ఆయన కేసుల్లో సుదీర్ఘ దర్యాప్తు చేసి పూర్తి ఆధారాలతో అరెస్ట్‌ చేశాం. 
– జగన్‌గారు ఆనాడు ప్రజా సమస్యలపై, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టారు. ఆయన ఆశయాలకు అనుగుణంగానే పార్టీ కూడా నడిచింది.  ఈరోజుకీ అలాగే ఉంది. 
– చంద్రబాబు గతంలో సీఎంగా పనిచేసినప్పటి కంటే మరింత దిగజారి పోయారు. ప్రజలు అధికారం ఇచ్చింది ఏ విధంగా దండుకోవాలి? మన సంపద ఎలా పెంచుకోవాలి? మన వారికి ఆ సంపద ఎలా పంచాలి? ప్రత్యర్థులను ఎలా వేధించాలి? వారి ప్రయోజనాల కోసం ఎలా పని చేయాలి? అన్న ధోరణిలోనే చంద్రబాబు పని చేస్తున్న విషయం ఈ ఆరు నెలల పాలనతో ప్రజలకు అర్థమైంది. 
– మేం మౌనంగా ఉన్నామంటే చేతకాక కాదని గుర్తు పెట్టుకోవాలి. డైవర్షన్‌ పాలిటిక్స్‌ ఎల్లకాలం నడవవు. 
– మేం అధికారంలోకి వచ్చాక ఇవన్నీ మేం చేయలేమా? మేం వద్దన్నా మా వాళ్లు ఆగుతారా? ఎక్కడికక్కడ ఇదే పని చేయడం మొదలుపెడితే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలి.  
– వైయ‌స్ఆర్‌సీపీ దగ్గర వారి లాగా గుంటనక్క తెలివితేటలు ప్రదర్శించడం ఉండదు. మేం అధికారంలోకి వచ్చాక పులి పంజా దెబ్బ రుచి చూపిస్తాం.
– దెబ్బ కొడుతున్నావంటే, ఎలాగైనా కొట్టొచ్చని చూపిస్తున్నావంటే.. ఎలాగైనా కొట్టడంలో నీ కన్నా బలంగా కొట్టడంలో నీకన్నా బలంగా కొట్టగలమని నిరూపిస్తాం.. ఆ సత్తా వైయ‌స్ఆర్‌సీపీకి ఉంది. 
– వైయ‌స్ఆర్‌సీపీ అభిమానులు కొట్టే దెబ్బ చాలా భయంకరంగా ఉంటుంది. ఇప్పటికైనా ప్రాప్తకాలజ్ఞతతో ఆలోచించి చంద్రబాబు, ఆయన అనుచరులు ఆలోచిస్తే ఆయనకు, వారి పార్టీకి, రాష్ట్రానికి, మంచిదని విజ్ఞప్తి చేస్తున్నాం.
– ఆరు నెలల్లోనే ప్రభుత్వం మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. కూటమి పార్టీల్లోనే తన్నుకుంటున్నారు. ఇంకో ఆరు నెలలాగితే రోడ్డున పడతారు.
–ఆ పై రెండేళ్లాగితే ఎన్నికలొస్తాయి. ఇదంతా దృష్టిలో ఉంచుకుని విజ్ఞతతో ఆలోచించమని చంద్రబాబుకు, కూటమి నాయకులకు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు.

Back to Top