హైదరాబాద్ : తన తండ్రి హత్యపై సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌కు వైయస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి ఫిర్యాదు చేశారు. కొంతమంది కావాలనే తన తండ్రి పేరు, ప్రతిష్టలను దిగజార్చేలా నకిలీ వార్తలను రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఈ మేరకు శుక్రవారం తన భర్త రాజశేఖరరెడ్డితో కలిసి సైబారాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తును ప్రభావితం చేసేలా తప్పుడు వార్తలను ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విటర్, యూట్యూబ్‌లలో ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తప్పులు వార్తలను ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. కాగా, వైయస్ వివేకానంద హత్య కేసు దర్యాప్తు జరుగుతున్న తీరు, చంద్రబాబు చేస్తున్న తప్పుడు ప్రచారంపై ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘాన్ని, కేంద్ర హోం శాఖ కార్యదర్శిలకు సునీతారెడ్డి ఫిర్యాదు చేశారు. వైయస్ వివేకానందరెడ్డి హత్యపై సీఎం చంద్రబాబు నాయుడుతో సహా టీడీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సునీతారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేసును తప్పుదోవ పట్టించడానికి అనేక కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు. హత్య జరిగి ఇన్ని రోజులైనా కూడా.. నిందితులు ఎవరనే విషయం ఇప్పటికీ బయటకు రాలేదన్నారు. తమ కుటుంబసభ్యులపై మితిమీరిన దృష్టి పెడుతూ అసలైన అనుమానితుల స్టేట్‌మెంట్లను, మెడికల్ రిపోర్టులను మార్చే ప్రయత్నం జరుగుతోందని వివరించారు. సిట్ ఆధ్వర్యంలో ఈ కేసు విచారణ నిష్పక్షపాతంగా జరిగే పరిస్థితి లేని నేపథ్యంలో ఎలాంటి ఒత్తిళ్లకు గురికాని ప్రత్యేక సంస్థ ద్వారా విచారణ జరిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.